ప్రశ్నించే ధైర్యం నేనిస్తా: పవన్‌కళ్యాణ్‌

పవన్‌ బాబా ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. కానీ, ఏదో ఒకటి చేద్దామనుకుంటారు. సినీ నటుడుగా పవన్‌కళ్యాణ్‌ ఓ ట్రెండింగ్‌.. ఓ సెన్సేషన్‌.. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని ఇమేజ్‌ సంపాదించుకున్న పవన్‌కళ్యాణ్‌కి, చిత్రంగా సినిమాలు కిక్‌ ఇవ్వవట. రాజకీయం కూడా కిక్‌ ఇవ్వదట. కానీ, సమాజాన్ని ఉద్ధరించేయడంలో ఓ కిక్‌ వుందంటారాయన. పోనీ, ఆ ఉద్ధరించే కార్యక్రమంలో అయినా చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారా.? అంటే అదీ లేదు. 

మీరు చెప్పండి, ఈ క్షణం సినిమాలు మానేస్తానంటాడు.. సినిమాలు మానేస్తే ఎలా.? డబ్బు సంపాదనకు అదొక్కటే మార్గం కదా.! అంటాడు. పవన్‌ లీలలు అన్నీ ఇన్నీ కావయా.! ఇదివరకటితో పోల్చితే పవన్‌కళ్యాణ్‌ మాటల్లో కొంచెం మెచ్యూరిటీ వచ్చిన మాట వాస్తవం. కానీ, ప్రజలు కోరుకునేది 'పరిపక్వత చెందుతున్న రాజకీయ నాయకుల్ని' కాదు. తమ కోసం పనిచేసే నాయకుడ్ని. 'మీకు ప్రశ్నించే ధైర్యాన్ని నేను ఇస్తాను..' అంటాడు తప్ప, తానొక్కడినీ ప్రశ్నిస్తే సరిపోదంటాడు. మరి, అలాగతే ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని ముందుగా ఎందుకు చెప్పినట్లు.? 

రిజర్వేషన్ల వ్యవహారమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు రిజర్వేషన్లు వద్దనేవారున్నారు.. రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేననేవారూ వున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ల పేరుతో తెలుగుదేశం పార్టీ కులాల కుంపట్లను రాజేసింది. కానీ, ఈ విషయంలో మిత్రపక్షాన్ని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నించరాయె. రిజర్వేషన్ల విషయంలోనూ పవన్‌కళ్యాణ్‌ది డొంకతిరుగుడు వైఖరే. రిజర్వేషన్లు లేనివారికి ఆర్థిక సహాయం అందించాలన్నది పవన్‌ ఉవాచ. అది సాధ్యమేనా.? ఎందుకంటే, దేశంలో నడుస్తున్నవి ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే. 

విద్యార్థులతో నేడు మమేకం అయిన పవన్‌కళ్యాణ్‌, వారి ప్రశ్నలకు ఏవేవో సమాధానాలు చెప్పాడు. నిరాహార దీక్ష చేయొచ్చుగా.. అనడిగిడితే, ఆ దీక్షలతో ఉపయోగం లేదంటాడు. మరి, తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్‌ నిరాహార దీక్ష నాంది కదా.. అంటే సమాధానముండదేమో.! అఫ్‌కోర్స్‌ తెలంగాణలో వర్కవుటయిన నిరాహార దీక్ష ఆంధ్రప్రదేశ్‌లో వర్కవుట్‌ కాలేదనుకోండి.. అది వేరే విషయం.  Readmore!

ఏదిఏమైనా, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళేనాటికి పవన్‌కళ్యాణ్‌ పూర్తిస్థాయిలో పరిణతి చెంది, ప్రజలకు ఏమాత్రం కన్‌ఫ్యూజన్‌ లేని రీతిలో ముందుగా ప్రశ్నించే ధైర్యాన్ని తాను సొంతం చేసుకుంటాడేమో వేచి చూడాల్సిందే.

Show comments