పెద్దవాళ్లకి ఓ సమస్య వుంటుంది. వాళ్లు చేసిన పనే చిన్నవాళ్లు చేస్తే, కాస్త ఇబ్బందిగా వుంటారు. మేం చేయమన్నట్లు చేయాలి కానీ, మేం చేసినట్లు చేయకూడదు అంటారు. దీనికే మన పూర్వీకులు..పెద్ద వాళ్లు తింటే పరమాన్నాలు..చిన్న వాళ్లు తింటే చిరుతిళ్లు అని పేరు పెట్టారు. ఇప్పుడు అనుభవం రీత్యా తెలుగుదేశం పెద్ద. జనసేన చిన్న. ఇప్పుడు సమస్య ఈ ఇద్దరి మధ్య.
జనసేన ఏం చేసిందీ..ఎప్పుడో ముఫై ఏళ్ల క్రితం తెలుగుదేశం చేసిన పనే చేయబోయింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం..ఉత్తరాది పెత్తనం అంటూ. ఆ తరువాత ఏం చేసిందీ. తెలుగుదేశం పార్టీ ఆ విర్భావం నాటికి ముఫై ఏళ్లుగా పాతుకు పోయిన కాంగ్రెస్ ను అంత వీజీగా కదిలించలేము, దీనికి మిగిలిన రాజకీయ పక్షాల తోడు కావాలి అని డిసైడ్ అయి, వామ పక్షాలతో ఓ సారి, భాజపాతో మరోసారి, మళ్లీ వామ పక్షాలతో ఓసారి, టీఆర్ఎస్ తో మరోసారి, భాజపాతో ఇంకోసారి ఇలా తోడు లేని జీవితం మాత్రం ఏనాడూ గడపకుండా చూసుకుంటూ వస్తోంది.
మరి ఇప్పుడు జనసేన ఏం చేస్తోంది. అదే అయిడియాతో వామపక్షాలకు దగ్గర కావాలని చూస్తోంది. ఇది తెలివైన ఆలోచన. సినిమాటిక్ ఆలోచన. సినిమాటిక్ ఆలోచన అనడం ఎందుకంటే, జనసేన వెనుక వున్నది సినిమా హీరో పవన్ కళ్యాణ్ కాబట్టి. సినిమా హీరోలకు ఓ అలవాటు వుంది. అదేమిటంటే, తమ పారితోషికం బదులు ఏరియాల హక్కులు తీసుకోవడం. కానీ అలా తీసుకుని ఏం చేస్తారు? తమకు పంపిణీ నెట్ వర్క్ లేకుండా. ఎవరో తెలిసిన పంపిణీ నెట్ వర్క్ వున్నవాడి తోడు తీసుకుంటారు.
ఇప్పుడు జనసేన చేసే పని కూడా అదే. ఆ పార్టీకి అభిమానుల నెట్ వర్క్ వుంది కానీ, పార్టీ నెట్ వర్క్ లేదు. ఈ వామపక్షాలకు కార్యకర్తల నెట్ వర్క్ వుంది కానీ, ఓట్లు వచ్చే వర్క్ లేదు. అందుకే వాళ్లను దగ్గరకు తీస్తే, గ్రౌండ్ వర్క్ వాళ్లు చేస్తారు. బ్యానర్లు కట్టడం, జెండాలు మోయడం వాళ్లు చేస్తారు. కుర్చీలో మనం కూర్చోవచ్చు. ఇదీ తెలివైన ఆలోచన. కానీ దీనికి పేటెంట్ ఎవరిదీ? తెలుగుదేశం పార్టీది. మరి ఆ ఆలోచనే వేరేవాళ్లు చేస్తే కోపం రాదా? వస్తుంది. అందుకే వచ్చింది. కానీ ఎలా బయట పెట్టాలి. తెలుగుదేశం పార్టీ కళ్లు,చెవులు,నోరు అయిన ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఒకటి వుంది. పచ్చ చొక్కా వేసుకుంటే తెలుగుదేశం అనుకుంటారేమో అని కొందరు అనుకుంటే, తెలుగుదేశం అనుకోవాలనే పచ్చ చొక్కా వేసుకునే బాపతు కొందరు వుంటారు. ఈ సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రెండో బాపతు. నవ్వి పోదురు గాక మాకేటి సిగ్గు..మా బాబు క్షేమమే గాక మాకేటి వెరపు అనే టైపు. అందుకే ఇప్పుడు వీళ్లకు, జనసేన వైపు వెళ్లాలనుకుంటున్న వామ పక్షాలు జవసత్వాలు ఉడిగిపోయిన, వట్టిపోయిన ఆవుల్లా కనిపిస్తున్నాయి. వీటిని చేరదీయడం,మేపడం, చేపడం అన్నీ దండుగ అన్నట్లు అక్షర విన్యాసాలు చేస్తున్నాయి. అంటే జనసేన వీళ్లకు దూరంగా నన్నా జరగాలి లేదా, వాటి ఇజ్జత్ అన్నా తాము తీయాలి. ఇదే తక్షణ కర్తవ్యం అన్నమాట.
