మన మీడియాకి ఆంధ్రుల గోడు పట్టదా?

ఉదయమంతా రిపబ్లిక్‌ డే వేడుకలు.. మధ్యాహ్నం తర్వాత విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌ రగడ.. ఇదీ ఈ రోజు తెలుగు మీడియా తీరు. రిపబ్లిక్‌ డే వేడుకల విషయంలో మీడియాని తప్పుపట్టడానికేమీ లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ యువత తమ ఆత్మగౌరవం కోసం, తమ భవిష్యత్తు కోసం విశాఖ వేదికగా 'మౌన నిరసన' చేపడితే, దాన్నసలు కవర్‌ చేసేందుకే తెలుగు మీడియా ఆసక్తి చూపలేదు. అదే, జల్లికట్టు విషయానికొస్తే.. అదేదో తమిళనాడులో కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోందన్నంతగా మన తెలుగు మీడియా రచ్చరచ్చ చేసేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? 

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీడియాని దాదాపుగా కంట్రోల్‌ చేసేశారు. తన అనుకూల మీడియాలో అసలు 'ఆంధ్రప్రదేశ్‌ యువత' ఆందోళనలు కవర్‌ కాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సృష్టించిన గలాటాని మాత్రం మేగ్జిమమ్‌ కవర్‌ చేసేశారండోయ్‌. 'రెండేళ్ళ తర్వాత నేనే ముఖ్యమంత్రిని.. మిమ్మల్ని పేరుపేరునా గుర్తుపెట్టుకుంటా..' అంటూ పోలీసులతో జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని బీభత్సంగా ఎలివేట్‌ చేసేశారు. గతంలో చంద్రబాబు, ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు చేసిందేంటి.? ఇదే కదా.! అప్పుడు బాబు కరెక్ట్‌, ఇఫ్పుడు వైఎస్‌ జగన్‌ రాంగ్‌. ఇదీ, టీడీపీ అనుకూల మీడియా తీరు. 

దేశ చరిత్రలో విమానాశ్రయంలో రన్‌ వే మీద ఓ రాజకీయ ప్రముఖుడిని, అందునా ఓ ప్రతిపక్ష నేతని అడ్డుకోవడం ఇదే తొలిసారి. ఆ పరాభవం జగన్‌కే ఎదురయ్యింది. ఆయనతోపాటు ఇద్దరు ఎంపీలు కూడా వున్నారు ఆ సమయంలో. ఇంతకన్నా, ప్రజాస్వామ్యాన్నీ, ప్రజల హక్కుల్నీ పాలకులు ఖూనీ చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? 

జగన్‌ రగడ సంగతెలా వున్నా, విశాఖలో విధ్వంసాలు చోటుచేసుకుంటాయనీ ఇంకోటనీ నిన్న చంద్రబాబు కంగారుపడిపోయారు.. ఈ రోజు ఉదయం నుంచీ టీడీపీ నేతలు మొసలి కన్నీరు కార్చేశారు. ఎక్కడా ఎలాంటి విధ్వంసాలూ చోటు చేసుకోలేదు. పోలీసులు లాఠీలు ఝుళిపించినా, ఆంధ్రప్రదేశ్‌ యువత సంయమనం పాటించింది. ఓ పోలీస్‌, ఓ యువతి చేతిలోంచి జాతీయ జెండాని తీసి విసిరేస్తే, దెబ్బలు తింటూనే.. ఆ బాధ భరిస్తూ కిందపడ్డ జాతీయ జెండాను అందుకుందా యువతి. ఇంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్‌ యువత విశాఖలో నిరసన వ్యక్తం చేసింది. కానీ, ఇదేదీ మీడియాలో 'కవర్‌' అవలేదు. 

వైఎస్‌ జగన్‌, విశాఖకు వెళ్ళకపోయి వుంటే, ఎయిర్‌పోర్ట్‌లో గలాటా జరిగి వుండకపోతే.. అసలు విశాఖ చరిత్రలోంచి ఓ రోజుని 'మైనస్‌' చేసేసి వుండేది తెలుగు మీడియా. తెలుగు దేశం ప్రభుత్వం. దురదృష్టం.. అవమానకరం.. ప్రజాస్వామ్య విలువలకు ఇక్కడ విఘాతం పలుకుతోంది. నేషనల్‌ మీడియాకి ఎటూ లేదు, మన తెలుగు మీడియా.. మన సమస్యల పట్ల స్పందించకపోవడమంటే, అసలు ఆంధ్రప్రదేశ్‌ వాణి విన్పించేందెలా.?

Show comments