దెబ్బకి దిగొచ్చిన డైరెక్టర్‌ శంకర్‌

తన సినిమా సెట్స్‌లోకి ఎవర్నీ రానివ్వకపోవడమే కాదు, ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి సమాచారమూ బయటకు పొక్కకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తాడు ప్రముఖ దర్శకుడు శంకర్‌. అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి సినిమాల్ని తెరకెక్కించడమే కాదు, అదే టెక్నాలజీని వినియోగించి.. 'లీకేజీల్ని' అరికట్టేందుకు ప్రయత్నించడం శంకర్‌కే చెల్లింది. అయినాసరే, లీకేజీలు తప్పడంలేదనుకోండి.. అది వేరే విషయం. 

ఒక్కసారి శంకర్‌ సినిమా సెట్స్‌లోకి వెళితే అక్కడ హీరో అయినాసరే, మొబైల్‌ ఫోన్‌ వాడేందుకు వీలు లేదు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌నీ రానివ్వడు. అంత పకడ్బందీగా సినిమాల షూటింగ్‌ చేస్తుంటాడు శంకర్‌. అలాంటిది, శంకర్‌ సినిమా షూటింగ్‌ స్పాట్‌లో ఎవరన్నా ఫొటోలు తీస్తే ఊరుకుంటాడా.? ఛాన్సే లేదు. 

ఓ ఫొటో జర్నలిస్ట్‌, శంకర్‌ తాజా చిత్రం '2.0' సెట్స్‌లో అత్యుత్సాహం ప్రదర్శించడంతో, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ద్వారా ఆ జర్నలిస్ట్‌పై శంకర్‌ దాడి చేయించాడట. అసిస్టెంట్ డైరెక్టర్.. అతనితోపాటు మరికొందరు దాడి చేయడంతో, ఫొటో జర్నలిస్టుకి గాయాలయినట్లు తెలుస్తోంది. దాంతో, జర్నలిస్టులంతా కలిసి ఆందోళన చేపట్టారు. అసలక్కడ, ఫొటో జర్నలిస్ట్‌ ఎలాంటి ఫొటోలూ తీయలేదనీ, దర్శకుడు శంకర్‌ ఆదేశాల మేరకే తమ మీద దాడి జరిగిందని జర్నలిస్టులు అంటున్నారు. వివాదం ముదిరి పాకాన పడ్డంతో, దర్శకుడు శంకర్‌ దిగొచ్చాడు. సదరు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడనీ, ఈ వివాదంలో జర్నలిస్టులు శాంతించాలనీ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరఫున తాను క్షమాపణ చెబుతున్నాననీ వివాదానికి శుభం కార్డు వేసేందుకు శంకర్‌ ప్రయత్నించాడు. 

ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినట్లే కన్పిస్తున్నా, శంకర్‌ - అతని అసిస్టెంట్‌ వ్యవహరించిన తీరు పట్ల ఇంకా జర్నలిస్టులు గుస్సా అవుతూనే వున్నారు. దాడి అత్యంత హేయమనీ, హీరో రజనీ కాంత్ ఈ వివాదంపై స్పందించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. Readmore!

Show comments

Related Stories :