ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా.?

పార్టీ వేదికలపై ఏమైనా మాట్లాడుకోవచ్చుగాక.. అది వారి అంతర్గతం. కానీ, ప్రభుత్వ కార్యక్రమంలో.. అదీ ఓ ముఖ్యమంత్రి, 'నాకు ఓటేయలేదు గనుక, మీకు పనులు చేయకూడదు..' అన్న మాట అనొచ్చా.? అనకూడదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆ మాట అనేశారు. తద్వారా ప్రజల్ని ఆయన బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారనే అనుకోవాలి. '2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లా నన్ను అంతగా ఆదరించలేదు..' అన్న విషయాన్ని ఆయన నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. 

'ఇప్పుడు పనులు ఎందుకు చేస్తున్నానో తెలుసా.? 2019 ఎన్నికల్లో నాకు మీరు ఓటేస్తారని..' అని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోయాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతలోనే, ఆయన తన వ్యాఖ్యల్ని కవర్‌ చేసుకునేందుకు ప్రయత్నించారు. 'నేను ఇంకోలా ఆలోచించలేదు.. అలా ఆలోచించి వుంటే అనంతపురం జిల్లాకే చెయ్యాలి.. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు మాత్రమే చెయ్యాలి.. కానీ నేను కర్నూలు జిల్లాని కూడా పట్టించుకున్నాను..' అంటూ చెప్పుకున్నారు చంద్రబాబు. 

ఇంతకీ, ఇప్పుడెందుకు కర్నూలుని చంద్రబాబు పట్టించుకున్నట్లు.? అంటే, సమాధానం సింపుల్‌.. కర్నూలు నుంచి పలువరరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్ని టీడీపీ లాక్కుంది కదా.. బహుశా ఆ ఎమ్మెల్యేల ఒత్తిడితోనో, లేదంటే వారిని మెప్పించడం కోసమో.. కావొచ్చు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఈ సమాధానం సరిగ్గా సరిపోతుందేమో.! 

ముఖ్యమంత్రి అంటే, ఓ రాష్ట్రంలోని అన్ని జిల్లాలనూ సమానంగా చూడాల్సి వుంటుంది. ఓట్లేశారని ఓ జిల్లాను ఎక్కువగా చూడటం, ఓట్లెయ్యలేదని ఇంకో జిల్లాని పట్టించుకోకపోవడం.. ముఖ్యమంత్రికి తగదు. పైగా, ఆ మాట చెప్పుకోవడమంటే ఎంత సిగ్గుమాలినతనం.? కర్నూలు జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ వ్యాఖ్యలతో నిజంగానే షాక్‌ అయి వుండాలి. అన్నట్టు, కర్నూలు నగరం రాజధాని రేసులో పోటీ పడినా, వెనక్కి నెట్టివేయబడింది.. బహుశా, కర్నూలు జిల్లా తనకు ఓటేయలేదేమోనని చంద్రబాబే కర్నూలుని వెనక్కి పంపించేశారని అనుకోవాలా.?

Show comments