చంద్రబాబులో నిద్రలేస్తున్న 'అపరిచితుడు'!

రాను రాను చంద్రబాబులో ఒక అపరిచితుడు కూడా నిద్ర మేల్కొంటున్నట్లుగా ఉంది. ఒకచోట ఆయన ఒక రకంగా వ్యవహరిస్తారు.. మరొకచోట అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు. ఒకే విషయంలో ఒకరి పట్ల ఒక తీరుగా స్పందిస్తే.. మరొకరి విషయంలో మరొక తీరుగా స్పందిస్తారు. తన సొంత మనుషుల విషయంలోనే ఒక సమయంలో ప్రేమను కురిపిస్తే, మరొక సమయంలో చిరాకు పడతారు. ఇలాంటి వైఖరిని గమనించినప్పుడు ఏమనుకోవాలి. ఖచ్చితంగా ఆయనలోని అపరిచితుడు అప్పుడప్పుడూ నిద్ర మేలుకుంటున్నాడని అనుకోవాల్సిందే. 

దీనికి తాజా దృష్టాంతం అనంతపురంలో కనిపించింది. కొన్ని రోజులుగా రాయలసీమ మీద అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపిస్తూ అక్కడ విపరీతంగా తిరుగుతున్న చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో ఓ రైతు కు చెందిన ఎండిపోయిన వేరుసెనగ పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తమ జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబుకు తెదేపా నాయకులు ఫ్లవర్‌ బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. 

యితే.. చంద్రబాబు వారి మీద ఇంతెత్తున ఎగిరిపడ్డారు. కరవు రైతుల కష్టాలు చూడ్డానికి వస్తే బొకేలు అవసరమా అని అనేశారు. అయితే అదే చంద్రబాబు.. నిత్యం ఎవరి వద్దకు వెళ్లినా.. ఫ్లవర్‌ బొకేలు ఘనంగా తీసుకువెళుతూ ఉంటారనేది జగమెరిగిన సత్యం. చివరికి గవర్నర్‌ బంగళాకు వెళితే.. గవర్నరుకు ఒకటి, ఆయన శ్రీమతికి ఒకటి రెండేసి బొకేలు తీసుకెళ్లిన చరిత్ర కూడా చంద్రబాబుకు ఉంది. 

విదేశీ బృందాలని, పారిశ్రామికవేత్తలని అమరావతి లో తన వద్దకు ఎవరు వచ్చినా.. గుట్టలుగా బొకేలు, కట్టలుగా జ్ఞాపికలు, పట్టు శాలువాలూ ఖర్చు అయిపోతుంటాయి. నిజానికి చంద్రబాబు అనంతపురంలో ఉన్నప్పుడు జనం ముందు నాటకం నటించడం కాదు, అమరావతిలో ఉన్నప్పుడు కూడా తన అనంతపురం జనం కరువును గుర్తు పెట్టుకుంటేనే... వారి కష్టాలకు పరిష్కారం ఉంటుంది. 

ఇలా పరస్పర విరుద్ధమైన బుద్ధులు ప్రదర్శించడం చంద్రబాబు కు కొత్త కాదు. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర విషయంలో.. తెలంగాణ ప్రాంతాల్లో సభల్లో ఒక తీరుగా, సీమాంధ్ర ప్రాంతపు సభల్లో ఒక తీరుగా మాట్లాడుతూ ఆయన ఎంత కాలంపాటూ జనాన్ని మోసం చేశారో అందరూ చూసిన సంగతే. 

అదే మాదిరిగా ఇవాళ ప్రత్యేకహోదా కోసం పోరాటం జరుగుతోంటే.. జగన్‌ ఉద్యమిస్తే మాత్రం.. ''జగన్‌ పిలగాడు.. ఆయనకేం తెలీదు.. ముందు మీరు విషయాలు తెలుసుకోండి..'' అంటూ వెటకారం చేస్తారు. జగన్‌ దీక్షలకు కూర్చోవాలంటే కనీసం అనుమతులు కూడా ఇవ్వరు. అదే సమయంలో పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రసంగం ఇవ్వగానే.. ''ఆయన చాలా మంచి పని చేస్తున్నారు. నన్నేమీ విమర్శించలేదు'' అంటూ మురిసిపోతారు. పవన్‌కు గంటల్లో సభలకు అనుమతులు ఇచ్చేస్తారు. 

పరస్పర విరుద్ధమైన ఇలాంటి పోకడల్ని ... అపరిచితుడు వైఖరి అనక ఇంకేం అనాలి? 

అయినా అనంతపురంలోని కరవు రైతు ఎండిపోయిన వరిపొలంలో నిల్చుని ట్యాబ్‌ తీసి.. ఆ పొలం ఎంతవరకు ఎండిపోయిందో జీపీఎస్‌లో చూసి.. తన టెక్నాలజీ ప్రావీణ్యాన్ని రైతుకు ప్రదర్శిస్తే .. కడుపు మండుతున్న ఆ రైతు మురిసిపోతాడా? తన పొలం ఎంత ఎండిపోయిందో.. చంద్రబాబు చేతిలోని మాయాదర్పణంలో కనిపిస్తున్నందుకు సంబరపడిపోతాడా? అనేది ప్రశ్న. 

టెక్నాలజీ అనేది నేల ఎండుతున్న, కడుపు మండుతున్న రైతు భూమిలోకి నీళ్లు ఎలా తెప్పించగలదో చంద్రబాబు వారికి వివరిస్తే బాగుంటుంది గానీ.. చేతిలో ట్యాబ్‌ కాకుండా.. ఇంకేవైనా మీటలైనా నొక్కి నీళ్లను తెప్పిస్తే వారి మొహంలో చిరునవ్వు విరుస్తుంది గానీ.. వారి నేల ఎంత ఎండిపోయిందో తేల్చడానికి టెక్నాలజీ కావాలా? ఇదేం ఖర్మ అని రైతులు అనుకుంటున్నారు. 

రేప్పొద్దున్న పంట నష్టాలను క్లెయిం చేసుకునే సందర్భాల్లో ఈ జీపీఎస్‌ వంటి టెక్నాలజీతో పొలాలను వెతికేసి.. సగం పంటే ఎండింది మొత్తం ఎండలేదు అంటూ.. సాయం కూడా కోత వేస్తారేమో అని కూడా కొత్త భయాలు వారిలో పుట్టుకొస్తున్నాయి. అంతే తప్ప... చంద్రబాబు చెబుతున్న టెక్నాలజీ అనేది.. అచ్చంగా పేదవాడికి మేలు చేస్తుందని వారు అనుకోలేకపోతున్నారు. 

Show comments