వెలగపూడిలో పవన్ కల్యాణ్ రుబాబు!

పవన్ కల్యాణ్ చంద్రబాబు మీదా ఏమైనా యుద్ధానికి వెళ్తున్నాడా? లేదా దారి పొడవునా ఆయనతో యుద్ధం చేయడానికి గానీ, ఆయన మీద దాడులు చేయడానికి గానీ సంఘ విద్రోహక శక్తులు పొంచి ఉన్నాయా? 
లేదా,
చంద్రబాబునాయుడు-  పవన్ కల్యాణ్ పేరు వింటేనే జడుసుకుంటున్నారా? ఆయనకు ప్రజల్లో కొంత మేర క్రేజ్ ఉన్నదనే అంశానికి సాగిలపడిపోతున్నారా?

ఇలాంటి సరికొత్త సందేహాలు రేకెత్తే విధంగా... పవన్ కల్యాణ్ వెలగపూడి సచివాలయానికి  వచ్చి చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. పవన్ కల్యాణ్ రాక సందర్భంగా దారిపొడవునా... ఓవర్ యాక్షన్ అనదగిన రీతిలో ఏర్పాటుచేసిన పోలీసుల మోహరింపు, భద్రత ఏర్పాట్లు ఒక ఎత్తయితే.. పవన్ కల్యాణ్ తన ప్రెవేటు సైన్యం, బౌన్సర్ల పరివేష్టితుడై.. వారంతా చుట్టూ ఉండి నడుస్తుండగా.. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడం అనేది.. చాలా ఘోరమైన విషయంగా పలువురు భావిస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రెవేటు సైన్యాలకు, బౌన్సర్లకు సీఎం కార్యాలయానికి ఎంట్రీ ఉండదు. కానీ పవన్ కల్యాణ్ విషయంలో అలాంటి నిబంధనలేమీ చెల్లుబాటులోకి రాకుండాపోయాయి. పవన్ కల్యాణ్ ఏదో చంద్రబాబుకు ఒక ప్రాంత ప్రజల సమస్యలను నివేదించడానికి వచ్చినట్లుగా వ్యవహారం చోటు చేసుకోలేదు. ఆయనేదో చంద్రబాబు మీద, సెక్రటేరియేట్ మీద రుబాబు చేయడానికి, దండయాత్రకు వచ్చినట్లుగా వ్యవహారం పలువురి నోళ్లలో నానుతోంది. 

పవన్ కల్యాణ్ తాను ఉద్ధానం ప్రజల కోసం చేస్తున్న పోరాటం రాజకీయం కోసం మాత్రంకాదు అని  పదేపదే చెబుతున్నారు గానీ.. ఆయన వెలగపూడి రాక అనేది ఓ రాజకీయ కార్యక్రమం లాగానే సాగింది. చాలా పెద్దఎత్తున ర్యాలీగా పవన్ కల్యాణ్ సచివాలయానికి వచ్చారు. పవన్ కల్యాణ్ ఇంకా ఎన్నికల బరిలోకి దిగిన అనుభవం కూడా లేని ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు.. యువతరంలో మంచి ఆదరణ ఉన్న సినీ హీరో. అయినంత మాత్రాన ప్రభుత్వ నిబంధనలు అన్నీ ఇలాగే తుంగలో తొక్కేస్తారా? అని జనం ప్రశ్నిస్తున్నారు. 

సీఎం చంద్రబాబు కార్యాలయం మొత్తం సాధారణంగా కేంద్రబలగాల పహరా, చాలా పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఉంటుంది. అక్కడకు ఎంతటి వాళ్లు వచ్చినా.. తమ భేషజాలను పక్కన పెట్టి రావాల్సిందే. కాకపోతే.. పవన్ కల్యాణ్ విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఎలా ఉన్నాయో గానీ.. పోలీసులు ఫక్తు ప్రేక్షకపాత్ర వహించారు. పవన్ రుబాబు ఒక రేంజిలో సాగుతోంటే వారు చూస్తూ మిన్నకుండిపోయారు. ఆయన బౌన్సర్లను నిలువరించిన వారు కూడాలేరు. పోలీసులు చేసినదెల్లా.. తాళ్లుకట్టిన బారికేడ్లతో పవన్ ర్యాలీకి ఎలాంటి అవాంతరాలు కలగకుండా... తమవంతు సేవ మాత్రమే. 
హతవిధీ.. అని జనం నిట్టూర్చాల్సిందేనా?

Show comments