పైకి మాత్రం క్రీడల్ని ప్రోత్సహించాలి. జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో తెలుగుజాతికి వన్నె తెచ్చే క్రీడాకారుల స్ఫూర్తి అందరికీ అందేలాగా ప్రచారం కల్పించాలని అందరూ చెబుతుంటారు. కానీ ఓ తెలుగు అమ్మాయికి జాతీయ స్థాయి క్రీడా అవార్డుల్లో ప్రతిష్ఠాత్మకమైన వాటిలో ఒకటైన ధ్యాన్‌చంద్ అవార్డు లభిస్తే.. ఈనాడు దినపత్రిక కనీసం ఆమె ఫోటోను కూడా ప్రచురించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. జాతీయ స్థాయి అవార్డులు తెచ్చుకున్న క్రీడాకారుల ఫోటోలు వేయడానికి కూడా ఈనాడుకు 'ప్రత్యేక' కారణాలు ఉంటే.. ఎలా అని జనం అనుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్తి గీత అనే అథ్లెట్‌కు ఈ ఏడాది ధ్యాన్‌చంద్ అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో అది కూడా ప్రతిష్ఠాత్మకమైన అవార్డు. అయితే ఇవాళ ఈనాడు దినపత్రికలో ఇదే కార్యక్రమానికి సంబంధించిన పీవీసింధు ఫోటోలను ఒకటికంటె ఎక్కువ ప్రచురించారు. ద్రోణాచార్య అవార్డు వచ్చిన తెలుగు వ్యక్తి ఫోటో వేశారు. ఇతర రాష్ట్రాల ఆటగాళ్ల ఫోటోలు కూడా వేశారు. కానీ సత్తి గీత ఫోటో మాత్రమే వేయలేదు.
తెలుగు వారిని ప్రోత్సహించాలి. క్రీడాకారులకు స్ఫూర్తి ఇవ్వాలి అని చెప్పే పత్రిక ఆమె ఫోటోను వేయకపోవడం ఏమిటి అని ఎవరికైనా అనిపిస్తుంది. క్రీడలంటే.. ఒలింపిక్ పతకం మాత్రమేనా బ్యాడ్మింటన్ మాత్రమేనా.. అథ్లెటిక్స్ కు గుర్తింపు వద్దా.. వాటిని చిన్నచూపు చూస్తారా? అని కూడా అనిపిస్తుంది.
అయితే గుసగుసలుగా వినిపిస్తున్న సంగతి ఏంటంటే.. సత్తి గీత ఫోటో వేయకపోవడానికి కుల పరమైన కారణాలు కూడా ఉన్నాయిట. వీలైనంత తక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి ఈనాడు ప్రయత్నించే కులానికి చెందిన అమ్మాయి అయినందువల్ల ఆమె ఫోటో వేయలేదని అనుకుంటున్నారు.