‘‘మర్డరు సెయ్యాలంటే కత్తి ఉండాలి గానీ.. సుమోలు, క్వాలిస్ లూ ఎందుకురా బుజ్జీ.. అసలే ఈ మద్దెన పెట్రోలు రేటు కూడా బాగా పెరిగిపోయింది... అందరూ కలిసి ఒక క్వాలిస్ యెళ్లొచ్చీయండి..’’ అంటూ ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా.. ఏపీలోని తెలుగుదేశం నాయకులకు మాత్రం అందులోని సారం బోధపడలేదు.
బహిరంగ చర్చకు సవాలు విసిరిన తర్వాత... తమ చిత్తశుద్ధిని నిజాయితీని నిరూపించుకోదలచుకుంటే గనుక.. దానికి తగిన సాక్ష్యాధారాలు కావాలే తప్ప... పదులసంఖ్యలో వాహనాలు, వందల సంఖ్యలో అనుచరుల్ని పోగేసుకుని కాన్వాయ్ తో రావడం ముఖ్యం కాదని వారు తెలుసుకోలేకపోయారు.
బహిరంగచర్చకు సవాలు విసిరిన తర్వాత.. మందిని పోగేసుకుని బయల్దేరిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన మాట నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలోనే కనీసం పోలీసు అనుమతి కూడా ఇప్పించుకోలేక భంగపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నదంటూ.. మాజీ ఎంపీ.. ప్రస్తుతం రాజకీయంగా తటస్థంగా ఉన్న ఉండవిల్లి అరుణ్ కుమార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే రెచ్చిపోయిన తెలుగుదేశం నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రెండు ప్రాజెక్టుల గురించి దమ్ముంటే, ప్రకాశం బ్యారేజీ మీద బహిరంగ చర్చకు రావాలంటూ సవాలు విసిరారు. ఆ సవాలును ఉండవల్లి స్వీకరించారు. సవాళ్లు నిజమే అయిఉంటే మంగళవారం ఈ చర్చ జరిగిఉండాల్సింది. కానీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో తెదేపాకు కాలం కలిసి వచ్చింది.
సవాలును స్వీకరించిన ఉండవిల్లి ముందురోజే విజయవాడకు వచ్చేసి, నిర్ణీత సమయానికి అరగంట ముందే ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. కానీ పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్టు చేసేశారు. అదే సమయంలో.. రాజమండ్రి నుంచి బోలెడు వాహనాల కాన్వాయ్, బోలెడు మంది అనుచరుల మందీ మార్బలంతో బయలుదేరిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మాత్రం పోలీసులు నచ్చజెప్పి ప్రకాశం బ్యారేజీ వైపు రాకుండా పంపేశారు.
ఒకే చర్చకు వచ్చిన ఉండవిల్లిని మాత్రం అరెస్టుచేసి, గోరంట్లకు మాత్రం నచ్చజెప్పి పంపేయడం ఒక ఎత్తు. అదే సమయంలో.. తన సవాలుకు తమ ప్రభుత్వం నుంచే అనుమతులు ఇప్పించుకోలేకపోవడం మరో ఎత్తు. అన్నిటినీ మించి.. ఉండవిల్లి లాంటి నాయకుడితో చర్చలో తలపడడానికి.. ఏదో దొమ్మీకి వెళుతున్నట్లుగా అనుచరుల్నంతా వెంటబెట్టుకుని పెద్ద కాన్వాయ్ తో రావడాన్ని గమనిస్తోంటే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అండ్ టీడీపీ వారికి... ‘అతడు’ సినిమాలో భరణి చెప్పిన తత్వం బోధపడలేదనే అనిపిస్తోంది.