సినిమా అంటే సినిమానే: రకుల్‌

''సినిమా అంటే సినిమానే.. అది కమర్షియల్‌ సినిమా కావొచ్చు.. ఆర్ట్‌ సినిమా కావొచ్చు.. ఏదైనాసరే సినిమానే. ఏ సినిమాకైనా కష్టం ఒకేలా వుంటుంది. కమర్షియల్‌ ఫార్మాట్‌ని కొందరు ఎంచుకుంటారు.. ఆర్ట్‌ ఫార్మాట్‌ని ఇంకొందరు ఎంచుకుంటారు. సినిమా తీసే విషయంలో ఎవరైనాసరే ఒకేలా కష్టపడ్తారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాళీ, హిందీ.. ఇలా ఏ భాషలో అయినా సినిమా కోసం పడే శ్రమ ఒకేలా వుంటుంది..'' అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేసింది హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 

అస్సలేమాత్రం కాంట్రవర్సీకి తావులేకుండా మాట్లాడటంలో రకుల్‌ దిట్ట. 'మలయాళంలో డిఫరెంట్‌ ఫిలింస్‌ వస్తుంటాయి.. తమిళంలోనూ ప్రయోగాత్మక చిత్రాలొస్తుంటాయి.. తెలుగులో తక్కువ కదా.?' అనడిగితే, పై విధంగా స్పందించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తన వరకూ తాను తన వద్దకు వచ్చిన అవకాశాల్ని జాగ్రత్తగా ఎంచుకుంటాననీ, ఒప్పుకున్న ప్రాజెక్ట్‌కి న్యాయం చేయడం గురించే ఆలోచిస్తానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. 

కమర్షియల్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అంత తేలిక కాదనీ, అదృష్టవశాత్తూ తనకు ఆ ఇమేజ్‌ తొందరగానే దక్కిందనీ, అదే సమయంలో నటిగా అవార్డ్‌ విన్నింగ్‌ పెర్ఫామెన్స్‌ ప్రదర్శించాని తానూ కోరుకుంటున్నానని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చింది. కమర్షియల్‌ సినిమాలతో ఆడియన్స్‌కి బాగా రీచ్‌ అయితే, ఆ తర్వాత ఆర్ట్‌ సినిమాల్లో నటించినా.. వాటికి రీచ్‌ పెరుగుతుందని రకుల్‌ అభిప్రాయపడింది. 

భాష పరంగా సినిమాని విడదీయలేమంటున్న రకుల్‌, ఏ భాషలో సినిమా చేయాలన్నా ఒకటే కష్టమనీ, అంతిమంగా ఇది ఇండియన్‌ సినిమా అని రకుల్‌ స్పష్టం చేసింది.

Show comments