పెళ్లికి ముందు శృంగారం.. అమ్మాయిలూ జాగ్రత్త!

ఇది ‘న్యాయం కావాలి’ సినిమా టైమ్ కాదని అంటోంది ముంబై హై కోర్టు! పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాడు, అందుకే అతడితో శారీరకంగా కలవడానికి ఒప్పుకున్నాను.. ఆ తర్వాత నన్ను మోసం చేశాడు.. అంటూ కోర్టులకు ఎక్కితే ‘న్యాయం’ జరగడం కష్టమే అని కోర్టు అభిప్రాయపడుతోంది. ప్రేమలో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం.. అంటే అది కేవలం అబ్బాయి ఒత్తిడి, ప్రలోభం కింద పరిగణించలేం అని కోర్టు అభిప్రాయపడింది. దాంట్లో అబ్బాయితో పాటు, అమ్మాయిది కూడా పూర్తి బాధ్యత ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

తన మాజీ ప్రియుడిపై అత్యాచారం కేసు పెట్టింది ఒక యువతి. ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి హామీని ఇచ్చి అతడు తనను మోసం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. తమ మధ్య శృంగార సంబంధం ఉండేదని.. అతడు ప్రలోభ పెట్టాడని.. ఈ మోసాన్ని అత్యాచారంగా పరిగణించాలని ఆ యువతి కోరింది. అయితే ప్రేమలో ఉన్నప్పుడు నిందితుడు ఆమెను మోసపూరితంగా  లైంగిక చర్యకు ఒప్పించడంటే అందుకు తగిన ఆధారాలు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ‘పెళ్లి చేసుకుంటాను..’ అనే హామీ ఇవ్వడాన్ని ప్రలోభ పెట్టడంగా పరిగణించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

వివాహం వరకూ కన్యగా ఉండటం మహిళ బాధ్యత అని తరతరాలుగా సమాజంలో ఒక కట్టుబాటు ఉందని, అయితే ప్రస్తుత సమాజం మారుతోందని, యువత లైంగిక విషయాలపై పూర్తి అవగాహనతో ఉందని.. ప్రేమలో ఉన్నంత మాత్రాన, పెళ్లి చేసుకుంటామని అతడు చెప్పినంత మాత్రానా.. తామేం చేస్తున్నామో ఆమెకు కూడా అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటప్పుడు ప్రేమలో శృంగారాన్ని అత్యాచారంగా  పరిగణించలేమన్నట్టుగా, ఈ విషయంలో ఇద్దరి బాధ్యతా ఉందన్నట్టుగా కోర్టు అభిప్రాయపడింది. 

విద్యావంతమైన మహిళలు లైంగిక సంబంధం వల్ల కలిగే పర్యవసనాలను ఎరిగి ఉండాలని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పునంతా ఇచ్చింది ఒక మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం. ప్రేమలో ఉన్నప్పుడు ప్రియుడితో శృంగారాన్ని.. ‘మోసం’ చేయడం అనడం అసంబద్ధమని, ఇలా ‘మోసపోతే’ అది అమ్మాయిల స్వయంకృతం అవుతుంది తప్ప.. చట్టపరంగా అన్యాయం జరిగినట్టుగా కాదని న్యాయస్థానం అంటోంది.  కాబట్టి.. అమ్మాయిలు పారాహుషార్! 

Show comments