రైతు పరిస్థితి దుర్భరం.. రాయలసీమ రైతాంగం పరిస్థితి మరింత దారుణం. వరస కరువులు.. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు.. ఎన్ని అని తట్టుకుంటాడు? ఈసారి పరిస్థితి అత్యంత దయనీయాంగా మారింది. ఆరంభంలో ఆశలు రేకెత్తించిన వానలు.. రైతుల చేత భారీ పెట్టుబడులు పెట్టించాయి. ఆసాంతం వానలు రాకపోవడంతో చివరకు పంట నష్టం తీవ్ర స్థాయికి చేరింది.
మరి ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించింది.. ఈ విషయంలోనూ రైతులు అసంతప్తిగానే ఉన్నారు. మరి ప్రకటించనంత మాత్రాన ఏమీ అయిపోదు కదా.. రైతులను ఎలా ఆదుకుంటామో ప్రభుత్వం ఇంత వరకూ చెప్పలేదు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వానికి ఒక సలహా.
తాము చేశామని చెప్పుకుంటున్న రైతు రుణమాఫీని ప్రభుత్వం రాయలసీమకు నిజాయితీగా చేయాలి. ఇప్పుడు రైతుల పరిస్థితిని దష్టిలో ఉంచుకుని అయినా.. రైతుల రుణాలను మాఫీ చేయాలి. విడతల వారీ.. షరతులతో.. అని చెప్పకుండా.. ఈ ఏడాది భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులను దష్టిలో ఉంచుకుని.. రైతు రుణమాఫీని చిత్తశుద్ధిగా అమలు చేస్తే.. సీమ రైతును అంతో ఇంతో ఆదుకున్నట్టు అవుతుంది. కోస్తాంధ్ర రైతుల సంగతెలా ఉన్నా... సీమ రైతు పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం కనీసం ఈ సాయం అయినా చేయాలి.
చేయని రుణమాఫీ గురించి చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం నుంచి ఇలా ఆశించవచ్చా? ఇది వేప చెట్టు నుంచి తేనె చుక్కను ఆశించడమా? ప్రభుత్వమే సమాధానం ఇవ్వాలి.