ఎవరికెన్ని సీట్లు: ఏపీ రాజకీయ స్థితిగతులపై ప్రశాంత్ సర్వే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారుగా నియమితం అయిన ప్రశాంత్ కిషోర్ చేయించిన సర్వేగా చెప్పబడుతున్న ఒక అధ్యయనం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి అంచనా వేయడానికి.. ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రశాంత్ ఈ సర్వేను చేయించుకున్నాడట. ముందుగా రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుని.. తర్వాత వ్యూహాలు పన్నాలనే థియరీ ప్రకారం ప్రశాంత్ ఈ సర్వేను చేయించుకున్నట్టు సమాచారం. 

వైకాపా తరపున ప్రశాంత్ రంగంలోకి దిగాడని అటు జగన్ వ్యతిరేక మీడియా వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి. మరి జగన్ కు ప్రశాంత్ ఎలాంటి సలహాలు ఇచ్చాడనే అంశం గురించి తెలుగుదేశం అనుకూల మీడియా తనకు అనుగుణమైన కథనాలను రాస్తోంది. జగన్ సోలోగా గెలవలేడని ప్రశాంత్ తేల్చేసినట్టుగా ఆ పత్రికలు చెప్పుకొచ్చాయి. మరి అసలు కథేమిటని ఆరా తీస్తే.. ప్రశాంత్ సర్వే గణాంకాల గురించి సమాచారం అందుతోంది.

వైకాపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులతో.. తన సిబ్బంది సారధ్యంలో ప్రశాంతం చేయించుకున్న ఈ సర్వే ప్రకారం.. వైకాపాకు ఆశాజనకమైన పరిస్థితులే ఉన్నాయని తేలిందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే.. వైకాపా కనీసం వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వేలో తేలిందని సమాచారం. 

ఏపీలో గల మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే వైకాపా విజయం సాధించగలదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలాన్ని జగన్ పార్టీ సమీకరించుకోగలదని ప్రశాంత్ సర్వే తేల్చిందట. మరి అధికార పార్టీ పరిస్థితి ఏమిటి అంటే.. తెలుగుదేశం పార్టీ నలభై సీట్లకు పరిమితం కావాల్సి ఉంటుందని తేలిందట. ఇక మిగిలిన ముప్పై ఐదు నియోజకవర్గాల్లోనూ వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ప్రశాంత్ సర్వే అంచనా వేసిందని తెలుస్తోంది.

ప్రాంతాల వారీగా చూస్తే.. మొత్తం ఆరు జిల్లాల పరిధిలో వైకాపా పూర్తి ఆధిపత్యాన్ని సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాల్లో వైకాపా కు తిరుగులేదని ప్రశాంత్ సర్వే లో తేలిందని సమాచారం. గ్రేటర్ పరిధిలో ఫిరాయింపుల వల్ల వైకాపాకు వచ్చిన నష్టం, తెలుగుదేశం పార్టీ కి వచ్చిన లాభం లేదని ప్రశాంత్ సర్వే పేర్కొనడం గమనార్హం. ఇక కోస్తాంధ్రలో మాత్రం వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్రమైన పోటీ తప్పదని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని వైకాపా సంపాదించుకోగలదని ప్రశాంత్ కిషోర్ అధ్యయనం తేల్చిందట.

ఇక వచ్చే ఎన్నికల్లో మిగిలిన రెండు రాజకీయ పార్టీలు.. అనగా బీజేపీ, జనసేనల ప్రభావం పై కూడా ప్రశాంత్ అధ్యయనం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు పార్టీల ప్రభావం పెద్దగా ఉండదని ప్రశాంత్ సర్వే అభిప్రాయడిందని సమాచారం. తెలుగుదేశం, బీజేపీలు కలిసి పోటీ చేసినప్పటికీ బీజేపీకి దక్కేదేమీ లేదని తేలిందట. కనీసం ఒకటీ అరసీటుతో బీజేపీ ఉనికిని చాటుకుంటే అదే గొప్పేనట.

పవన్ కల్యాణ్ ప్రభావం అస్సలు ఏ మాత్రం ఉండకపోవచ్చని ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే అంచనా వేయడం విశేషం. సోలోగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ చూపగపలిగే ప్రభావం ఏమీ లేదని.. ఏ స్థానంలో కూడా గెలవడం కానీ జరగదని అ సర్వేలో తేలిందట. ఇక ఫలితాలను మార్చేసేంత ప్రభావం కూడా జనసేనకు లేకపోవచ్చని ఈ సర్వే అంచనా వేసింది.

Show comments