లోకేష్‌ అమెరికా ఎందుకు వెళ్లలేదు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు కమ్‌ పంచాయతీరాజ్‌ అండ్‌ ఐటీ శాఖల మంత్రి లోకేష్‌ వార్తల్లో వ్యక్తి అయిపోయాడు. ఆయనకు సంబంధించిన కథనాలు ప్రచురింకపోతే. ప్రసారం చేయకపోతే మీడియాకు వెలితిగా ఉంటోంది. తాజాగా మీడియాలో ఓ ప్రశ్న హల్‌చల్‌ చేస్తోంది. ఏమి టది? లోకేష్‌ తండ్రి చంద్రబాబుతో కలిసి అమెరికా ఎందుకు వెళ్లలేదు? వెళ్లకపోవడానికి ఏవో కారణాలు ఉంటాయి కదా. చినబాబు పర్యటన రద్దుకు కారణాలు ప్రభుత్వం చెప్పదు. కాబట్టి మీడియా తన మార్గంలో తాను రంధ్రాన్వేషణ చేస్తోంది. ఇలా చేయడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వమే. చంద్రబాబు వెంట వెళ్లే బృందంలో లోకేష్‌ కూడా ఉన్నాడని మొదట ప్రభుత్వం ప్రకటించింది. అంటే పర్యటనకు సంబంధించి జీవో జారీ చేసింది. కాని తరువాత ఉన్నట్లుండి చినబాబు విరమిం చుకున్నాడు. దీంతో బాబు బృందంలో లోకేష్‌ లేడని తెలి యచేస్తూ మరో జీవో జారీ అయింది. ఇదే అనేక రకాల అనుమానాలకు ఆస్కారమిస్తోంది.

చంద్రబాబు విదేశీ పర్యటనల లక్ష్యం పెట్టుబడులు ఆకర్షించాలనేది తెలిసిన విషయమే. ముఖ్యంగా విదేశాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించాలనేది ధ్యేయం. ఐటీ కంపెనీల ద్వారానే ఉపాధి అవకాశాలు ఎక్కువ లభిస్తాయని ఆయన అభిప్రాయం. అనేక కంపెనీలతో చర్చలు జరపాలి కాబట్టి ఎనిమిది రోజుల టూర్‌ ప్లాన్‌ చేశారు. వాస్తవానికి ఇంతటి ముఖ్యమైన పర్యటనలో ఐటీశాఖ మంత్రిగా లోకేష్‌ ఉండాలి. మరి పర్యటన ఎందుకు రద్దయినట్లు? ఒక సమాచారం ప్రకారం...చంద్రబాబు భయం కారణంగానే లోకేష్‌ పర్యటన రద్దయింది. ఏమిటా భయం? లోకేష్‌కు అవమానం జరుగుతుందే మోనని, పరువు పోతుందేమోనే భయం. ఇదేం భయం? ఎందుకలా జరుగుతుంది? ఐటీ శాఖ మంత్రి హోదాలో లోకేష్‌ అమెరికాలో పర్యటించిన తరువాత కూడా ప్రముఖ (అంతర్జాతీయంగా పేరున్నవి) కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి, తమ యూనిట్లు రాష్ట్రంలో నెలకొల్పడానికి ముందుకు రాకపోతే అది లోకేష్‌కు అవమానకరంగా ఉం టుందని చంద్రబాబు భావించారట....! ఐటీ కంపెనీలు రాకపోతే ఆ ప్రభావం లోకేష్‌ రాజకీయ జీవితం మీదా పడుతుందట...! అందుకని ఐటీ కంపెనీల సీఈవోలతో తానే చర్చలు జరపాలని బాబు నిర్ణయించుకున్నారట.

లోకేష్‌కు అవమానం జరగడమంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ విమర్శలు చేయడమని అర్థం చేసుకోవాలి. 'ఐటీ మంత్రిగా లోకేష్‌ అమెరికా వెళ్లి ఏం సాధించాడు?'..అంటూ వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తే బాబు తట్టుకోలేకపోవచ్చు. లోకేష్‌ మంత్రి అయినప్పటినుంచి స్వయంకృతాపరాధాల కారణంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే లోకేష్‌ను 'పప్పు' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మాట్లాడటం చేతకాదంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు అమెరికా వెళ్లి అపజయం మూటగట్టుకొని వస్తాడని బాబు భయపడ్డారేమో...! ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా రాజకీయ వారసులకు అపజయాలు దక్కుతా యేమోనని కన్నవారు భయపడుతున్న దాఖలాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం నుంచి ప్రియాంక గాంధీ తప్పుకోవడానికి సోనియా గాంధీ భయపడటమే కారణమని కొన్ని ఆంగ్ల పత్రికలు రాశాయి. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు, ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు కాంగ్రెసు నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాని ఎన్నికల్లో తెరమరుగై పోయారు. ఇందుకు కారణం..కాంగ్రెసు ఓడిపోతే ప్రియాంకకు అపకీర్తి వస్తుందని సోనియా భయపడినట్లు సమాచారం. ఆమె భయానికి తగినట్లే కాంగ్రెసు అత్యంత దారుణంగా ఓడిపోయింది.

