ఉల్టా చోర్‌.. కొత్వాల్‌ కే డాంటే.!

తెలంగాణలో ఇది బాగా విన్పించే నానుడి. దొంగ, పోలీస్‌ని చూసి దొంగ దొంగ.. అరిచాడన్నది దానర్థం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ పరిస్థితి ఇప్పుడు అచ్చంగా అలానే వుంది. 'ఎమ్మెల్యేలని సంతలో పశువుల్లా కొనేస్తున్నారు..' అని వైఎస్సార్సీపీలో వున్నప్పుడు ఆరోపించింది ఇదే జ్యోతుల నెహ్రూ.

అప్పట్లో అధికార తెలుగుదేశం పార్టీపై జ్యోతుల నెహ్రూ చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అసెంబ్లీ సాక్షిగా జ్యోతుల నెహ్రూ, టీడీపీపైనా, స్పీకర్‌ ఛెయిర్‌పైనా బూతుల దండకం అందుకోవడాన్ని ఎలా మర్చిపోగలం.?  రోజులు మారాయి. అంతా గడిచి, ఆర్నెళ్ళు కూడా పూర్తి కాలేదు. ఇంకా జ్యోతుల నెహ్రూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేనే. జస్ట్‌, ఆయన పచ్చ కండువా కప్పుకున్నారంతే.

పచ్చ కండువా ప్రభావమేమో, జ్యోతుల నెహ్రూ, తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిన వైఎస్సార్సీపీపై దుమ్మెత్తి పోసేస్తున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఛాన్సిచ్చిన వైఎస్‌ జగన్‌పై మండిపడ్తున్నారు.  రాజకీయాలన్నాక విమర్శలు సహజం. పార్టీలు మారాక దొంగ పోలీస్‌ అవుతాడు.. పోలీస్‌ దొంగ అవుతాడు. కానీ, అంతకు ముందు ఏం మాట్లాడాం.? ఇప్పుడేం మాట్లాడుతున్నాం.? అన్నదీ ఆలోచించుకోవాలి కదా.!

ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఆరోపణలకి మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్‌లో తెరలేపింది జ్యోతుల నెహ్రూనే. ఆయనే ఇప్పుడు ఆ కొనుగోళ్ళ ఆరోపణల్ని తప్పు పడ్తున్నారు. తానేమీ అమ్ముడు పోలేదంటున్నారు.  'నన్ను డబ్బులతో కొనేంత దమ్ము ఎవరికీ లేదు..' అంటున్న జ్యోతుల నెహ్రూ, వైఎస్‌ జగనే ఎమ్మెల్యేలకు డబ్బులిస్తున్నారనీ, అవినీతికి వైఎస్‌ జగనే కేరాఫ్‌ అడ్రస్‌ అనీ నినదించేస్తోంటే, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది.

జగన్‌పై అవినీతి ఆరోపణలు ఇప్పటివి కాదు. ఆయన అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా వున్నారు. ఆ సమయంలోనే జ్యోతుల నెహ్రూ ఆయన పంచన చేరారు. పూర్తిస్థాయిలో జగన్‌ని వెనకేసుకొచ్చారు.  రాజకీయ నాయకులంటే విలువలకు వలవలూడ్చేసే వాళ్ళే ఇప్పుడున్న రాజకీయాల్లో. కానీ, సీనియర్లు.. ఎప్పటినుంచో రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి వున్నామని కలరింగ్‌ ఇచ్చినోళ్ళూ విలువల్ని దిగజార్చేసుకుంటే ఎలా.?

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు, సీనియర్లమని చెప్పుకుంటోన్నవాళ్ళతోనే రాజకీయాలకు ప్రమాదం పొంచి వుంది. ఇదిగో, జ్యోతుల నెహ్రూ లాంటోళ్ళతో రాజకీయం మరింత అభాసుపాలవుతోంది.  ఓ పార్టీ గుర్తుపై గెలిచి, ఇంకో పార్టీలో చేరడమే అనైతికం. అనైతిక రాజకీయాలకు పాల్పడి, ఎమ్మెల్యేగా తనను గెలిపించిన పార్టీపైనా, ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిన పార్టీ అధినేతపైనా విమర్శలు చేయడమంటే రాజకీయాల్లో దిగజారుడుతనానికి పరాకాష్ట. ఆ తప్పు జ్యోతుల నెహ్రూ చేసినా, ఇంకెవరైనా చేసినా.. తప్పు తప్పే.!

Show comments