పవన్.. వేసుకున్న ముసుగు నిలబడటం లేదు..!

ఫిరాయింపుదారుల అంశంలో తెలంగాణ వ్యవహారంపై మాత్రం ఘాటుగా స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో జరిగిన ఫిరాయింపులపై మాత్రం ఎందుకు స్పందించలేదు.. అనేది కొంతమంది దుష్టుల ప్రశ్న. తలసానికి మంత్రి పదవిని ఇస్తే దానిపై గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్ ఏపీలో నలుగురుకు పిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇచ్చినా మారు మాట్లాడలేదు. ఈ వ్యవహారంలో చంద్రబాబు తీరుకు, పవన్ కల్యాణ్ తీరుకు ఏమీ తేడాలేదు. తెలంగాణలో అయితే ఒకటి, ఆంధ్రాలో అయితే ఒకటి. బాబు రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు విలువల ప్రస్తావన ఎంత అనసవరమో, పవన్ కల్యాణ్ తీరులో కూడా అలాంటి విలువల హననమే జరుగుతోంది.

మరి ఈ వ్యవహారంలో డిఫెన్స్ కోసం మరో వాదన కూడా వినపడటం మొదలైంది. స్పందిస్తాడండీ... స్పందిస్తాడు... తీరిక దొరికినప్పుడు.. ఖాళీగా ఉన్నప్పుడు.. పవన్ కల్యాణ్ ఖండించేస్తాడు.. అని కొంతమంది వ్యాఖ్యానించసాగారు. అయితే.. ఇక ఫిరాయింపుదారులకు మంత్రిపదవుల వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించడం లేనట్లే! కనీసం ట్విటర్ ద్వారా అయినా కూడా పవన్ స్పందించడనే అనుకోవాల్సి వస్తోంది.

ఎందుకంటే.. ఇటీవలే పవన్ వేరే అంశం గురించి స్పందించాడు. అతడెవరో బీజేపీ ఎంపీ దక్షిణ భారతీయులపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఆ అంశంపై కొన్ని నిమిషాల వ్యవధిలోనే పవన్ రియాక్ట్ అయిపోయాడు. ఆ వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ఒక్క వ్యక్తినే నిందించాల్సిన పవన్ కల్యాణ్ ఏకంగా ఉత్తర భారతదేశాన్నే నిందించేశాడు. తన అజెండాకు అనుగుణంగా వ్యాఖ్యానించాడు.

మరి ఉత్తరభారతం, దక్షిణ భారతం విషయంలో నిమిషాల మీద రియాక్ట్ అయిన పవన్ ఫిరాయింపుదారుల విషయంలో మాత్రం ఇప్పటివరకూ మాట్లాడలేదు.  తెలంగాణలో తను ఖండించిన అంశం.. ఏపీ రాజకీయంలో భాగం అయిపోయినా పవన్ స్పందించలేదు. ఇదీ పవన్ కల్యాణ్ వ్యూహాత్మక రాజకీయం. 

అయినా ఏ ముసుగును అయినా కప్పి ఉంచడం కష్టమే. చంద్రబాబుకు డూపులా రాజకీయాలు చేస్తున్న పవన్ ఎంతలా ముసుగు వేసుకుందామని అనుకున్నా.. అది నిలవడం లేదు పాపం. ఏదోలా బయటపడిపోతూనే ఉంది.

Show comments