ఈ అపజయానికి పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్‌ని కూడా కారకుడిని చేయలేదు. భయం విషయంలో చంద్రబాబుకు, సోనియాకు పోలికలు ఉన్నట్లున్నాయి. లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు లోకేష్‌ను పోటీ చేయించాలని కోరుతూ రాజీ నామా చేయడానికి సిద్ధపడ్డారు. దమ్ముటే లోకేష్‌ ఎమ్మె ల్యేగా గెలవాలంటూ వైకాపా సవాల్‌ చేసింది. ఉప ఎన్నిక వస్తే ప్రతిపక్షం కూడా పోటీ చేస్తుంది కదా. అలాం టప్పుడు లోకేష్‌ ఓడిపోతే? లేదా బొటాబొటి మెజారిటీతో గెలిస్తే?...ఈ భయాలతో బాబు అతన్ని ఎమ్మెల్సీ చేశాడనేది ఒక వాదన. ఉప ఎన్నిక తెప్పిస్తే ప్రజాధనం వృథా అవుతుందనే ఉద్దేశంతో లోకేష్‌ను ఎమ్మెల్సీ చేశానని బాబు చెప్పారు. నిజానికి బాబు ఎంత డబ్బు వృథా చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇక లోకేష్‌ పర్యటన ఎందుకు రద్దయింది? అనే ప్రశ్నకు కొందరు నాయకులు మరోలా చెబుతున్నారు. బాబు ఎనిమిది రోజులు అమెరికా వెళుతున్నారు కాబట్టి లోకేష్‌ రాష్ట్రంలో ఉండి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే మంచిదని అనుకున్నారట. మే నెలాఖరులో విశాఖలో నిర్వహించే మహానాడుకు ఏర్పాట్లు చేసేందుకుగాను లోకేష్‌ను ఉండమని చెప్పారట. ఏపీ ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్నారు. వీరు సామాజిక సమీకరణాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రులయ్యారు తప్ప చంద్రబాబు పరోక్షంలోనూ ఏం చేసేందుకు అవకాశం లేదు. బాబు అమెరికాలో ఉన్న వారం రోజుల్లో అన్ని సంగతులు లోకే షే చూసుకుంటాడు. ఎవరైనా ఆయనతో మాట్లాడా ల్సిందే. బాబు అధికారికంగా ప్రకటించకపోయినా లోకేష్‌ ఉప ముఖ్యమంత్రేనని ఓ సీనియర్‌ మంత్రి వ్యాఖ్యా నించారు. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్లో వారసుల హవా సాధారణమేనని, పెద్దగా పట్టించుకోవల్సిన విషయం కాదన్నరు. పెత్తనం చేయడానికి వయసుతోనూ నిమిత్తం లేదన్నారు.

నెంబర్‌.2 స్థానం ఫలాన మంత్రిదని ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చెప్పరు కదా. కాని ప్రధాని, సీఎం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న మంత్రి లేకుండా ఉండడు. కాని ఫలాన మంత్రి అని చెప్పలేం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో నెంబర్‌.2 ఎవరనేది సులభంగా చెప్పొచ్చు. ఆయనే ఐటీ అండ్‌ రూరల్‌ డెవెలప్‌మెంట్‌ మంత్రి లోకేష్‌. ఇది మీడియా చెబుతున్న సంగతి. జనం అభిప్రాయం కూడా ఇదే. పార్టీప్రధాన కార్యదర్శి పదవితో కీలకనాయకుడిగా ఎదిగిన లోకేష్‌ ఇప్పుడు మంత్రి పదవి తో మరింత సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. ఈమధ్య జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో లోకేష్‌ కీలకంగా వ్యవహరించాడని కథనాలొచ్చాయి. మంత్రివర్గంలో మార్పులు చేర్పుల తరవాత 'ఇది ఎన్నికల కేబినెట్‌' అని చంద్రబాబు ప్రకటించారు. సమర్థులకు పదవులు ఇచ్చామన్నారు. ఆ సమర్థులను ఎంపిక చేసింది లోకేషే. టీడీపీ నాయకులు కాబోయే సీఎం లోకేషేనని అంటు న్నారు. అలాంటప్పుడు తండ్రి పరోక్షంలో అధికారం చెలాయించకుండా ఎలా ఉంటాడు?

-నాగ్‌ మేడేపల్లి

Show comments