ఇది దేశానికి సంబంధించిన సమస్య. ఒక రాష్ట్రానికి చెందినదో, ఓ రాజకీయ పార్టీకి చెందినదో కాదు. రాత్రికి రాత్రి సాధారణ ప్రజానీకం ఉలిక్కిపడ్డారుగానీ, రాజకీయ నాయకులు ఆ స్థాయిలో కంగారుపడలేదు. పారిశ్రామిక వర్గాలూ పెద్దగా షాక్‌కి గురైన సందర్భం కనిపించడంలేదు. రియల్ ఎస్టేట్ రంగం ఒక్కటీ కొంచెం కుదేలయినట్లు కన్పిస్తోంది. అది కూడా, బడా బాబులకి సంబంధించినది కాదు.. సాధారణ మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించిన వ్యవహారమే.
500, 1000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేసిన వెంటనే, భూగోళం తల్లకిందులైపోయిందనే భావన సామాన్యుల్లో స్పష్టంగా కన్పిస్తోంది. కానీ, రాజకీయ నాయకులు లైట్ తీసుకుంటున్నారు. చర్చా కార్యక్రమాల్లో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించేస్తున్నారు. అదే సమయంలో, విపక్షాలు విమర్శించాలి గనుక.. ఆచి తూచి విమర్శలు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు గట్టిగా, కొన్ని పార్టీలు మెత్తగా.. అంతే తేడా.
ఇలా, ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న చర్చా కార్యక్రమాల్లో 'గడచిన రెండు మూడు నెలల్లో మనీ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగాయి.. వాటి లోతుల్ని పరిశీలిస్తే.. ముందుగానే కొందరు నల్లదొంగలు జాగ్రత్తపడ్డారనే విషయం అర్థమవుతుంది. ఫలానా పార్టీ అని చెప్పడంలేదు.. ఫలానా వ్యాపారవేత్త అనడంలేదు.. కానీ, చాలామంది ముందే జాగ్రత్తపడ్డారు..' అంటూ ఓ రాజకీయ పార్టీకి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించడాన్ని అంత తేలిగ్గా తీసిపారెయ్యలేం.
ఈ మధ్యనే నల్లధనం వెలికితీతకు సంబంధించి, కేంద్రం అక్రమార్కులకి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అప్రకటిత ధనాన్ని స్వచ్ఛందంగా ప్రకటించేవారికి అదో వెసులుబాటు. విషయం బాగానే వర్కవుట్ అయ్యింది. వేల కోట్లు బయటకొచ్చాయి. ఇది నిజం. కానీ, ఆ ముసుగులో చాలా అక్రమాలు జరిగాయన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.
అధికార బీజేపీ, ఆ పార్టీతో సన్నిహితంగా వుండే పార్టీలు, నాయకులు.. ముందస్తుగా జాగ్రత్తపడివుండొచ్చన్నది ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శల సారాంశం. ఇదెంత నిజం.? అంటే, ఎంతో కొంత నిజం అయితే వుండే వుంటుంది. లేకపోతే, నేతలే రోడ్డెక్కి ప్రజల తరఫున ఆందోళనలు చేసేసి వుండేవారు. దేశాన్ని స్తంభింపజేసేసేవారే. కనీసం, రెండు మూడు నెలలు పాత నోట్లు చెలామణీ అయ్యేలా అవకాశం కల్పించాలనే డిమాండ్లూ తెరపైకి వచ్చేవి. చిత్రంగా అలాంటి డిమాండ్లు చాలా తక్కువగానే విన్పిస్తున్నాయి.
ఏదో మాయ జరిగింది. అదేంటో ఎక్కువ రోజులు అయితే దాగలేదు. రేపు కాకపోతే ఎల్లుండి.. వ్యవహారమైతే వెలుగచూడక తప్పదు. అప్పుడే తేలిపోతుంది అసలు దొంగలెవరో.!