నటీమణికి అన్నాడీఎంకే హెచ్చరిక!

ఈ ఏడాదిలో దేశంలో బాగా చర్చనీయాంశంగా మారాయి తమిళ రాజకీయాలు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు జాతి దృష్టిని ఆకర్షించగా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, జయలలిత ఆరోగ్యంపై ప్రతిష్టంభన, ఆఖరికి ఆమె మరణం.. తమిళనాడును పతాక శీర్షికల్లో నిలిపాయి. ఆ పరిణామాల సంగతంతా అలా ఉంటే.. జయలలిత మరణం అనంతరం  రాజకీయాలు మరింత వేడెక్కాయి.

అన్నాడీఎంకే అధినేత్రి మరణం గురించి.. అనంతర పరిణామాల గురించి తలా ఒక మాట అంటున్నారు. విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. హెచ్చరికలు, రహస్య సమావేశాలు… ఇలా సాగుతున్నాయి రాజకీయాలు. ఈ రాజకీయాల్లో సినీ, రాజకీయ ప్రముఖులు తలా ఒక పాత్ర పోషిస్తున్నారు.

కరుణానిధితో  రజనీకాంత్ సమావేశం కావడం ఆసక్తికరంగా నిలుస్తోంది. కరుణను పరామర్శించేందుకే రజనీ వెళ్లాడని అంటున్నా.. ఈ సమావేశం గురించి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక అన్నాడీఎంకే రాజకీయాలపై ధ్వజమెత్తాడు పీఎంకే రాందాసు. అధికారికంగా ఎలాంటి పదవిలోనూ లేని శశికళ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించాడు. 

ఇక గౌతమి విషయంలో అన్నాడీఎంకే తరపు నుంచి ఎదురుదాడి జరుగుతోంది. జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడానికి నువ్వు ఎవరు? ఆసుపత్రిలోకి  ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడదు..  అనేది జయ ఇష్టప్రకారం జరిగింది, హద్దులు మీరకు.. అని అన్నాడీఎంకే పార్టీ వాళ్లు గౌతమిని హెచ్చరించారు.

Show comments