బీజేపీ తుది శ్వాస విడిచిందా.?

'ఆఖరి శ్వాస పీల్చేదాకా ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూనే వుంటాం..' 

- ఇది బీజేపీ చెప్పిన మాట. 

ఇప్పటి మాట కాదిది. అలాగని మరీ, దశాబ్దా కాలం క్రితం చెప్పిన మాట కూడా కాదు. గట్టిగా లెక్కేస్తే ఓ మూడేళ్ళ క్రితం నాటి మాట. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలున్నాయి. అప్పట్లో అధికారంలో వున్నది కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ అధికారంలో వుంది. అందుకే, మాటలు మారాయి. ఎఫ్‌డీఐలకు మరింత గొప్పగా రెడ్‌ కార్పెట్‌ వేసేసింది ఎన్డీయే సర్కార్‌. 

అప్పటి బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైటీ, 'ఆఖరి శ్వాస విడిచేదాకా ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పోరాడుతూనే వుంటాం..' అని సెలవిచ్చారు. ఆ సమయంలో వామపక్షాలతో కలిసి ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీజేపీ. యూఏఈ సర్కార్‌ ఎఫ్‌డీఐలకు గేట్లు బార్లా తెరిస్తే, ఇఫ్పుడు ఎన్డీయే సర్కార్‌.. మొత్తంగా నట్టింట్లో కూర్చోబెట్టేసింది. ఇక ఇప్పుడు మాట్లాడుకోడానికి వీల్లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకేనంటూ మోడీ సర్కార్‌, ఎఫ్‌డీఐలకు కొత్త అర్థం చెబుతోంది. 

అమెరికా సహా వివిధ దేశాలతో సన్నిహిత సంబంధాల వెనుక అసలు అర్థం ఇదేనని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, దేశాన్ని విదేశాలకు మోడీ సర్కార్‌ తాకట్టు పెట్టేస్తోందన్నమాట. బీజేపీ తుది శ్వాస వరకు ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పోరాడుతుందని గతంలో అరుణ్‌ జైట్లీ చెప్పిన మాటే నిజమైతే, రక్షణ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతివ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఆనాటి బీజేపీ, నేడు తుది శ్వాస విడిచిందనే కదా అర్థం.! 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.. అనబడే ఎఫ్‌డీఐల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ముందుకు వెళుతుంది.? అన్న విషయం పక్కన పెడితే, ఇప్పటికే ఈ ఎఫ్‌డీఐల కారణంగా, దేశంలో సంప్రదాయ వ్యాపారాలు కనుమరుగైపోయాయి. భవిష్యత్‌ ఇక అగమ్య గోచరం. అతి ముఖ్యమైన రక్షణ రంగంలోకీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని పూర్తిగా అనుమతించడమంటే, దేశ భద్రతనే అమ్మకానికి పెట్టినట్లు దానర్థం. ఎనీ డౌట్స్‌.?

Show comments