పవన్‌కళ్యాణ్‌ 'అందరివాడు'

చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్న తేడాల్లేకుండా పవన్‌కళ్యాణ్‌ని ఈ మధ్య ఏదో ఒకరకంగా వాడేస్తుండడం ఎక్కువయ్యింది. పవన్‌కళ్యాణ్‌ కూడా, తనను ఆయా సినిమాల్లో వాడేసుకోవడం పట్ల పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయడంలేదు. నితిన్‌ అయితే పవన్‌కళ్యాణ్‌ వీరాభిమానినని చెప్పుకుంటూ తన సినిమాల్లో ఏదో ఒకరకంగా పవన్‌కళ్యాణ్‌ని వాడేస్తాడు. ఆఖరికి కమెడియన్‌ సప్తగిరి కూడా పవన్‌కళ్యాణ్‌ని వాడేసుకున్నాడు. ఇంకా చాలామంది వాడేసుకుంటున్నారు. 

ఇక, రాజకీయాల విషయానికొస్తే, బీజేపీ - టీడీపీ పవన్‌కళ్యాణ్‌ని ఏ స్థాయిలో వాడేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడో తేడా కొట్టేసింది.. ఆ వాడకంపై పవన్‌కళ్యాణ్‌ గుస్సా అయ్యారు. అంతే, అవసరం తీరిపోయింది గనుక బీజేపీ - టీడీపీ పవన్‌కళ్యాణ్‌ వాడకాన్ని కూడా పక్కన పెట్టేశాడయనుకోండి.. అది వేరే విషయం. 

రోజులు మారాయి.. రాజకీయాలూ మారుతుంటాయి.. కొత్తగా పవన్‌కళ్యాణ్‌ని వాడుకునేందుకు ఇంకొన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. వామపక్షాలు పవన్‌కళ్యాణ్‌ కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? పనిలో పనిగా కాంగ్రెస్‌ పార్టీ కూడా పవన్‌కళ్యాణ్‌ని వాడుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఎందుకిలా.? పవన్‌కళ్యాణ్‌నే ఎందుకలా వాడేసుకోవడానికి ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.? అంటే, సమాధానం సింపుల్‌.. పవన్‌కళ్యాణ్‌కి పెద్దగా 'పొలిటికల్‌ కోరికలు' లేకపోవడమే. పైగా పవన్‌కళ్యాణ్‌ని ఎవరూ రాజకీయ నాయకుడిలా చూడటంలేదు.. పవన్‌కళ్యాణ్‌ 'కటౌట్‌' మాత్రమే వాళ్ళకి కావాలి. 

పవన్‌కళ్యాణ్‌ ఫలానా రాజకీయ పార్టీతో జతకడ్తాడట.. అన్న గాసిప్స్‌ ఉత్తనే పుట్టడంలేదు. ఆయా పార్టీలు, 'పవన్‌ మా తరఫున ప్రచారం చేస్తే ఓకే..' అనుకోవడంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకు వెనుకాడుతుంది.? పవన్‌కళ్యాణ్‌కి సినీ నటుడిగా వున్న స్టార్‌డమ్‌ అలాంటిది. అదే పవన్‌కళ్యాణ్‌, రాజకీయ నాయకుడిగా సొంత ఎజెండాతో ముందుకెళ్తానంటే మాత్రం ఎవరూ ఒప్పుకోరాయె. 

జనసేనాధిపతి అన్న ట్యాగ్‌లైన్‌ తప్ప, ఆ పార్టీ అధినేతగా పవన్‌కళ్యాణ్‌ తనను తాను పొలిటికల్‌ లీడర్‌నని నిరూపించుకునే ప్రయత్నం ఇప్పటిదాకా చేయలేదు. భవిష్యత్తులో చేస్తాడన్న నమ్మకమూ లేదు. ఇది చాలదా పవన్‌కళ్యాణ్‌ని ఆయా రాజకీయ పార్టీలు 'అందరివాడు' అనుకోవడానికి.!

కొసమెరుపు: పవన్ తమ అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తే ’మంచోడు.. అందరివాడు..‘, తేడా వస్తే మాత్రం సీన్ ఇంకోలా వుంటుంది.. రాజకీయాల్లో తప్పదు.. అలాగే వుంటుంది.

Show comments