'భజన'లో ఓవరాక్షన్‌...!

'స్వామి భక్తి' అనేది మనుషులు పుట్టినప్పటినుంచీ ఉంది. పొగడ్తలు, ప్రశంసలు యుగయుగాలుగా ఉన్నాయి. అన్ని విధాలుగా (సంపదలో, పలుకుబడిలో, అధికారంలో) గొప్పోళ్లయినవారికి 'భజన' చేయడం రామాయణ, మహాభారత కాలాల నుంచీ ఉంది. మనుషులు దేవుడికి భజన చేసినా, మనుషులు మనుషులకు (గొప్పోళ్లకు) భజన చేసినా అందులో ఓవరాక్షన్‌ విపరీతంగా ఉంటుంది. ప్రస్తుత రాజకీయాల్లోనూ ఇది ఎక్కువగానే ఉంది. రాజకీయాల్లో భజన తప్పదు. అధినేతలకు నాయకులు భజన చేయకపోతే వారికి మనుగడ ఉండదు.

నాయకులు అధినేతలకు భజన చేసేటప్పుడు అతిశయోక్తులే కాదు, అవాస్తవాలూ ఉంటాయి. అవాస్తవాలు చెప్పడంలో సీనియర్లూ పోటీ పడుతున్నారు. విశాఖలో జరిగిన టీడీపీ మహానాడులో ప్రసంగించిన ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన భజనలో అవాస్తవం చెప్పారు. 'చంద్రబాబు అధికారం కోసం అస్సలు ఆలోచించరు. ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తారు' అన్నారు. మరి ఇదే మహానాడులో చంద్రబాబు ఏమన్నారో యనమల వినలేదా?

'తెలంగాణలో అధికారంలోకి రావాలి. ఆంధ్రాలో శాశ్వతంగా అధికారంలో ఉండాలి' అన్నారు. అధికారం కోసం అస్సలు ఆలోచించని వ్యక్తి ఈ మాటలు ఎందుకంటారు? అధికారం కోసం ఆలోచించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించగలరా? ఏ రాజకీయ నాయకుడైనా అధికారం కోసం ఆలోచించడం సహజం. యనమల రామకృష్ణుడు రాజకీయాల్లో ఉన్నది అధికారం కోసమే. ఆయన్ని మంత్రి పదవి నుంచి తీసేస్తే బాధపడరా? సినిమా నటి కమ్‌ టీడీపీ నాయకురాలైన కవిత తనను వేదిక పైకి ఆహ్వానించలేదని భోరున ఏడుస్తూ వెళ్లిపోయింది.

ఇంత చిన్న విషయానికే ఏడ్చినప్పుడు అధికారం దక్కకపోతే ఏడవరా? చంద్రబాబు అధికారం వద్దనుకునే త్యాగశీలి కాదు. ఆయన వంద శాతం పక్కా రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో విలువలను తుంగలో తొక్కిన నాయకుడు. ఆయనకు అధికారమే పరమావధి. ఇక తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ 'ముఖ్యమంత్రి కేసీఆర్‌ దైవస్వరూపం' అని కీర్తించారు. గొల్లలు, కురుమలకు కుల దైవాలు మల్లన్న, బీరప్ప. వారి స్వరూపమే సీఎం కేసీఆర్‌' అని ఓ సభలో చెప్పారు.

టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయిన తలసానికి మొదట్లో చాలా ప్రాధాన్యం ఇచ్చారు కేసీఆర్‌. కీలకమైన ఎక్సయిజ్‌ శాఖ కూడా అప్పగించారు. కాని అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖను కట్‌ చేసి గొర్రెలు, పశువులు, చేపల శాఖను అప్పగించారు. ప్రస్తుతం దాంతోనే కాలక్షేపం చేస్తున్న తలసాని అధినేతకు భజన బాగానే చేస్తున్నారు. తెలంగాణలో, ఏపీలో ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన నాయకుల్లో కొందరు ప్రారంభంలో పదవుల మీద ఆశతో అధినేతలకు బాగా భజన చేశారు. 

తాము ఏ పార్టీల నుంచైతే వచ్చారో ఆ పార్టీలనే తీవ్రంగా విమర్శించారు. వీరిలో ఎవ్వరూ పాత పార్టీలకు రాజీనామా చేయలేదనే విషయం తెలిసిందే. అధికార పార్టీల్లో చేరిన కొత్తల్లో బాగా భజన చేసిన ఫిరాయింపుదారులకు ఆశలు అడియాసలు కావడంతో భజన మానుకున్నారు. కొందరు పూర్తిగా మౌనంగా ఉన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బీజేపీలో చాలా సీనియర్‌ నాయకుడు.

పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా చేశారు. అయినప్పటికీ ప్రధాని మోదీకి భజన చేయడంలో శృతిమించిపోయారు. ఆయన భజనను తట్టుకోలేని ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు 'వ్యక్తి పూజ మానుకో' అంటూ గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు కూడా. ఒకసారి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన వెంకయ్య ఆ సందర్భంగా 'మోదీ దేవుడిచ్చిన వరం' అని వ్యాఖ్యానించారు.  ఇదే మాట చాలా సభల్లో అన్నారు. ఈ పొగడ్త వింటే 'అతి వినయం ధూర్త లక్షణం' అనే సామెత గుర్తుకొస్తోంది.

ఇది ధూర్త లక్షణమని ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తించింది కాబట్టే వ్యక్తి పూజను ప్రోత్సహించొద్దని హెచ్చరించింది. 'మోదీ దేవుడిచ్చిన వరం' అని వెంకయ్య అనలేదని, మీడియాకు అందిన ప్రసంగ ప్రతిలో పొరపాటుగా ప్రచురితమైందని ఆయన సన్నిహితులు బొంకారు. ఇది చెవులో పూలు పెట్టడం తప్ప మరోటి కాదు.  కేంద్ర మంత్రుల్లో మోదీని అతిగా పొగిడేది వెంకయ్య ఒక్కడేననిపిస్తోంది. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఎందరో భజనపరులున్నారు. అధినేతలు వారి భజనకు పరవశులవుతున్నారు.

Show comments