ఆ బాబు ఇలా..ఈ బాబు అలా

సాధారణంగా ఒకే ఐడియాలజీ వున్నవాళ్ల సలహాలు ఒకలాగే వుంటాయి.. ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐడియాలజీ నచ్చుతుంది. అందుకే ఎప్పుడో కానీ ఆయన తెలుగుదేశం పార్టీని విమర్శించారు. సదా వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ పార్టీకి, దాని ప్రభుత్వానికి అండగా వుంటారు. తప్పులేదు..అది ఆయన అభిరుచి. అయితే ఇవ్వాళ ఆయన బాబు డిఫరెంట్ విషయం చెప్పారు. 

''...మిగతా అగ్రవర్ణాల వారు వ్యవసాయం నుంచి క్రమంగా తప్పుకొని వ్యాపారాలవైపు మళ్లారు. కాపులు మాత్రం వ్యవసాయాన్ని నమ్ముకుని వ్యాపారాల గురించి ఆలోచించలేదు...' ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పింది. ఆయన స్పష్టంగా పెర్కొన లేదు కానీ, కోస్తా ఆంధ్రలో కాపులు కాకుండా వ్యవసాయాన్ని నమ్ముకున్న అగ్రవర్ణాల్లో అధికులు కమ్మవారే. 

రాధాకృష్ణ చెప్పినట్లు వారు వ్యాపారం వైపు కొత్తగా మళ్ల లేదు. ఆది నుంచీ కూడా వారు వ్యాపారం..వ్యవసాయం అనే రెండు పడవల మీద ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. సరే, ఆ సంగతి అలా వుంచితే, చంద్రబాబు ఏమంటారు. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తా అంటారు. పదే పదే అదే చెబుతారు. రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..ఏరువాక పున్నమిని పండుగల చేసుకోవాలి. రైతులకు అన్ని విధాలా సహాయం చేస్తా అంటున్నారు. 

కానీ ఈయనేమో, కాపులు వ్యవసాయం నుంచి వ్యాపారం వైపు మళ్లితే ఆర్థికంగా బలోపేతం అవుతారు. మిగిలిన అగ్రవర్ణాలు అవే పని చేసాయి అందువల్ల కాపులు అదే పని చేయాలి అంటారు. ఈ మాటలు నిజమే అనిపిస్తోంది కూడా. అయితే ఈ మాటలు నిజం అని అనుకున్నపుడు చంద్రబాబు మాటలను శంకించాల్సి వస్తోంది. 

రాధాకృష్ణ చెబుతున్న అగ్రవర్ణాలు ఎలాగూ వ్యవసాయం వదిలి, వ్యాపారం వైపు మళ్లాయి కాబట్టి, ఇక వ్యవసాయం కన్నా వ్యాపారమే లాభసాటి అనుకుంటున్నారు కాబట్టి, బాబు కూడా అందుకే లోపాయి కారీగా అసలు రాష్ట్రంలో వ్యవసాయమే లేకుండా చేస్తున్నారేమో అనిపిస్తోంది. రాజధాని, సెజ్ లు, కారిడార్లు, ఎయిర్ పోర్టులు ఇలా ఏదో ఒక పేరు చెప్పి, పంట పొలాలు తీసుకుని, వ్యవసాయం లేకుండా చేస్తున్నారేమో? పైగా వ్యవసాయం లాభసాటి అని అంటున్నా, వ్యవసాయదారులను ఈ విధంగా లాభసాటి వైపు మళ్లిస్తున్నారేమో?

Show comments