దేశం చేరదీయదన్న గ్యారంటీ వుందా?
సమస్య ఏమిటంటే, భాజపా-వామపక్షాలు ఒక ఒరలో ఇమడవు. లేదంటే, ఈపాటికి తెలుగుదేశం పార్టీ డబుల్ రూమ్ ఇంటిలో ఓ గదిలో భాజపా వుంటే, మరో గదిలో వామపక్షాలు క్షేమంగా, నిక్షేపంగా కాపురం వుండేవే. వామపక్షాలకు తెలుగుదేశం పార్టీ అంటే అమిత ప్రేమ. అసలు ఆ పార్టీ అనే దాని కన్నా ఆ పార్టీ మూలాలు అంటే మరీ ప్రేమ. కానీ ఏం చేయగలరు? చంద్రబాబేమో, ఈసారి భాజపాతో వెళ్దాం అని 2014 ఎన్నికల ముందు డిసైడ్ కావడంతో ప్రేమను మనసులోనే దాచుకుని, బాబుగారికి దూరంగా వుండిపోక తప్పలేదు. లేదూ అంటే వామ పక్షాలకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం లేక కాదు. కానీ ఏం చేయాలి..పల్లకి మోయడం అలవాటైన వారికి ఏదో ఒక బేరం దొరకాలి కదా? అలాంటి టైమ్ లో పవన్ కళ్యాణ్ కాస్త ఆశగా కనిపించారు.
పవన్ బాబు కు కూడా ఇది తెలియని విషయం కాదు. 2019 నాటికి బాబు భాజపాతో వెళ్లకపోతే, ఇవే వామ పక్షాలు ఆయన వెంట క్యూ కట్టేస్తారని తెలుసు. ఇప్పుడు భాజపా ఎలాగూ బద్ నామ్ అయిపోయింది. పవన్ కు పనికి రానిది అయిపోయింది. అందుకే ముందుగా వామపక్షాలపై రుమాలు వేసి వుంచుకుంటే మంచిదనుకుంటున్నారు. కానీ అదే తేదేపా జనాలకు కంటకంగా వుంది. ఎందుకంటే, ఇప్పటికిప్పుడు భాజపాను వదిలే పరిస్థితి లేదు. 2019 నాటికి కూడా వుంచుకునేదీ లేదు. మరి అప్పటి దాకా ఇలా వామపక్షాలను గాల్లో వుంచి, అప్పుడు దగ్గరకు తీసుకోవచ్చన్నది తెలుగుదేశం ప్లాన్. కానీ అంతవరకు వామపక్షాలు వేచి వుండకుండా పవన్ బాబుతో వెళ్తామంటే బాబు అండ్ కో కు కాస్త చిరాకు కలిగించదా? అందుకే బాజపాను బద్ నామ్ చేసిన తీరుగానే వామపక్షాలను కూడా గడ్డిపోచల్లా తీసి పడేసే వ్యాసాలు వండడం ప్రారంభించేసారు.
వాటికి విలువ లేదని, అవి వేస్ట్ అని అర్థం వచ్చేలా? సరే, అదే నిజం అనుకుందాం. మరి 2019 నాటికి వామ పక్షాలను బాబు దగ్గరకు తీయరు అని హామీ ఇవ్వగలరా? పవన్ దగ్గరకు తీయకపోతే, 2019 నాటికి వామపక్షాలు-తెలుగుదేశం చెట్టాపట్టాలు వేసుకోవని స్పష్టంగా చెప్పగలరా? అబ్బే..అంత లేదు. ఇప్పటికిప్పుడు వామపక్షాలు తొందరపడి ఎవరి వెంటా వెళ్లకూడదు. అలా వెయిటంగ్ లిస్ట్ లో వుండి, 2019 నాటికి బాబుగారి కటాక్షంతో ఒకటో రెండో సీట్ల కోసం, తెలుగుదేశం పల్లకీని తమ భుజాల మీద మోయాలి. అలా చేస్తే, వామపక్షాలు మహా మంచి. లేదంటే, అస్సలు పనికిరాని పుచ్చు సరుకు. అదే దేశం తరపును పలికే 'పలుకు'.