అదిరిందయ్యా.. చంద్రం

చంద్రబాబు గాలికొదిలేసిన ప్రత్యేక హోదా అంశాన్ని రామచంద్రరావు నెత్తికెత్తుకున్నట్టున్నారు. చాలా ఆశ్చర్యకరమైన, చిత్ర విచిత్రమైన విషయమిది. వైఎస్‌ హయాంలో కేవీపీ రామచంద్రరావు రాజకీయంగా చక్రం తిప్పేశారు. అధిష్టానంతో సంప్రదింపుల కోసం, అధిష్టానం మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఢిల్లీలో తన 'దూత'గా కేవీపీకి మంచి స్థానమే కల్పించారు. అలా కాంగ్రెస్‌ అధిష్టానంతో తనకు పెరిగిన సన్నిహిత సంబంధాల్ని ఆయన అలా అలా కొనసాగిస్తున్నారు. 

అన్నట్టు, కేవీపీ రామచంద్రరావుకి 'సూట్‌కేసుల' రామచంద్రరావు అనే బిరుదుని కూడా ప్రత్యర్థులు ఇచ్చేశారండోయ్‌ అప్పట్లో.. అది వేరే విషయం. ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లో కేవీపీ రామచంద్రరావు పేరు మార్మోగిపోతోంది. కారణం, ప్రత్యేక హోదా కోసం కేవీపీ రామచంద్రరావు, రాజ్యసభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లుని ప్రవేశపెట్టడమే. వాస్తవానికి ప్రైవేటు బిల్లు సభ్యులెవరైనా పెట్టేసుకోవచ్చు. కానీ, దానికి మద్దతు కూడగట్టడంలోనే వుంది అసలు మజా. 

కేవీపీ, ఇక్కడే అధిష్టానంతో సత్సంబంధాల్ని ఉపయోగించుకున్నారు. కేవీపీ బిల్లు పెట్టారు సరే, కాంగ్రెస్‌ మద్దతేదీ.? అని ప్రశ్నించి టీడీనీ, కేవీపీని బాగానే కెలికింది. దాంతో, కేవీపీ.. పూర్తిస్థాయిలో తన బిల్లుకి మద్దతుని కూడగట్టేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. అలా ఇప్పుడు, రాజ్యసభను ఓ ప్రైవేటు బిల్లు కుదిపేసే స్థాయికి కేవీపీ, ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. టీడీపీనే కాదు, వైఎస్సార్సీపీనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎవరూ ఊహించలేదు ఈ విషయాన్ని. అంతెందుకు, కాంగ్రెస్‌ కూడా ఊహించి వుండదు, ప్రైవేటు బిల్లు కోసం తాము పోరాడాల్సి వస్తుందని. 

ప్రైవేటు బిల్లుల్ని ఎలా అడ్డుకోవాలో బీజేపీకి తెలియదా.? ఆ ప్రయత్నాలూ చేసింది. ఇక్కడే, కేవీపీ మరో వ్యూహరచనతో ముందడుగు వేశారు. తన హక్కుల్ని కాలరాశారంటూ ఏకంగా బీజేపీ సభ్యుల మీద ఆరోపిస్తూ, రాజ్యసభ ఛైర్మన్‌కి ఫిర్యాదు చేసేశారు. ఛైర్మన్‌ పరిశీలనకు ఫిర్యాదును పంపుతున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ఈ రోజు రాజ్యసభలో ప్రకటించారు.  Readmore!

మొత్తమ్మీద, ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లు కేంద్ర రాజకీయాల్లో ఓ కుదుపుకు కారణమయ్యింది. బీజేపీ ఈ వ్యవహారంపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రత్యేక హోదాపై ఏం చేద్దాం.? అంటూ సమాలోచనలు జరుగుతాయట. అదే నిజమైతే, ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా కేవీపీ రామచంద్రరావు వ్యూహం పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లే. 

ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లుని ఆమోదిస్తే బీజేపీ పరువు పోతుంది. ఆమోదించకూడదంటే, ప్రత్యేకహోదాపై ఏదో ఒక హామీ నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చి తీరాల్సిందే. ఇచ్చినా, ఇవ్వకపోయినా.. ఇరుక్కునేది బీజేపీనే. ఈ సంకటం నుంచి గట్టెక్కడం సంగతి తర్వాత.. ముందు సభా హక్కుల ఉల్లంఘన ఆరోపణల్ని తప్పించుకోవడమెలా.? ఇదే ఇప్పుడు బీజేపీ ముందున్న పెద్ద సమస్య.

Show comments

Related Stories :