మున్నాభాయ్ సంజయ్‌దత్ మళ్లీ జైలుకెళ్తాడా.? ఏమో, విధి వెక్కిరిస్తే ఆయన జైలుకెళ్ళక తప్పదు. వెక్కిరించడమేంటి.? చేసుకున్నోడికి చేసుకున్నంత.. అన్నమాటే నిజమైతే, సంజయ్‌దత్ జైలుకి వెళ్ళి తీరాల్సిందే. అక్రమాయుధాల కేసు ఇంకా సంజయ్‌దత్‌ని వెంటాడుతూనే వుంది. ఈ కేసులో గతంలోనే ఓ సారి జైలు శిక్ష అనుభవించిన సంజయ్‌దత్, ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు.. ఆ తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళాడు. ఈసారి శిక్షాకాలం పూర్తి కాకుండానే 'సత్ ప్రవర్తన' కారణంగా అతనికి ఉపశమనం కలిగింది.
బహుశా దేశ చరిత్రలో ఇంకెవరికీ సంజయ్‌దత్‌కి దక్కినన్ని పెరోల్స్ లభించి వుండవేమో.. అనేంతలా ఆయనకి 'అవకాశాలు' దొరకడం అప్పట్లో వివాదాస్పదమయిన విషయం విదితమే. 'ముందస్తు విడుదల' వ్యవహారమిప్పుడు తాజాగా కొత్త మలుపు తిరిగింది. ముందస్తు విడుదల ఎలా చేస్తారంటూ ముంబై హైకోర్టు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తగిన వివరాలతో సమాధానమివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం.
ఈ కేసు తిరగబడితే మాత్రం సంజయ్‌దత్ మళ్ళీ ఎనిమిది నెలలపాటు జైల్లో వుండక తప్పదు. కానీ, సంజయ్‌దత్ అంటే మాటలా.? బోల్డంత రాజకీయ పలుకుబడి.. పైగా, సినీ గ్లామర్.. ఇవన్నీ అతనికి అండదండగా వున్నప్పుడు, 'పద్ధతులు' పక్కకి వెళ్ళిపోవాల్సిందే. ఆ విషయం ఇప్పటికే నిరూపితమయ్యింది. మరి, ఈసారి సంజయ్ దత్ భవిష్యత్ ఎలా డిసైడ్ అవుతుందో.!
ముంబైలో మారణహోమం సృష్టించిన బాంబు పేలుళ్ళ ఘటనలో సంజయ్‌దత్‌పై ఆరోపణలు, అభియోగాలు.. అంటే ఇదేమీ చిన్న విషయం కాదు. పైగా, ఏకే 47 వంటి ఆయుధాలు ఆయన ఇంట్లో దొరికాయి. తీవ్రవాద దాడి అది. మాఫియాతో లింకులున్నాయన్న అభియోగాలు.. వెరసి, కేసు అత్యంత తీవ్రమైనది. ఇవన్నీ చూశాక సంజయ్ దత్ బుద్ధిమంతుడని ఎవరైనా అనగలరా.? ఛాన్సే లేదు.