చంద్రబాబూ.. ఆ రైతుల భవిష్యత్తేంటి.!

దేశాన్ని కుదిపేస్తోన్న కరెన్సీ మార్పిడి వివాదం.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమరావతి పరిధిలో రైతులు, ఇప్పటికే ప్రభుత్వానికి తమ భూముల్ని చాలావరకు అప్పగించిన విషయం విదితమే. అయితే, మరి కొందరు రైతులు తమ భూముల్ని అమ్మి 'క్యాష్‌' చేసుకున్నారు కొన్నాళ్ళ క్రితమే. వేలు తప్ప, లక్షలు కూడా అంతకు ముందు వరకూ చూడని రైతులు, ఒక్కసారిగా భూముల ధరలు పెరగడంతో, కళ్ళ ముందు కోట్లు చూసేశారు. 

మంచమ్మీద పెద్ద నోట్ల కట్టల్ని పరిచేసుకుని, వాటితో కొందరు సెల్ఫీలు దిగి భద్రపరుచుకున్నారు కూడా. సరిగ్గా తారు రోడ్డు కూడా లేని ప్రాంతాల్లో రాత్రికి రాత్రి బ్యాంకులు, ఖరీదైన వాహనాల షోరూంలు వెలిశాయి. గోవా తరహాలో 'గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌' కూడా అక్కడ కొలువుదీరాయి. అలా చాలామంది నష్టపోయారనుకోండి.. అది వేరే విషయం. జాగ్రత్తపరుల పరిస్థితి, ఇప్పుడు నోట్ల మార్పిడి పుణ్యమా అని అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. 

అసలు ఆదాయపు పన్ను అంటే ఏంటో కూడా తెలియని రైతులు, తాజా కరెన్సీ మార్పిడితో భయాందోళనలకు గురవుతున్నారు. 'ఐటీ లెక్కలు చూపించాల్సిందే.. లేకపోతే జైలుకెళ్ళక తప్పదు..' అంటూ జరుగుతున్న ప్రచారంతో వారి ఆందోళన రోజురోజుకీ తీవ్రమైపోతోంది. లక్షలు కూడా ధర పలకని భూములకు కోట్ల రూపాయల దరలు పలకడంతో సంబరపడ్డ రైతులు, ఇప్పుడు తమ భవిష్యత్తేంటని నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూములు అమ్మి దాచుకున్న డబ్బుల్ని బ్యాంకుల్లో వెయ్యలేక, వేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలియక.. వారి ఆవేదన వర్ణనాతీతం. 

ముందస్తు లీకులతో అమరావతిలో భూముల ధరల పెరుగుదల వెనుక అధికార పార్టీ 'పాపం' సుస్పష్టం. 'మేమే పెద్ద నోట్లను రద్దు చేయమన్నాం..' అని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు రైతుల పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారు.? చిత్రమేంటంటే, దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాల తీవ్రతత పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో ఆ తీవ్రత చాలా చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఎందుకట.? ఏమో మరి, చంద్రబాబుకే తెలియాలి.

Show comments