పేరులో ఏముంది....?

'మబ్బులో ఏముంది?..నా మనసులో ఏముంది?..అని హీరోయిన్‌ అడిగితే దానికి హీరో 'మబ్బులో కన్నీరు..నీ మనసులో పన్నీరు'...అని సమాధానమిస్తాడు. ఇది డాక్టర్‌ సినారె రాసిన ఓ సినిమాలోని పాట. ఈ పాటంతా ఇలా ప్రశ్న జవాబుల రూపంలో సాగుతుంది. మనసులో పన్నీరువంటి భావాలు ఉంటాయోమోగాని మబ్బులో కన్నీరు ఉండదు. కాని ప్రజలకు సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంట్లను ఆధారం చేసుకొని రాజకీయ ప్రయోజనాలు పొందే తెలివితేటలు నాయకులకు ఉంటాయి. సెంటిమెంట్లను ఎగదోసే నేర్పు ఉంటుంది. మనుషుల పేర్లు కావొచ్చు, ప్రాంతాల పేర్లు కావొచ్చు, రాష్ట్రాల, జిల్లాల పేర్లు కావొచ్చు...ఏ పేరులోనైనా సరే సెంటిమెంట్‌ ఉంటుంది. 

పేర్ల వెనక విశ్వాసాలు, నమ్మకాలుంటాయి. పూర్వవైభవం ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. ఎవరికి అవసరమైన ప్రయోజనాలు వారికుంటాయి. 'ఏ పేరైతేనేం...పేరులో ఏముంది?'...అని తీసిపారేసేందుకు వీల్లేదు. పేర్ల కోసం ప్రాణాలిస్తాననడం, పదవీ త్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేయడం ఇప్పుడు తెలంగాణలో నాయకులకు ఫ్యాషనైపోయింది. ఇంతకూ ఈ పేర్ల గొడవ ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? అనుకుంటున్నారు కదూ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడైతే జిల్లాలను విభజించాలనుకున్నారో అప్పటినుంచే పేర్ల గొడవ మొదలైంది. 

'ఇంతింతై వటుడింతై' అన్నట్లుగా రకరకాల డిమాండ్లు, సెంటిమెంట్లు, బెదిరింపులు, ఉద్యమాల నేపథ్యంలో జిల్లాల సంఖ్య అంతకంతకు పెరిగి ప్రస్తుతం 31 దగ్గర ఆగింది. 'ఇదే ఫైనల్‌. ఇంతకు మించి చేసేది లేదు'..అని కేసీఆర్‌ తేల్చి చెప్పారు. పది జిల్లాల తెలంగాణ మ్యాప్‌ మారిపోతున్నది. జిల్లాల విభజన శాస్త్రీయమని, పారదర్శకమని, పరిపాలనా సౌలభ్యం కోసమని సర్కారు చెబుతుండగా, ఇదంతా అశాస్త్రీయమని, నియంతృత్వమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం సంగతి అలా ఉంచితే, జిల్లాల విభజనకు ప్రధాన కారణం కేంద్రం నుంచి నిధులు సంపాదించడమని కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు. 

కేంద్రం పథకాల అమలు కోసం జిల్లాల ప్రాతిపదికగా నిధులు ఇస్తుందని, కాబట్టి ఎక్కువ జిల్లాలుంటే ఎక్కువ నిధులు వస్తాయని (రాజకీయ చతురుడైన చంద్రబాబుకు ఈ విషయం తెలియదా?)  కేసీఆర్‌ విభజన వెనక అసలు కారణం చెప్పారు. ఆయన వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చెప్పలేంగాని జిల్లాల విభజన ప్రహసనంగా మారిందనేది వాస్తవం. ఇదొక ప్రహసనంగా మిగిలిపోతుందా? దీర్ఘకాలంలో ప్రయోజనాలు కలుగుతాయా? అనేది వేచి చూడాలి. జిల్లాలకు కొత్త పేర్ల నామకరణం, దాంట్లో సెంటిమెంట్ల దట్టింపు...ఇదంతా ఓ ప్రహసనం. ఫలితంగా దేవుళ్ల, దేవతల పేర్లతో, నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధుల పేర్లతో జిల్లాలు ఏర్పడుతున్నాయి. 

'సందట్లో సడేమియా' అన్నట్లుగా ముస్లింలు, ప్రధానంగా ఎంఐఎం పార్టీ నాయకులు జిల్లాలకు దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ముస్లింల పేర్లు తీసేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణలోని ఎక్కువ జిల్లాలకు, ఊళ్లకు ముస్లిం పేర్లున్న సంగతి తెలుసు. ఈ ప్రాంతంలో  నవాబుల పరిపాలన మొదలయ్యాక తెలుగు,  హిందూ పేర్లను మార్చేసి ముస్లిం పేర్లు పెట్టారు. ఇప్పటివరకు అవే కొనసాగుతున్నాయి. వాటిని మార్చేసి తెలుగు పేర్లు పెడతారేమోనని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు...రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌ను 'అనంతగిరి' పేరుతో జిల్లా చేస్తామన్నారు. అక్కడి అనంతగిరి కొండలు ప్రముఖ పర్యాటక ప్రాంతం. దీంతో ఆ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. 

