జీతాలొస్తాయ్‌.. షరతులు వర్తిస్తాయ్‌

ఈ నెల జీతాలు వచ్చేస్తాయ్‌.. కానీ, షరతులు వర్తిస్తాయ్‌.! బ్యాంకుల్లో నగదు లేదు.. కాబట్టి, బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవడానికి వీలు పడదు. మీరు ఆన్‌లైన్‌ లావాదేవీలు చేయగలిగితే సరేసరి.. మొబైల్‌ బ్యాంకింగ్‌ అలవాటున్నాసరే సమస్యలు తగ్గుతాయి. ఈ రెండిట్లో ఏదీ లేకపోతే మాత్రం, డిసెంబర్‌ నెల చుక్కలు చూపించడం ఖాయం. 

వచ్చేస్తోంది డిసెంబర్‌.. ఈసారికిది కష్టాల కాలం. సాధారణంగా డిసెంబర్‌ అనగానే, ప్రకృతి వైపరీత్యాలు గుర్తుకొస్తాయి. మన దేశానికి సునామీ పరిచయమయ్యింది ఈ డిసెంబర్‌లోనే. డిసెంబర్‌ నెలలో అనేక ఉత్పాతాల్ని ప్రపంచం చూస్తోంది గత కొన్నేళ్ళుగా. ప్రపంచం మాటేమోగానీ, భారతదేశం మాత్రం కరెన్సీ ఉత్పాతాన్ని చవిచూడబోతోంది ఈ డిసెంబర్‌లో. నవంబర్‌లోనే ఈ కరెన్సీ ఎమర్జన్సీ దేశాన్ని వణికించడం మొదలు పెట్టింది. డిసెంబర్‌లో మాత్రం పరిస్థితి చెయ్యిదాటిపోనుంది. 

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్ల ద్వారా జీతాలు చెల్లించే సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సమస్యల్లేవు. జీతాలైతే వచ్చేస్తాయి. కానీ, చిన్న చిన్న పరిశ్రమలు మాత్రం, ఉద్యోగాలకు జీతాలిచ్చే పరిస్థితుల్లో లేవు. చెక్‌లు ఇస్తామని ఆయా సంస్థలు చెబుతున్నా, తీసుకునేందుకు కార్మికులు సుముఖత వ్యక్తం చేయని పరిస్థితి. ఒకవేళ తీసుకున్నా, 'జీతం చేతికి అందని' దుస్థితి వారిది. 

'ప్రజల ఇబ్బందుల్ని తొలగించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం..' అని ఇరవై రోజుల తర్వాత రిజర్వు బ్యాంకు గవర్నర్‌ మీడియా ముందుకొచ్చి చెప్పినా, ఉపశమన చర్యలేవీ కనిపించని దుస్థితి. దేశవ్యాప్తంగా ఈ రోజు ఆక్రోష్‌ దినంతోపాటు, బంద్‌ కూడా జరిగింది. అయినా, అధికారపక్షంలో చలనం లేదు. అయితే, విపక్షాల దెబ్బకి ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో రేపు పెదవి విప్పడానికి నిర్ణయించుకున్నారట. అంటే, రేపు కరెన్సీ సంక్షోభంపై ఏదన్నా ఉపశమనం రావొచ్చన్న ఆశ అయితే కన్పిస్తోంది. 

దేశంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు 20 శాతం కూడా లేని దుస్థితి. 10 శాతానికి అటూ ఇటూగా వున్నాయన్న ప్రచారం మాత్రమే జరుగుతోంది. ఆన్‌లైన్‌ లావాదేవీలెంత.? మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగమేంటి.? అసలు బ్యాంకులకు ఎంతమంది వెళుతున్నారు.? ఈ లెక్కలేవీ అటు రిజర్వు బ్యాంకు దగ్గరగానీ, ఇటు ప్రభుత్వం దగ్గరగానీ లేవు. వున్నా, వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన అసలే లేదు. వెరసి, పెద్ద నోట్ల రద్దుతో దేశం అతలాకుతలమైపోయింది. 

500 రూపాయల కొత్త నోటుని, చిత్తుకాగితంలా ఇష్టమొచ్చినట్లు ప్రింట్‌ చేసేసి, వినియోగంలోకి తీసుకురావడంలోనే 'గవర్నమెంట్‌ ఫెయిల్యూర్‌' సుస్పష్టం. ఇక, డిసెంబర్‌ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడం అన్న ఆలోచన ప్రభుత్వమెలా చేయగలగుతుంది.? నేడు నవంబర్‌ 28. ఇంకా రెండ్రోజులు మాత్రమే.. డిసెంబర్‌ 1 నుంచి దేశంలో పరిస్థితులెలా వుంటాయో, ప్రజల ఆక్రోశమెలా వుంటుందో వేచి చూడాల్సిందే.

కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వోద్యోగులకు కరెన్సీ రూపంలో కొంత జీతాన్ని ఇచ్చే ఆలోచనలు జరుగుతున్నాయి. మరి, సామాన్యుడి గతేంటి.? ఆ ఒక్కటీ అడగొద్దు.. సామాన్యడుంటే అందరికీ చులకనే.

Show comments