ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.!

''మంత్రుల్ని రంగంలోకి దించారు.. ముఖ్యమంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.. అధికారులు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు.. ఇంతకన్నా ప్రభుత్వాలు ఏం చెయ్యాలి.? ప్రజలు ప్రతి విషయానికీ ప్రభుత్వాన్ని విమర్శించడమేంటి.?'' 

- ఇదీ గవర్నర్‌ నరసింహన్‌ తాజా ఉవాచ. 

చాలా విషయాల్లో నరసింహన్‌ కుండబద్దలుగొట్టేస్తుంటారు. మీడియాకి క్లాసులు తీసుకోవడంలో అయినా, కార్పొరేట్‌ విద్యాసంస్థలు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు సామాజిక బాధ్యతను గుర్తు చేయడంలో అయినాసరే నరసింహన్‌ రూటే సెపరేటు. ఆయా విషయాల్లో నరసింహన్‌ వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపజేస్తాయి. ఈయన నిఖార్సయిన గవర్నర్‌.. అనిపిస్తాయి. 

మరి, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నరసింహన్‌ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ప్రజలే నాళాల్ని కబ్జా చేస్తున్నారట. కాబట్టి, ప్రభుత్వాన్ని నిందించి ఉపయోగం లేదట. ఎట్టెట్టా.. నాళాల్ని కబ్జాలు చేస్తున్నది ప్రజలా.? వారి ముసుగులో రాజకీయ నాయకులా.? ఏ బస్తీకి వెళ్ళినా, ఫలానా నాళా ఎలా కబ్జా జరిగింది, ఏ నాయకుడు కబ్జా చేసిందీ కథలు కథలుగా చెబుతారు. 'మీకెందుకు కబ్జా చేసెయ్యండి.. మీకు నేనున్నాను..' అంటాడో ప్రజా ప్రతినిథి. ఆయనగారి అనుచరులే కబ్జా చేసి మరీ, పేదలకి ఉదారంగా అప్పగిస్తారు. ఆ తర్వాత, దాన్ని రెగ్యులరైజ్‌ చేస్తానంటూ, వారి ఓట్లను తన ఖాతాలో వేసుకుంటాడు. ఇదీ జరిగిన కథ. 

కబ్జా చేసి ఇళ్ళు కట్టేసుకున్నాక, వాటికి కరెంటు ఎలా వస్తోంది.? నీటి సరఫరా ఎలా జరుగుతోంది.? ఇదంతా ప్రభుత్వం కాక, ఇంకెవరు చేస్తున్నట్లు.? అధికారులకు తెలియకుండా ఇవన్నీ జరగవు. అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇస్తే, ఓట్ల కోసం ప్రభుత్వాలూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తాయి. అంతిమంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. 

నాళాల సంగతి తర్వాత, నదుల్లో ఇసుక తవ్వకాల మాటేమిటి.? ఇసుక తవ్వకాల కోసం అక్రమార్కులకు అవకాశమిచ్చి, కోట్లు దండుకుంటున్న ప్రభుత్వాల్ని గవర్నర్‌ హోదాలో నరసింహన్‌ ప్రశ్నించరేం.? హైద్రాబాద్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల్ని నరసింహన్‌ వెనకేసుకురావడం శోచనీయం. 

Show comments