సీమ మహిళానేత అక్రమ సంపాదన మూడువేల కోట్ల పైనే..?

ఇటీవల మున్సిపల్‌ శాఖకు చెందిన ఒక ప్రభుత్వోద్యోగిని ఏసీబీ వాళ్లు పట్టుకుంటేనే.. అతడి దగ్గర రమారమీ వెయ్యికోట్ల రూపాయల పైచిలుకు మొత్తం దొరికింది. అతడి ఆస్తుల విలువ వెయ్యికోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని ఏసీబీ అధికారులు తేల్చారు. మరి అలాంటి అనకొండలతో పోల్చిచూస్తే.. రాయలసీమకు చెందిన ఒక మహిళా రాజకీయ నేత సంపద విలువ తక్కువే కావొచ్చు. కానీ.. ఆమె ఆధీనంలోని స్థిరచరాస్తుల లెక్కచూస్తే మాత్రం కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఆమె ఆస్తుల విలువ రమారమీ మూడువేల కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చు అనేది ఒక అంచనా.

ఆమె పైకి చాలా సాదాసీదాగా కనిపిస్తారు. తమ కుటుంబం ప్రజలకోసం ఎంతో చెసేసింది అని చెప్పుకొంటూ ఉంటారు. కమ్యూనిస్టు నేపథ్యం అని గొప్పగా చెప్పుకొంటారు... కానీ గత పాతిక సంవత్సరాల్లో వారి కుటుంబం పోగేసిన ఆస్తి విలువ మూడువేల కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చు అనేది లోకల్‌ జనాల నుంచి ఇప్పుడు వినిపిస్తున్న మాట. వారి కుటుంబానికి చెందినది అని చెప్పుకోవడానికి ఏ సంస్థలూ లేవు, పెద్ద కంపెనీలూ లేవు. ఎక్కడా ఇన్వెస్ట్‌ చేసిన దాఖలాలూ లేవు. మొత్తం రాజకీయం నుంచి, ఫ్యాక్షన్‌ బెదిరింపుల నుంచి సంపాదించిన మొత్తమే ఇదంతా!

మరి ఇప్పుడు ఈ అంశంపై ఎందుకు చర్చ మొదలైందంటే.. దీనివెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. రాయలసీమలోని ఒక జిల్లాలో ఇప్పుడు హంద్రీనీవా ప్రాజెక్టు పనుల్లో అంచనాల పెంపు అంకం నడుస్తోంది. వైఎస్‌ హయాంలో ఈ ప్రాజెకట్‌ 90శాతం వరకూ పని పూర్తికాగా, మిగిలిన పదిశాతం పనులు జరగడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా సమయం సరిపోవడం లేదు.

అయితే ఇప్పుడు కొంతవరకూ పూర్తి అయిన కాలువలకు నీళ్లు ఇవ్వడంలేదు కానీ.. కొత్త ఏరియాల్లోకి నీళ్లు, కొత్త చెరువులకు నీళ్లు.. అంటూ ప్రాజెక్టును కొత్త రూట్లు పట్టించారు. దాంతో ఎంతో ప్రయోజనం ఉంటుందనుకుంటే.. ఇప్పుడు మొత్తం కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు అంటూ మరో రచ్చ మొదలైంది. దీనికోసం అని ఏకంగా పన్నెండొందల కోట్ల వరకూ టెండర్లు పెడుతున్నారు.

సరిగా చేస్తే వందకోట్ల రూపాయలు కూడా ఖర్చు కాని పనులకు ఇన్ని రెట్ల మొత్తం అంచనాలు పెంచి... అరకొర పనులు చేస్తున్నారని, కాంట్రాక్టరు సదరు మహిళా రాజకీయ నేతకు బాగా కావాల్సిన వ్యక్తి అని.. అందుకే ఇలా అంచనాలు పెంచేసి దోపిడీ చేస్తున్నారని లోకల్‌ జనాలు చర్చించుకుంటున్నారు. మరి ఆ కాంట్రాక్టర్‌కూ సదరు నేత కుటుంబానికి సంబంధం ఏమిటంటే.. ఆ మధ్య నోట్లమార్పిడి రద్దు సమయంలో.. ఈ నేతాశ్రీ నోట్లన్నింటినీ మార్పించి ఇచ్చింది సదరు కాంట్రాక్టరేనట. 

పాతనోట్లు తీసుకుని.. కొత్తనోట్లు తెచ్చిచ్చాడట ఆ కాంట్రాక్టరు. అలా మార్పిడిచేసిన మొత్తం సుమారు వెయ్యికోట్ల రూపాయలు అని ఈ నేత వర్గీయులే వ్యాఖ్యానిస్తున్నారు. మా మహిళా నేత దగ్గర అంత డబ్బుంది తెలుసా.. అని చెప్పుకోవడంలో వారికి ఆనందం ఉంది. అందుకే.. మా నేత వెయ్యికోట్ల రూపాయల మొత్తాన్ని కొత్త నోట్లుగా మార్చుకున్నారు.. అని గొప్పగా చెబుతున్నారు.

మరి మార్చుకున్న నోట్ల విలువే వెయ్యికోట్ల రూపాయలు అంటే.. సదరు నేత స్థిరచరాస్తుల విలువ ఏ స్థాయిలో ఉండాలి.. అనేది ఇప్పుడు సీమ సందుల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో థియేటర్లు, లోకల్‌గా స్టోన్‌క్రషర్స్‌ దగ్గర నుంచి, ఇన్‌ఫ్రా దందా.. ఇక అమరావతిలో భూములు, బిల్డింగులపై పెట్టిన పెట్టుబడులు.. వీటన్నింటి కలిపి చూసుకుంటే.. సదరు నేత ఆస్తుల విలువ చాలా సులభంగా మూడువేల కోట్ల రూపాయల ఫిగర్‌ను రీచ్‌ అవుతుందని అనుచరులు, లోకల్‌ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

మరి పాతికేళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవాళ్లు మూడువేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం పెద్ద ఆశ్చర్యం కాదంటారా? అంతవరకూ ఓకే కానీ, వీళ్లు పక్కా బెదిరింపులు, వసూళ్లు, ఫ్యాక్షన్‌ దందాతోనే ఇంత పోగేసేశారు.. ఈ మూడువేల కోట్ల రూపాయల్లో కొంతైనా వ్యాపారాలతో సంపాదించారని అనడానికి ఎలాంటి దాఖలాలూ కనిపించకపోవడం మాత్రం కచ్చితంగా విశేషమే. కరువు ఏరియాలోనే ఈ స్థాయిలో పీల్చారంటే.. కాస్త కాసులతో కళకళలాడే ఏరియాలో అయ్యుంటే వీళ్లు పీల్చే పీల్చడానికి ఇంకెంత పోగేసే వాళ్లో!

Show comments