బాబు ప్రచార దాహం తీరనిది...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రచారం దాహం ఏమిటి? ఎందుకు? ఇప్పుడేమీ ఎన్నికలు జరగడంలేదు కదా...! నాయకులు, పాలకులు ప్రచారం చేసుకోవడానికి,  ఇమేజ్‌ పెంచుకోవాలనే ప్రయత్నాలు చేయడానికి ఎన్నికలే అవసరం లేదు. 'కాదేదీ కవితకనర్హం' అని మహాకవి అన్నట్లుగా కాదేదీ ప్రచారానికి అనర్హం అని చెప్పుకోచ్చు. చాలాకాలంపాటు రాజధాని అమరావతి నిర్మాణం గురించి ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తరువాత దాన్ని కొంత పక్కనపెట్టి కృష్ణా పుష్కరాలపై ప్రచారం ప్రారంభించారు. పుష్కరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రీ ఇంతగనం ప్రచారం చేసుండకపోవచ్చు. అదింకా కొనసాగుతూనే ఉంది. 

బాబు స్వయంగా పుష్కరాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమైన పుణ్య కార్యక్రమమనే భావన కలిగించేలా ప్రచారం చేశారు. ప్రచారానికి, ఘాట్లు తదితర నిర్మాణాలకు అవసరానికి మించి కోట్లు ఖర్చు చేశారని విమర్శలొచ్చినా లెక్కచేయలేదు. విదేశీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. మీడియాలో భారీఎత్తున ప్రచారం చేశారు. ఆహ్వానపత్రికలు ముద్రించి ఢిల్లీలోని ప్రముఖులు మొదలుకొని గల్లీ నాయకుల వరకు పంపిణీ చేశారు. సినిమా హీరోలు, ఇతర ప్రముఖుల ఇళ్లకు మంత్రులు, పార్టీ నాయకులు వెళ్లి స్వయంగా ఆహ్వానించారు.

పుష్కర హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన అనేక ఈవెంట్ల ద్వారా కృష్ణా పుష్కరాలకు ఇదివరకెన్నడూ లేని ఆకర్షణను తీసుకువచ్చారు. ఈ పుష్కరాలను ఉపయోగించుకొని ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచుకోవాలని, సర్కారు పథకాలకు మరింత ప్రచారం కల్పించాలని బాబు సర్వప్రయత్నాలు చేశారు. ఓ ఆంగ్ల పత్రిక చంద్రబాబును 'స్టార్‌ క్యాంపెయినర్‌' అని అభివర్ణించింది. అయినప్పటికీ చంద్రబాబు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారట....! జాతీయ స్థాయిలో పుష్కరాలకు తగినంత ప్రచారం లభించలేదని, ఈ విషయంలో అధికారులు విఫలమయ్యారని ఆయన తీవ్రంగా ఆవేదన చెందుతున్నట్లు ఓ పత్రిక కథనం. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంపై ఎంతగనం ఆవేదన చెందుతున్నారో తెలియదుగాని పుష్కరాలకు తగినంత ప్రచారం లభించలేదని మాత్రం బాధపడుతున్నారు. పుష్కరాల కవరేజీ కోసం ఢిల్లీ నుంచి జాతీయ మీడియా ప్రముఖులెవరూ రాలేదట...! అక్కడి నుంచి వచ్చిన తెలుగు మీడియా జర్నలిస్టుల్లో  తెలంగాణవారే ఎక్కువగా ఉన్నారట...! దక్షిణాదిలో ఆంధ్రాతోపాటు తెలంగాణ, కర్నాటకలోనూ, మరో పక్క మహారాష్ట్రలోనూ పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి దక్షిణాదంతా భారీగా ప్రచారమైనట్లే లెక్క. ఇది ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమం కాబట్టి ఉత్తరాదిలోనూ తెలియకుండాపోదు. 

కృష్ణా నది దేశంలోని పెద్ద నదుల్లో నాలుగోది.  కాబట్టి కృష్ణా పుష్కరాల గురించి ఉత్తర భారతంలోనూ తెలుస్తుంది. కాని బాబు ఇది కేవలం ఆంధ్రా ప్రభుత్వమే నిర్వహిస్తున్న కార్యక్రమంలా ఫీలవుతున్నారు. పుష్కరాలకు జాతీయస్థాయిలో ప్రచారం రాలేదని అనుకుంటే ఆ లోపం ఆయనదే. మీడియాను బాగా మేనేజ్‌ చేయగల నేర్పున్న ముఖ్యమంత్రి జాతీయ మీడియాను ఎందుకు మేనేజ్‌ చేయలేదు? యువతకు రకరకాల పిలుపులు ఇచ్చే బాబు 'పుష్కరాలను పాపులర్‌ చేయండి' అని పిలుపునిచ్చారు. పుష్కరాలకు జనం తక్కువగా వస్తున్నారని భావిస్తున్న సీఎం జనాలను రప్పించే బాధ్యత యువత తీసుకోవాలన్నట్లుగా మాట్లాడారు. 

పుష్కరాలకొస్తున్న యువతీ యువకులు సెల్ఫీలు తీసుకొని సోషల్‌ వెబ్‌సైట్లలో పెట్టాలన్నారు. సామాజిక మాధ్యామాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పుష్కరాలకొచ్చిన ప్రతీ వ్యక్తి దీన్ని గురించి మరో పది మందికి చెప్పాలని, వారు మరో వందమందికి చెబుతారని, ఆ విధంగా పుష్కరాల గురించి మౌత్‌ టాక్‌ ద్వారా ప్రచారం జరుగుతుందని బాబు చెప్పారు. ఇది వింటుంటే చిరంజీవి సినిమా ఒకటి గుర్తొస్తోంది కదూ. ఇక్కడో విషయం చెప్పుకోవాలి.  పుష్కరాల్లో అనేకమంది యువతీ యువకులు ప్రారంభం రోజు నుంచే నదిలో స్నానాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. 

ఈ సందర్భంలో వారి సెల్‌ఫోన్లు నదిలో పడిపోతున్నాయి కూడా. కొంతకాలంగా యువతీ యువకులకు సెల్ఫీల పిచ్చి బాగా ముదిరిపోయింది. వెనకాముందు చూసుకోకుండా సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. వీరంతా విద్యాధికులే. సెల్ఫీలు తీసుకుంటూ నదుల్లో, సముద్రంలో, రైల్వే ట్రాక్‌ మీద,  రైళ్ల మీద...అనేక చోట్ల ఎందరో చనిపోయారు. రైళ్లలో సెల్ఫీలు తీసుకుంటే ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తామని రైల్వే శాఖ హెచ్చరించింది. పట్టాల మీద, ప్లాట్‌ఫారాల మీద, పోతున్న రైల్లో సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధించింది. ఈ సెల్ఫీల ఉన్మాదంతో ప్రాణాలు పోతున్నాయి కాబట్టి చంద్రబాబువంటి ప్రముఖులు దీన్ని ప్రోత్సహించకూడదు. ఆ పిచ్చిని వదిలించుకోవాలని ప్రచారం చేయాలి. ఆయన ప్రయోజనాల కోసం యువతను బలి చేయడం భావ్యమా?

Show comments