సింధూ కోసం.. ఆంధ్రా, తెలంగాణ తోపులాట!

ఇప్పటికే సింధూ కులం గురించి చాలా రచ్చ జరుగుతోంది. సింధూ మా వైశ్య సామాజికవర్గానికి చెందిన రత్నం అని కొంతమంది.. కాదు కాదు, కాపు అని మరికొంతమంది వాదులాడుకుంటున్నారు. అలాగే కమ్మవాళ్లు కూడా సింధూ మా అమ్మయే అని వాదిస్తున్నారు.

కులం తర్వాత ఈ భారతదేశంలో రెండో ప్రాధాన్యత ప్రాంతానికే కదా.. ఆ విషయంలో కూడా రచ్చ జరుగుతోంది. కొంతమందేమో సహజ సిద్ధంగా సింధూ.. ఆంధ్రాకు చెందిన మణిపూస అంటుంటే.. మరికొందరు సింధూ ఆంధ్రా కాదు అని నిరూపించే పనిలో పడ్డారు. సింధూ తండ్రిది నిర్మల్ అని, ఆమె తల్లిది చెన్నై అని వీరి వాదన. సింధూ పుట్టింది హైదరాబాద్ లో.. ఇలాంటప్పుడు మధ్యలో ఆంధ్రా ఎలా వచ్చింది? అనేది వీరి ప్రశ్న.

సింధూ కులం గురించి శోధిస్తారా? అంటూ విరుచుకుపడుతూ విశాల భావాలు ప్రదర్శించేవాళ్లే ఆమె తమ ప్రాంతానికి చెందినది.. అని సంకుచితత్వం ప్రదర్శిస్తున్నారు. సింధూ ప్రాంతాలకు అతీతమైన చాంపియన్ అనే వాళ్లే ఆమె తమ కులానికి చెందిన అథ్లెట్ అని వాదిస్తున్నారు. ఇదీ జనాల వైఖరి.

మరి ఈ నేపథ్యంలో.. సింధూకు వెల్కమ్ చెప్పడంలో కూడా ఈ వర్గాల మధ్య గట్టి పోరాటమే జరిగినట్టుగా తెలుస్తోంది. ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమెకు  వెల్కమ్ చెప్పడంలో తన్నులాటే జరిగినట్టుగా తెలుస్తోంది. సింధూకు వెల్కమ్ చెప్పడంలో.. ఆంధ్రా, తెలంగాణ.. ఇలా రెండు వేర్వేరు బ్యాచ్ లుగా జనాలు విడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ కమిటీల వారు.. సింధూకు మా పూల బొకే ముందుగా అందాలంటే.. మాది అందాలి.. అని పోటీలు పడ్డట్టుగా తెలుస్తోంది.

అలాగే.. ఆంధ్రా, తెలంగాణ క్యాబినెట్ మంత్రులు కూడా విమానాశ్రయానికి క్యూ కట్టారు. సింధూకు బొకేలు అందించడంలో వీరూ పోటీ పడ్డారు. సింధూ ప్రాంతం విషయంలో కూడా వీరు అక్కడే వాదనకు దిగి ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు! ఇదంతా ప్రత్యక్షంగా చూసి విస్తు పోవడం ప్రాంతీయ, కులతత్వాలకు దూరంగా ఉన్న మనుషుల వంతయ్యింది!

Show comments