తెలుగుదేశానికి ఈ తత్వం బోధపడుతోందా?

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, నాటికి కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న వాళ్లు.. విభజన నాడు ఆడిన నాటకాలకూ, వ్యవహరించిన తీరుకు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఈ పార్టి అధినేత చంద్రబాబు నాయుడి తీరుకు ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? విభజన నాడు అధికారంలో ఉన్న వాళ్లు, ప్రత్యేక హోదా అంశంపై పోరాడాల్సిన దశలో అధికారంలో ఉన్న వీళ్లు.. వ్యవహరిస్తున్న తీరులో తేడాలు  ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే.. రెండు పరిణామాలనూ గమనిస్తున్న జనాలు తేడాలు ఏమీ లేవనే అంటున్నారు.

చివరి వరకూ అధికారం కోసం.. అధిష్టానానికి అనుకూలంగా వ్యవహరించారు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, కేంద్రమంత్రులు. పైకేమో సమైక్యవాదం అంటారు, సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నాం అన్నారు.. పార్లమెంటు ఆవరణల్లో ధర్నాలకు దిగారు, సభలో లోపల కూడా ప్లకార్డులు పట్టుకుని స్పీకర్  పోడియంను చుట్టుముట్టారు.. అధికార పార్టీలోనే వారే అయినా.. సభలో ప్రతిపక్ష పార్టీ ఎంపీల్లా వ్యవహరించారు! తమ ద్వంద్వ వైఖరితో సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నట్టుగా వాళ్లు వ్యవహరించారు. 

కట్ చేస్తే.. ఇప్పుడు నాడు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలు పోషించిన పాత్రనే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం వాళ్లు పోషిస్తున్నారు. ప్రత్యేక హోదా కావాలని అంటారు, కేంద్రంలో మాత్రం అధికార కూటమిలోనే ఉంటారు! కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ ఉంటారు.. కేంద్రం వైఖరిని నిరసిస్తామంటున్నారు. పైకి ఎన్ని నాటకాలు ఆడినా.. అంతిమంగా సీమాంధ్ర ఎంపీలు అధిష్టానం మాటకే కట్టుబడ్డారు. జనాలను మోసం చేయ ప్రయత్నించిన వాళ్లలాగానే తెలుగుదేశం ఎంపీల తీరు ఉంది. 
 ఇక అధిష్టానానికి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాను.. అంటూ సీఎం పదవిని పట్టుకుని వేలాడి, విభజన లాంఛనాన్ని పూర్తి చేయించిన కిరణ్ కుమార్ రెడ్డి స్థానే ఇప్పుడు చంద్రబాబు కూర్చున్నాడు, అదే రీతిన వ్యవహరిస్తున్నాడు.

కిరణ్ కూడా అంతే.. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి సమైక్యవాదాన్ని వినిపించే వాడు. విభజన తో సమస్యలు వస్తాయని అనేవాడు. తను విభజనకు వ్యతిరేకం అంటూ వీరుడిలా పోజు కొట్టేవాడు. బాబు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడతాడు.. ప్రత్యేక హోదా కావాలాంటాడు, ఏపీ సమస్యల్లో ఉందంటాడు, ప్రత్యేక హోదా కోసం పోరాటమంటాడు.. సమైక్యవాదానికి కట్టుబడి తన పదవిని వదులుకోవడానికి కిరణ్ సిద్ధపడలేదు, బాబు కూడా అంతే.. ప్రత్యేక హోదా పోరును తీవ్ర స్థాయికి చేరుస్తూ.. ఎన్డీయే నుంచి బయటకు వస్తామనే హెచ్చరికలు కూడా చేయడం లేదు!

 మరి విభజన అంశం సీమాంధ్రుల జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో, ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం కూడా అంతే తీవ్ర స్థాయికి చేరింది. అప్పుడు కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ఎన్ని నాటకాలు ఆడినా.. తమ పరువును నిలబెట్టుకోలేకపోయారు, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయారు. వారి పతనం నుంచి తెలుగుదేశం వాళ్లు, తెలుగుదేశం అధినేత ఏమాత్రం పాఠాలు నేర్చినట్టుగా కనిపించడం లేదు. విభజన నాటకంతో కాంగ్రెస్ కు పట్టిన గతే.. ఇప్పుడు ఆడుతున్న నాటకాలతో తెలుగుదేశానికీ పడుతుందనడానికి సందేహించనక్కర్లేదు. మరి తమ్ముళ్లకు తత్వం బోధపడలేదు కాబోలు!

Show comments