చంద్రబాబుని తెలంగాణ కనికరించేనా.?

ఓ వైపు హైటెక్‌ సిటీ, ఇంకోవైపు పోలవరం ప్రాజెక్ట్‌.. విశాఖలో తెలుగుదేశం పార్టీ 'పసుపు' పండుగ - మహానాడులో 'ప్రత్యేకత' ఇదే.! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తనకు రెండు కళ్ళు.. అని చెప్పుకోడానికి చంద్రబాబు పడ్తున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ తాపత్రయంలోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ పోలవరం - హైటెక్‌ సిటీ కాన్సెప్ట్‌. 

హైటెక్‌ సిటీ చంద్రబాబు హయాంలో నిర్మితమయ్యింది. మరి, పోలవరం ప్రాజెక్ట్‌ సంగతేంటి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తవుతుందా.? కేంద్రం, రాష్ట్రం కోరినన్ని నిథులు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తుందా.? ఈ ప్రశ్నలు ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలే. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌, పోలవరం ప్రాజెక్టు భారాన్ని భరించడం అంత తేలిక కాదు. ఆ విషయం చంద్రబాబుకీ తెలుసు. కానీ, 'గ్రావిటీ' పేరు చెప్పి, పోలవరం ప్రాజెక్టుపై కొత్త కథ విన్పిస్తున్నారాయన. 

పోలవరం సంగతి అలా వుంచితే, మహానాడులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలు హల్‌చల్‌ చేశారు. అయితే, తెలంగాణ నేతలు చాలా చాలా చాలా తక్కువగా కన్పించారు. అసలంటూ, చెప్పుకోడానికి తెలంగాణలో టీడీపీకి ఎంతమంది పెద్ద నేతలు వున్నారు గనుక.! ఆ లోటు మహానాడు వేదికపై సుస్పష్టమయ్యింది. తెలంగాణలో టీడీపీ ప్రస్తుత దుస్థితికి చంద్రబాబే కారణం. తెలంగాణ శాఖ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో, అప్పటినుంచీ పతనం పీక్స్‌కి వెళ్ళిపోయింది. అఫ్‌కోర్స్‌.. అంతకు ముందు గొప్పగా వుందని కాదు. తెలంగాణకి జై కొట్టినప్పటినుంచీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యింది తెలంగాణలో. 

అయినా, చంద్రబాబుకి తెలంగాణ మీద 'యావ' తగ్గలేదు. 'జాతీయ నాయకుడ్ని' అన్పించుకునే క్రమంలో ఇంకా చంద్రబాబు తెలంగాణని పట్టుకుని వేలాడుతున్నారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌లో ఒక్కటంటే ఒక్క సీటుతో సరిపెట్టుకోవడంతోనే, తెలంగాణలో టీడీపీ జీరో అయిపోయిందనే విషయం అందరికీ అర్థమయ్యింది. చంద్రబాబుకీ అర్థమయినా, ఎవర్నో మభ్యపెట్టే ప్రయత్నమైతే ఆయన ఇంకా ఇంకా చేస్తూనే వున్నారు.  Readmore!

మొన్నటికి మొన్న తెలంగాణలో నిర్వహించిన తెలంగాణ టీడీపీ మహానాడులో చంద్రబాబు కన్పించారుగానీ, చప్పటి ప్రసంగంతో ఉస్సూరుమన్పించారు. ఒకప్పటి టీడీపీ సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తాజా వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అసలు తెలంగాణలో టీడీపీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. నిజమే, ఒకప్పటి టీడీపీ ముఖ్య నేతలంతా, ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే వున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఒకప్పుడు టీడీపీ ముఖ్యనేత. నూటికి 90 శాతం టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, ఒకప్పటి టీడీపీ నేతలే కదా.! ముఖ్య నేతలు జారిపోయాక, క్యాడర్‌ వుంటుందని చంద్రబాబు నమ్మితే అంతకన్నా ఫూలిష్‌నెస్‌ ఇంకోటుండదు. 

మహానాడు.. అంటే, అన్ని విషయాలూ చర్చించుకుని, పార్టీకి దశ దిశ నిర్ణయించేందుకు ఓ వేదిక. కానీ, ఇక్కడ దశ - దిశ ఏమీ కన్పించడంలేదు. జస్ట్‌ సొంత డబ్బా తప్ప, ఆ డబ్బానే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడీ దుస్థితిని తీసుకొచ్చింది.

Show comments