'పచ్చ' పార్టీకి గట్టోడు దొరకడంలేదా?

ఏపీ టీడీపీకీ ఓ గట్టి నాయకుడు కావాలి. రాజకీయంగా బలంగా ఉండాలి. ఇప్పటి భాషలో చెప్పాలంటే రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉండాలి. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో పని చేయాలి. పార్టీపై మంచి పట్టుతో ఉండాలి. నిర్దేశించిన అర్హతలన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకూ ఈ నాయకుడు ఏ పదవి కోసం? ఈ అర్హతలన్నీ అధినేత చంద్రబాబునాయుడికి ఉన్నాయి కదా. మరో నాయకుడు అవసరమా? చంద్రబాబుకు ఎన్ని అర్హతలున్నా అర్జంటుగా ఆయనకు మరో నాయకుడు కావాలి.

ఈ నాయకుడు టీడీపీ ఏపీ శాఖకు అధ్యక్షుడిగా పనిచేయాలి. ఈ పదవిలో ఉన్న కళా వెంకటరావు మంత్రివర్గంలో చేరారు కాబట్టి దాన్ని భర్తీ చేయాలి. వెంకటరావు మంత్రిగా చేరగానే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కాని ఇప్పటివరకు 'రఫ్‌'గా ఉండే వ్యక్తి ఆయనకు కనబడలేదు. కళా వెంకటరావు సాఫ్ట్‌గా ఉండేవారట...! కొత్త అధ్యక్షుడు అలా ఉంటే ఉపయోగంలేదు. కాని బాబు కోరుకున్న వ్యక్తి ఇంతకాలమైనా దొరకలేదు. ఇప్పుడిక తీవ్రంగా అన్వేషించాల్సిన సమయం వచ్చింది. ఇందుకు రెండు కారణాలున్నాయి. 

మొదటిది మరో ఏడాదిన్నరలో ఎన్నికలు పైనబడతాయి. రెండోది అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడానికి ప్రధాని మోదీ ఇష్టపడటంలేదనే కబురు ఖరారైంది కాబట్టి పార్టీలో గొడవలు రాకుండా చూసుకోవాలి. వచ్చినా జాగ్రత్తగా డీల్‌ చేయగలగాలి. గొడవలు తప్పనిసరిగా వస్తాయి. అసెంబ్లీ సీట్లు పెరగకపోతే ఫిరాయింపుదారులకు టిక్కెట్లు ఇవ్వడం కష్టం.

వారికి ఇస్తే 'అసలు' టీడీపీవారిలో కొందరికి గండి పడుతుంది. టిక్కెట్ల కోసం కొట్లాటలు జరగడం గ్యారంటీ కాబట్టి వాటిని సర్దుబాటు చేయగలిగే నాయకుడు కావాలి. అసెంబ్లీ సీట్లు పెరగవనే కబురు దాదాపు ఖరారైనట్లుగానే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. సీట్లు పెరిగినా, పెరగకపోయినా తమకేమీ ఫరక్‌ పడదని (తేడా ఉండదని) కేసీఆర్‌ ధీమాగా చెప్పారు. మనసులో గుబులు ఉందా? లేదా? చెప్పలేం.

సరే... ఆయన సంగతి అలా పక్కనుంచితే అసెంబ్లీ సీట్లు పెంచకపోవడంవల్ల ఎక్కువ సమస్య ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచే 21మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నారు. అసెంబ్లీ సీట్లు పెరగవనే కబురు వారికి గుబులు పుట్టిస్తోంది. తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. పార్టీ ఫిరాయించినప్పుడు ఈ నాయకులకు చంద్రబాబు ఏం ఆశలు పెట్టారో బయటకు తెలియదుగాని వారు మాత్రం 'మేము బేషరతుగా పార్టీలో చేరుతున్నాం' అని చాటింపు వేశారు.

పదవుల కోసం టీడీపీలోకి వెళ్లడంలేదని, బాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులమై వెళుతున్నామని చెప్పారు. ఇదే నిజమైతే వారెవరూ టిక్కెట్ల కోసం ఆశపడకూడదు. కాని ఎందుకు ఊరుకుంటారు? వైకాపా నుంచి ఎమ్మెల్యేలు వచ్చి చేరినప్పటినుంచి ఒరిజినల్‌ టీడీపీ నాయకుల్లో అసంతృప్తి రగులుతూనే ఉంది. ముఖ్యంగా జిల్లా ఇన్‌చార్జీలు, ఫిరాయింపుదారుల మధ్య మనస్పర్థలు రగులుతూనే ఉన్నాయి. ఒకవేళ ఫిరాయింపుదారులకు టిక్కెట్లు ఇస్తే జిల్లా ఇన్‌చార్జీలు తిరుగుబాటు చేసే అవకాశముంది.

టీడీపీలో సాధారణంగా జిల్లా ఇన్‌చార్జీలే అభ్యర్థులవుతుంటారు. నిజానికి టీడీపీలో ఫిరాయింపుదారులకు, అసలు 'పచ్చ' నేతలకు ఎప్పటినుంచో పోరాటం సాగుతూనే ఉంది. బాబు దగ్గరకు ఈ తగాదాలు ప్రతిరోజూ వస్తూనే ఉంటాయి. ఆయన హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకునేవారులేరు. ఫిరాయింపుదారులకు 'ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే' అని పాడుకునే పరిస్థితి ఏర్పడింది. వీరిలో అనేకమంది నిరాశ నిస్పృహలతో గమ్మున కూర్చున్న పరిస్థితి కనబడుతోంది.

ఫిరాయించిన కొత్తల్లో అధినేతలను ఆకాశానికెత్తిన నాయకులు ఆ తరువాత జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. ముఖ్యమంత్రులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రతివిమర్శలు చేయడంలేదు. మంచి పనులు చేస్తే పొగడటంలేదు.

అంటే ఫిరాయింపుదారుల్లో ఒక విధమైన నిర్లిప్తత ఆవరించిందన్నమాట. తెలంగాణలో, ఆంధ్రాలో అసలు నాయకులకు, ఫిరాయింపుదారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. విభేదాలు ముదురుతున్నాయి. టీఆర్‌ఎస్‌లోని గొడవలు మీడియాలో పెద్దగా ఫోకస్‌ కావడంలేదు. కాని ఆంధ్రాలో విభేదాలు బహిర్గతమై టీడీపీ అధినేత కమ్‌ సీఎం చంద్రబాబుకు తలనొప్పి తెప్పిస్తున్నాయి.

Show comments