ఈసారి కబ్జా ఖబర్‌: టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్‌

అదేంటో, టీడీపీకి కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎంపికైన నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చేస్తున్నారు. అలా ఇలా కాదు, ఈ షాక్‌లతో అధినేత చంద్రబాబుకే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. మొన్నీమధ్యనే, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సీబీఐ దాడులు జరగడం, ఈ క్రమంలోనే ఆయన్ని చంద్రబాబు, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సి రావడం తెల్సిన విషయాలే. తాజాగా, మరో టీడీపీ ఎమ్మెల్సీ వివాదాల్లో ఇరుక్కున్నారు. వివాదంలో ఇరుక్కోవడమే కాదు, అరెస్టయ్యారు కూడా. 

కొత్తగా అరెస్టయిన ఎమ్మెల్సీ మహానుభావుడెవరో కాదు దీపక్‌రెడ్డి. ఈయనగారిపై కబ్జా ఆరోపణలున్నాయి. దీపక్‌రెడ్డి ఆయన సన్నిహితులు వందల ఎకరాల్ని హైద్రాబాద్‌లో కబ్జా చేశారన్నది ముఖ్య ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే దీపక్‌రెడ్డిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడం గమనార్హం. ఒకటి కాదు రెండు కాదు ఆరుకి పైగా కబ్జా కేసులు దీపక్‌రెడ్డిపై వున్నట్లు తెలుస్తోంది. 

తెల్లారిందంటే చాలు, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 'నేను నిప్పు.. అవినీతినీ, అక్రమాల్ని అస్సలేమాత్రం సహించను..' అంటూ బల్లగుద్దేస్తుంటారు. కానీ, తెరవెనుక జరిగే వ్యవహారాలు వేరు. చంద్రబాబు, టీటీడీ బోర్డ్‌లో శేఖర్‌రెడ్డికి అవకాశం కల్పించారు.. ఆ శేఖర్‌రెడ్డి పెద్ద నోట్ల రద్దు సమయంలో కుప్పలు తెప్పలుగా పాత కరెన్సీని కొత్త కరెన్సీగా మార్చుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దాంతో అతన్ని టీటీడీ నుంచి తొలగించారు చంద్రబాబు. 

మొన్న వాకాటిని సస్పెండ్‌ చేసినట్లే రేపు దీపక్‌రెడ్డినీ చంద్రబాబు పార్టీ నుంచి తొలగించొచ్చుగాక.. అంతమాత్రాన పార్టీకి అంటిన మకిలి వదిలిపోతుందా.? అసలు ఎమ్మెల్సీ ఎన్నికలే కోట్లాది రూపాయల ధనప్రవాహంతో జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు తోడు ఈ వివాదాలు. చంద్రబాబు జమానా అదిరిపోయింది కదూ.!

Show comments