'ఈనాడు' కు ఇంత అత్యుత్సాహం ఏమిటో..!

మొత్తానికి యూపీలో బీజేపీని గెలిపించాలని ఈనాడు పత్రిక ఫిక్సయిపోయినట్టుంది! మన రాష్ట్రం కాదు.. మన భాష కాదు.. మన ఏరియా కాదు.. అయినా అక్కడి వ్యవహారాలపై ఈనాడు కుళ్లు జోకులు చాలా ఎక్కువైపోతున్నాయి. ఒక రోజు కాదు.. ప్రతి రోజూ యూపీ మీదే వీళ్ల హాస్యం! యూపీలో బీజేపీ గెలిచేయబోతోందని.. దీంతో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కి కంటి మీద కునుకు లేకుండా పోయిందని.. “ఈనాడు’’ చెప్పుకొస్తోంది! దీని మీదే ఈనాడు కార్టూన్ల ప్రహసనం కొనసాగుతోంది!

ముందు రోజేమో ఒక కార్టూన్ వేశారు. శ్రీధర్ వేసిన ఈ కార్టూన్ లో అఖిలేష్ ఏమో తనకు మోడీ కల్లోకి వస్తున్నాడని ములాయంకు మొరపెట్టుకుంటుంటే.. ములాయం ఏమో తనకు అమితా షా కల్లోకి వచ్చాడని అఖిలేష్ కు చెప్పుకొంటూ ఉంటాడు. అలాగే యోగాడే సందర్భంగా వేసిన కార్టూన్లో మోడీకి భయపడి అఖిలేష్ యాదవ్ అతి భయాసనం వేస్తుంటాడని మరో  పదునులేని చణుకు. ఇక మరో కార్టూన్ సారాంశం ఏమనగా.. వందమంది సిట్టింగులకు టికెట్ దక్కకపోవచ్చని అఖిలేష్ చేసిన కామెంట్  పై ‘ఈనాడు’ స్పందిస్తూ.. “వందమందిని మనం పంపిస్తున్నాం.. మిగతా వాళ్లను ఓటర్లు ఇంటికి పంపించేనట్టు న్నారు సార్’ అని అఖిలేష్ సహాయకుడు చెబుతున్నట్టుగా హాస్యాన్ని పండించే యత్నం చేసింది.

మరి మోడీ భజన చేస్తే చేయొచ్చు కానీ.. మరీ ఇంతలానా, ఆలూ చూలూ లేకుండానే ఈనాడు యూపీ ఎన్నికల ఫలితాల గురించి ఇలా తేల్చేయడం ఏమిటో అర్థం కాని పరిస్థితి. అసలు ఈ యూపీ గోల ఎందుకు?! ఎన్నికలు కూడా వచ్చే ఏడాది. అవతలేమో బీజేపీ కి యూపీలో అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని.. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో 90 శాతం సీట్లు సాధించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం అజిత్ సింగ్ కాళ్లు పట్టుకోవడానికి కూడా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో తేటతెల్లం చేస్తున్నాయని జాతీయ పత్రికలు మొత్తుకొంటున్నాయి!

అయితే ఈనాడు మాత్రం అనుదినం అఖిలేష్ , ములాయంలు ఓడిపోబోతున్నారంటూ కార్టూన్లేసుకొంటూ కూర్చుంది! మరి కార్టూన్లు వేయడానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఉండగా.. ఎక్కడో ఉత్తరాది పాలిటిక్స్ గోల ఎందుకు? అంటే..ఈ పత్రిక కష్టాన్ని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు.

ఇక్కడ చంద్రబాబు పాలన మీద ఎలాంటి కార్టూనూ వేయడానికి లేదు. పాలన పక్కదారి పట్టినా.. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా.. పాలకుడి తప్పొప్పులను ఎంచడానికి మాత్రం వీళ్లకు ధైర్యం లేదు. ఇక కేసీఆర్ మీద కార్టూన్ వేసంత సీన్ కూడా లేదు! బాబు పై వేసే మనసు రాదు.. కేసీఆర్ పై వేసే ధైర్యం లేదు!

ఇక  జగన్ మీద వేద్దామా అంటే.. పాయింట్ లేదు! ఇంకేముంది.. ఎంతసేపూ మోడీ మీదే మనసు! మోడీని వీరుడు..శూరుడు.. సూపరు.. అంటే సెన్స్ లో కొన్ని కార్టున్లు వస్తుంటాయి. ఇవి రెండు రోజులకు ఒకటిగా వస్తాయి. ఇక మోడీని చూసి ఎవరెవరో భయపడి పోతున్నారని వచ్చే కార్టూన్లు ప్రతి రోజూ వస్తుంటాయి!

బాబును కాపాడుకొంటూ.. కేసీఆర్ కు సలాంలు చేస్తూ.. మోడీ భజన చేస్తూ.. ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొంటూ వివిధ పరిమితులు వల్లనే తెలుగు మీడియాలో తెలుగు వారికి అర్థం కాని హాస్యాన్ని పండించడానికి ఈ తరహా యత్నాలు సాగుతున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Photo Credit: EENADU

Show comments