'జాబు'లో ఉండాలంటే డప్పు కొట్టాల్సిందే

'జాబు రావాలంటే బాబు రావాల్సిందే' అనేది నిన్నటి నినాదం.. అంటే జనం నుంచి ఓట్లు దండుకోవడం మీద దృష్టి నిలిపిన సమయంలో పుట్టిన నినాదం మాత్రమే. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన తర్వాత చంద్రబాబు నినాదం మారిపోయింది. జాబులో ఉండాలంటే డప్పు కొట్టాల్సిందే అని చంద్రబాబు ఇప్పుడు పురమాయిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు అందరూ.. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ తిరిగి చెప్పాల్సిందేనట. ఈ మేరకు ఆయన ఐఏఎస్‌లు, హెచ్‌ఓడీలు, ఉన్నతాధికార్లతో శుక్రవారం నాడు నిర్వహించిన సమావేశంలో ఆదేశించేశారు. 

చంద్రబాబునాయుడు ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ఏమిటో, ఇప్పటిదాకా తమ పనితనం వలన సాధించిన ఫలితాలు ఏమిటో గానీ.. మొత్తానికి పనిమీద కంటె ప్రచారం మీద ఆయనకు చాలా ఎక్కువగా ధ్యాస ఉంది. ఇదివరకు తొమ్మిదేళ్ల పాలన కాలం నాటినుంచి కూడా.. తనను తాను అత్యద్భుతమైన నాయకుడిగా ప్రొజెక్టు చేసుకోవడానికి చంద్రబాబునాయుడు ఎన్ని రకాల కొత్త కొత్త ప్రచార టెక్నిక్కులు ప్రయోగిస్తూ ఉంటాడో.. అందరూ గమనించినదే. ఇప్పుడు కూడా ఆయన ప్రచారం మీద విపరీతంగా ఆధారపడుతున్నారు. 

బయటినుంచి గమనిస్తున్న వారికి మాత్రం.. చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రచారం చాలా ఎక్కువైపోయిందని అనిపిస్తుంటుంది. చేసిన దానికంటె కొట్టుకుంటున్న డప్పు చప్పుడు ఎక్కువగా ఉన్నదని విమర్శలు అనేకం ఉన్నాయి. అయితే తన బృందమూ మరియు వందిమాగధులూ అందరూ కలిస్తున్న కొడుతున్న డప్పు చంద్రబాబుకు చాలినట్లు లేదు. 

ఇప్పటికే తన పార్టీ నేతలందరికీ కూడా.. ప్రభుత్వం చేపడుతున్న పనుల గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయమంటూ పురమాయిస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ పనిని ప్రభుత్వాధికారులకు కూడా చెబుతున్నారు. హెచ్‌ఓడీల మీటింగులో.. కలెక్టర్లనుంచి మండలస్థాయి అధికార్ల వరకూ అందరూ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం రుణమాఫీ రూపేణా రైతులోకానికి ఎంతెంత సేవ చేసేస్తున్నదో.. వారికి ఎంత లబ్ధి చేస్తున్నదో ఇదంతా అధికార్లు ఇంటింటికీ వెళ్లి చెప్పాలట. 

అందరూ ఈ బాధ్యత కూడా తీసుకోవాలని చంద్రబాబు తాజాగా పురమాయించారట. చంద్రబాబు వస్తే కొత్త 'జాబు'లు రావడం సంగతి తర్వాత.. ఉద్యోగాల్లో ఉన్న వారు వాటిని కాపాడుకోవడానికి ఇలా ఆయన సర్కారుకు డప్పు కొట్టాల్సిన ఖర్మ పట్టిందేంట్రా అని అనుకుంటున్నారట.

 అయినా అధికారులు.. ఎడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా వారికి అప్పగించిన విధులు వారు నిజాయితీగా, జాగులేకుండా చేసేలా వారికి ప్రేరణ ఇస్తే చాలు.. అది జరిగితే... చంద్రబాబు పాలనను జనం మొత్తం మెచ్చుకుంటారు. అంతే తప్ప వారితో డప్పు కొట్టించినంత మాత్రాన ప్రత్యేకంగా ఒనగూరేది ఏమీ ఉండదని ఆయన తెలుసుకోవాలి. 

Show comments