స్విస్‌ ఎల్లో ఛాలెంజ్‌.. అదో బ్రహ్మపదార్థం.!

స్విస్‌ ఛాలెంజ్‌.. స్విస్‌ ఛాలెంజ్‌.. స్విస్‌ ఛాలెంజ్‌.. ఇదిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ అర్థం కాని ఓ బ్రహ్మపదార్థం అంతే. ముఖ్యమంత్రి చంద్రబాబు, తనను తాను హైటెక్‌ అని చెప్పుకోడానికి ఇలాంటి 'మాటల్ని' తెరపైకి తెస్తుంటారు. మామూలుగా అయితే కాంట్రాక్టులు, టెండర్లు, పెట్టుబడులు, నిర్మాణాలు.. ఇదంతా ఓ 'పద్ధతి'. గ్లోబల్‌ టెండర్లను పిలవడం, తక్కువ కోట్‌ చేసినవారికి, కాంట్రాక్టులు అప్పగించడం జరుగుతుంటుంది. అలా చేస్తే, ఆయన చంద్రబాబు ఎలా అవుతారు.? 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం చారిత్రక అవసరం. ఇది చారిత్రక అవకాశం కూడా. అలాంటి మహత్తర అవకాశం తనకు దక్కినందుకు చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సమస్యలో వుంది గనుక, రాజధాని నిర్మాణం పెను సవాల్‌. అయితే, ఆ సవాల్‌ ప్రజలకు మాత్రమే, ముఖ్యమంత్రికి కాదు. ఎందుకంటే, ఆయన తన జేబులోంచి అర్థ రూపాయి కూడా తీసి, అమరావతి నిర్మాణం కోసం ఖర్చు చేయరు. ప్రజలు మాత్రం పన్నుల రూపంలో రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేసి తీరాల్సిందే. ఇదీ అసలు లాజిక్‌. 

అంటే, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా వుండాలి. ఖర్చు చేసే ప్రతి పైసాకీ లెక్క చెప్పాలి. కానీ, 'సీక్రెట్‌ జీవోలు' వచ్చేస్తుంటాయి, ప్రభుత్వం చేసే ఖర్చుల విషయంలో. అంతేనా, కథ చాలానే వుంది. భూమి పూజ, శంకుస్థాపన, ప్రారంభోత్సవం-1, ప్రారంభోత్సవం-2.. ఇలా జరుగుతుంటుంది చంద్రబాబు ప్రసహనం. రాజధాని నిర్మాణానికి ఎప్పుడో భూమి పూజ జరిగింది, శంకుస్థాపన కూడా జరిగింది. ఇంకా నిర్మాణమే ప్రారంభం కాలేదు. 

ఇదిగో, రాజధాని నిర్మాణం కోసం స్విస్‌ ఛాలెంజ్‌.. అంటున్నారు చంద్రబాబు. అప్పనంగా తాను ఎంపిక చేసుకున్న కంపెనీలకు రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగించి, వారికి సపర్యలు చేసి, మౌళిక సౌకర్యాలు కల్పించి, కోట్లు కట్టబెట్టడమన్నమాట ఈ స్విస్‌ ఛాలెంజ్‌ వెనుక మర్మం. భూములు మనవి, మౌళిక సౌకర్యాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు మనవి.. ఆ కంపెనీలు పెట్టుబడులు ఎంత పెడతాయో మాత్రం సీక్రెట్‌. ఓ అంచనా ప్రకారం, మనం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే, కంపెనీలు కనీసం 100 కోట్లు కూడా ఖర్చుపెట్టవట. అలాగైతే లక్షన్నర కోట్లు రాజధాని కోసం ఎలా తీసుకురాగలం.? 

ప్రజలకు జవాబుదారీగా వుండాల్సిన ముఖ్యమంత్రి, స్విస్‌ ఛాలెంజ్‌ విషయంలో ఇంతవరకు ప్రజలకు అవగాహన కల్పించడంలేదు, వారికి సవివరంగా చెప్పడంలేదు. ప్రజల దాకా ఎందుకు, మంత్రి వర్గంలో ఎవరికైనా స్విస్‌ ఛాలెంజ్‌పై అవగాహన వుందా.? లేదాయె. మరెందుకీ స్విస్‌ ఛాలెంజ్‌.? ఎవరి బాగు కోసం.? చంద్రబాబుకే తెలియాలి.

Show comments