శంషాబాద్‌ జిల్లాకు రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టాలనుకున్నారు. దీన్ని ఎంఐఎం వ్యతిరేకిస్తోంది. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఊళ్లకు ఉన్న ముస్లిం పేర్లు మారిస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని ఐంఐఎం చెబుతోంది. నవాబుల కాలంలో ముస్లిం ప్రముఖుల, పండితుల పేర్లు ఊళ్లకు పెట్టారని, వాటిని తొలగించడం మంచిది కాదంటోంది. ఆ పార్టీ కోరికను కాదంటే ఇది ఎన్నికల ప్రచారాంశంగా మారి తనకు నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతో కావొచ్చు వికారాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల పేర్లు అలాగే కొనసాగించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం.  

ఖమ్మం జిల్లాలో భద్రాచలం జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటు చేసి దానికి 'భద్రాద్రి కొత్తగూడెం' అని నామకరణం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో  గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా (అలంపురంలో జోగులాంబ ఆలయం ఉంది) , కరీనంగర్లో సిరిసిల్ల కేంద్రంగా రాజన్న జిల్లా (వేములవాడలో రాజరాజేశ్వర ఆలయం ఉంది) నల్గొండలో యాదాద్రి (యాదగిరి గుట్ట ఉంది) జిల్లా, ఆదిలాబాదులో కొమురం భీమ్‌ జిల్లా ఏర్పాటవుతున్నాయి. ఈ పేర్లన్నీ సెంటిమెంటుకు సంబంధించినవే. 

కొంతకాలం క్రితం కర్నాటకలో 12 పట్టణాలు/నగరాలకు అక్కడి ప్రభుత్వం పేర్లు మార్చేసరికి కొందరు తెలంగాణవాదులు ఈ రాష్ట్రంలోని పట్టణాలు/నగరాల పాత పేర్లను (రాజుల కాలం నాటివి) 
పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది కూడా తెలంగాణ సెంటిమెంటులో భాగమేనన్నారు.  దేశంలో ఇప్పటివరకు అనేక రాష్ట్రాల, జిల్లాల, నగరాల పేర్లు మారాయి. బొంబాయి పేరు ముంబయి అయింది. కలకత్తా పేరు కొల్‌కత అయింది. మద్రాసు పేరు చెన్నయ్‌ అయింది. ఒకప్పటి మద్రాస్‌ స్టేట్‌ తమిళనాడు అయింది. 

ఇలా అస్సాం పేరు అసొం అయింది. ఒరిస్సా పేరు ఒడిశా అయింది. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉంది. తాజాగా కర్నాటకలో రాజధాని అయిన బెంగళూర్‌ పేరును బెంగళూరుగా మార్చారు. బెల్గాం పేరు బెళగవి, బెళ్లారి పేరు బళ్లారి, బిజాపూర్‌ పేరు విజాపుర, చిక్మగళూరు పేరు చిక్కమగళూరు, గుల్బర్గా పేరు కలబుర్గి, హుబ్లీ పేరు హుబ్బళ్లి....ఇలా మార్చారు. పేర్లు మార్చడానికి పాలకులు చెప్పిన కారణం ఏమిటంటే...ఇవి కన్నడ భాషా సంప్రదాయం ప్రకారం లేవట. స్థానిక ప్రజల సెంటిమెంటుకు విరుద్ధంగా ఉన్నాయట. అందుకని మార్చామన్నారు.

తమిళనాడులోనూ అనేక జిల్లాలకు నాయకుల పేర్లు తగిలించారు.  ఉమ్మడి  ఆంధ్న్రపదేశ్‌లో కొన్ని జిల్లాల పేర్లు మార్చారు. నెల్లూరు జిల్లాకు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టిశ్రీరాములు పేరు తగిలించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత కడప జిల్లాకు ఆయన పేరు పెట్టారు.  ఒంగోలు జిల్లాను ప్రకాశం జిల్లాగా ఎన్నడో మార్చారు.  రాష్ట్రం విడిపోయాక ఆంధ్రలోని రాజమండ్రి పేరును 'రాజమహేంద్రవరం'గా పునరుద్ధరించారు. 

తెలంగాణలో అందమైన తెలుగు పేర్లను నవాబులు  మార్చినా  వీటి అసలు పేర్లు చాలామందికి తెలుసు. వరంగల్‌ పేరు ఓరుగల్లు అని, నిజామాబాద్‌ పేరు ఇందూరు అని, మహబూబాబాద్‌ పేరు మానుకోట అని, మహబూబ్‌నగర్‌ పేరు పాలమూరు అని...ఇలా చాలా పేర్లు చెప్పుకోవచ్చు. తొట్టతొలి తెలుగు రాజులుగా ప్రసిద్ధికెక్కి కరీంనగర్‌ ప్రాంతాన్ని పరిపాలించారు శాతవాహనులు. కరీంనగర్‌ అసలు పేరు 'ఎలగందల'. స్థానికంగా ఇప్పటికీ ఈ పేరు ప్రసిద్ధి. 

తెలంగాణలోని చాలా పట్టణాల్లో స్థానికులు అధికారిక పేరు కంటే స్థానిక పేరునే వాడుతుంటారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పాలమూరు పేరునే ఎక్కువమంది వాడతారు. అయితే అధికారిక పేర్లన్నీ నవాబుల కాలం నాటివే కొనసాగుతున్నాయి.  ఎందుకంటే పాలకులకు ముస్లిం ఓట్లు ప్రధానం. పేర్లు మారిస్తే వారు ఆగ్రహిస్తారు. అందుకే జిల్లాలో విభజనలోనూ మస్లిం పేర్ల మార్పు జోలికి పోవడంలేదు. 

-నాగ్‌ మేడేపల్లి

Show comments