'చేపలు' జారిపోతున్నాయ్‌ బాబూ జర జాగ్రత్త

నానా తంటాలూ పడి, కోట్లు గుమ్మరించి, బెదిరించి, బతిమాలి.. ఇలా రకరకాలుగా పిల్లిమొగ్గలేస్తే, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలోకి జంప్‌ అయ్యేలా చేయగలిగారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. అది అధికారం అనే 'వాపు' తప్ప, 'బలం' ఏ మాత్రం కాదన్నది జగమెరిగిన సత్యం. 

రోజులు గడిచిపోతున్నాయ్‌.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇటీవలే మూడేళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇక, ఇప్పుడు మొదలవుతోంది అసలైన మొసళ్ళ పండగ. అవును, పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ మారడానికి ఇదే అసలు సిసలు సమయం. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి, పూర్తిగా రెండేళ్ళపాటు కూడా అవకాశం లేని పరిస్థితి.

ఈలోగా, రాజకీయ సమీకరణాలు ఎలాగైనా మారిపోవచ్చు. 2019 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కలిసి పోటీ చేయడం అసాధ్యమని తేలిపోయింది. పవన్‌కళ్యాణ్‌ కూడా వదిలేస్తే, టీడీపీ సంగతి అంతే.! 

అందుకేనేమో, టీడీపీ గంపలోని చేపలు జారిపోతున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత శిల్పా మోహన్‌రెడ్డి, ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేస్తున్నారు. వైఎస్సార్సీపీలోకి జంప్‌ చేసేయడం ఖాయమని ప్రకటించేశారు.

బల ప్రదర్శనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారాయన. వైఎస్సార్సీపీలో చేరే ఆ శుభ సమయాన్ని అధికారపక్షం దిమ్మ తిరిగేలా మార్చేయాలని శిల్పా మోహన్‌రెడ్డి తహతహలాడుతున్నారు. 

నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు తనకు టిక్కెట్‌ ఇవ్వకపోవడంతోనే శిల్పా మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీలోకి జంప్‌ చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. రాజకీయాల్లో ఇది చాలా చిన్న విషయం.

అదిగదిగో నియోజకవర్గాలు పెరగబోతున్నాయ్‌.. అంటూ ఇన్నాళ్ళూ కహానీలు చెప్పి, ఊరించిన చంద్రబాబు.. ఇప్పుడిక చెయ్యడానికేమీ లేదు. అక్కడ నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్‌ కన్పించడంలేదు. దాంతో, టీడీపీ నుంచి రానున్న రోజుల్లో పెద్దయెత్తున వలసలు తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

ఇప్పటికే మంత్రి పదవులు రాక చాలామంది టీడీపీ నేతలు అసహనంతో వున్నారు. పదవులు ఊడినవారి పరిస్థితి ఇంకా దారుణం. పైగా, ఇది జూన్‌ నెల. మధ్యలో జులై.. ఆ తర్వాత టీడీపీకి అగ్ని పరీక్ష లాంటి ఆగస్ట్‌ రాబోతోంది. రాబోతోంది కాదు, భయపెడ్తోంది.

అధికారం వున్నాసరే, నేతల్ని కాపాడుకోలేని దుస్థితి అంటే అంతకన్నా దారుణం ఇంకోటి వుండదు. 'పోతే పోయాడులే..' అని సరిపెట్టుకోవడానికి వీల్లేని పరిస్థితి. గండిపడటానికి ముందు చిన్న లీకేజీనే కన్పిస్తుంది.. ఆ తర్వాతే ప్రవాహం జోరు పెరుగుతుంది. టీడీపీకి కూడా ఆ తరహాలో గండి పడేందుకు ముహూర్తం దగ్గరపడిందనే అనుకోవాలేమో.

Show comments