నేడే ప్రమాణం: తమిళనాడు సీఎంగా పళనిస్వామి?!

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడపాటి కే పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయడం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు రాజ్ భవన్ వర్గాలు ఇస్తున్న అనధికార సమాచారం ప్రకారం చూస్తే.. ఈ రోజు సాయంత్రమే గవర్నర్ విద్యాసాగర్ రావు పళనిస్వామి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నాడని తెలుస్తోంది. నిన్న సాయంత్రం పళనిస్వామి తన కూడా ఉన్న పదిమంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే.

తనకు మొత్తం 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని స్వామి గవర్నర్ విద్యాసాగర్ రావును కోరాడు. ఈ నేపథ్యంలో ఇక తప్పక అయినా.. పళని చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించక తప్పడంలేదు గవర్నర్ కు. ఈ రోజే ప్రమాణ స్వీకారోత్సవం ఉండవచ్చని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత బలపరీక్ష ఉండవచ్చని సమాచారం.

మరి ఇప్పుడు పళని గనుక ముఖ్యమంత్రి పదవిని చేపడితే అది ఒక విధంగా సంచలనమే అవుతుంది. ప్రత్యేకించి శశికళ పెద్ద విజయం సాధించినట్టే! తను కింద పడినా ఆమె పై చేయి సాధించినట్టే. చివరిక్షణంలో వ్యూహాన్ని మార్చి  తను రాజకీయం చేసినట్టే! ఒకవేళ పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికైతే.. శశికళ జైలు నుంచే చక్రం తిప్పే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి వెళ్లిందామె! అలాగే ఇది పన్నీరు సెల్వానికి కూడా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.

ఒకవైపు కంపోజిట్ ఫ్లోర్ టెస్టు అనే మాట వినిపిస్తున్నా.. ఉన్నట్టుండి పళనిస్వామి ప్రమాణ స్వీకారం తెరపైకి వచ్చింది. అది కూడా గురువారం సాయంత్రం జరుగుతుందనే మాట వినిపిస్తోంది. తమిళనాట ఈ విధంగా పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. ఏ క్షణాన ఇది ఎటు మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం అవుతోంది.  

Show comments