వెంకటేశాయా.. ఏంటీ టైటిల్‌ రగడ.?

ఓ సినిమా కంటే ముందుగా ఆ సినిమా చుట్టూ వివాదాలే పుట్టుకొస్తుండడం 'ఫ్యాషన్‌'గా మారిపోయింది. అప్పుడప్పుడూ ఈ ట్రెండ్‌ కాస్త సద్దుమణిగినట్లు కన్పించినా, వివాదం ముందు పుట్టి, ఆ తర్వాతే సినిమా పుడుతుండడం సినీ పరిశ్రమను ఎప్పటికప్పుడు అసహనానికి గురిచేస్తోందన్నది నిర్వివాదాంశం. కొంతమంది ఈ వివాదాల పేరుతో 'క్యాష్‌' చేసుకోవడానికే అన్నట్లు.. మీడియా ముందుకొస్తుంటారు. 'క్యాష్‌' అన్నదానికి అనేక రూపాలున్నాయి.. పబ్లిసిటీ పొందడమో, ఇతరత్రా ఆలోచనలతోనో.. సినిమాల్ని వివాదాల్లోకి నెట్టేయడంలో వారి ఫీట్లు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంటాయి. 

ఇక, అసలు విషయానికొస్తే నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓం నమో వెంకటేశాయ' సినిమా టైటిల్‌ వివాదాన్ని ఎదుర్కొంటోంది. బంజారా సంఘాలకు చెందిన కొందరు, ఈ సినిమా టైటిల్‌ని మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనల బాట పడ్తామంటున్నారు, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. టైటిల్‌ని 'హథీరామ్‌బాబా'గా మార్చాలన్నది వారి డిమాండ్‌. 

ఓ సినిమాకి టైటిల్‌ ఎవరు నిర్ణయించాలి.? కథతోపాటే దాదాపుగా టైటిల్‌ పుడుతుంది. దర్శకుడు, నిర్మాత, హీరో.. ఇలా అంతా కలిసి టైటిల్‌పై ఓ అవగాహనకు రావడం కూడా జరుగుతుంటుంది. సినిమాలో కథాంశంతో సంబంధం లేకుండా కూడా టైటిల్స్‌ వస్తుంటాయి. అది వేరే విషయం. 

అన్నమయ్య చరిత్రకి 'అన్నమయ్య' అని పేరు పెట్టారు.. రామదాసు చరిత్రకి 'శ్రీరామదాసు' అని పేరు పెట్టారు. ఆ లెక్కన, 'హథీరామ్‌బాబా' చరిత్రకి ఆ పేరే పెట్టాలి కదా.? అన్నది ఇక్కడ బంజారా సంఘాలకు చెందినవారి డిమాండ్‌. లాజిక్‌ బాగానే వుందిగానీ, సినిమాకి ఏ టైటిల్‌ పెట్టాలన్నది సినిమాతో సంబంధం లేనివారు నిర్ణయిస్తే ఎలా.? న్యాయపోరాటం చేసినా, అక్కడ నిలబడే వివాదం కాదు. కానీ, వివాదమైతే కొంత ముదిరి పాకాన పడే అవకాశం లేదు. అదో రకం పబ్లిసిటీ.. అని సరిపెట్టుకోవడం మినహా ఇక్కడ చెయ్యగలిగేదేమీ లేదు. తెరపైకి తెచ్చిన వివాదమేంటి.? అందులో విజ్ఞతేంటి.? అన్నది వివాద సృష్టికర్తలే ఆలోచించుకోవాలి. Readmore!

Show comments

Related Stories :