మాయావతి.. రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోందా?

చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు మాయావతి. రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్న దశలో ఆమె రాజీనామా చేశారు. మరికొన్ని నెలల్లో మాయ రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియనుంది. యూపీలో బీఎస్పీ అధికారం కోల్పోయిన వెంటనే మాయ రాజ్యసభకు వెళ్లిపోయారు. కుర్ర అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే.. తను ప్రతిపక్షంలో కూర్చోవడం ఏమిటన్నట్టుగా మాయ రాజ్యసభకు వెళ్లారు. ఆరు సంవత్సరాలు గడిచిపోతున్న తరుణంలో ఆమె రాజీనామా అస్త్రాన్ని సంధించారు. మామూలుగానా.. రాజ్యసభలో దళితులపై దాడుల అంశంపై మాట్లాడనివ్వలేదని ఆవేదన చెందుతూ ఆమె రాజీనామా పత్రాన్ని విసిరికొట్టారు. అంతేవేగంగా ఆమె రాజీనామాను ఆమోదించారు చైర్మన్. 

ఈ నేపథ్యంలో మాయ తదుపరి ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. మాయను తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపుతానని లాలూప్రసాద్ యాదవ్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. సొంతపార్టీ తరపున మళ్లీ రాజ్యసభకు వెళ్లే అవకాశం మాయకు లేదు. ఈ నేపథ్యంలో ఆమెను విపక్షాలే ఆదుకోవాల్సి ఉంది. లాలూకు ఎలాగూ బిహార్ లో ఇప్పుడు బలంఉంది.. అందుకే ఆయన ఆదుకుంటానని అంటున్నాడు. అయితే యాదవ్ పై ఈ దళిత రత్నం ఆధారపడేలా లేదు.. ఆమె ప్రత్యక్ష ఎన్నికలే మొగ్గు చూపుతోందని సమాచారం. మరి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు ఎక్కడివి అంటే.. యూపీలో త్వరలోనే జరగనున్నాయి. ఇటీవలే యూపీలో ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులయ్యారు. ముఖ్యమంత్రి యోగి, అలాగే ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య లాంటివాళ్లు.. ఎంపీ హోదాలతో రాష్ట్ర స్థాయిపదవులను చేపట్టారు.

 దీంతో వారు రాజీనామా చేయకతప్పదు. కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి మాయ పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఫూల్పూర్ నుంచి దివంగత ప్రధాని నెహ్రూ ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు ఆయన గెలిచారు. విజయలక్ష్మీ పండిట్ మరో రెండుసార్లు విజయం సాధించారు. అయితే దశాబ్దాల కిందటే ఈ నియోజకవర్గం కాంగ్రెస్ నుంచి చేజారింది. వరసగా మూడు టర్మ్ లు ఇక్కడ ఎస్పీ జెండా పాతింది. ఆ తర్వాత 2009లో బీఎస్పీ అభ్యర్థి విజయం సాధించాడు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి కేశవ్ ప్రసాద్ మౌర్య రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించాడు. 

ఎస్పీ రెండో స్థానంలో, బీఎస్పీ మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ నుంచి మహ్మద్ కైఫ్ పోటీ చేసి.. అరవై వేల ఓట్లను కూడా తెచ్చుకోలేక నాలుగో స్థానంలో నిలిచాడు. మరి ఎలాగూ అక్కడ ఉప ఎన్నికలు తప్పవు.. బీఎస్పీకి ఇక్కడ 2009లో లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి. ఎస్పీ రెండు లక్షల ఓట్ల వరకూ పొందింది, బీజేపీ ఐదు లక్షలకు పైగా ఓట్లను సొంతం చేసుకుంది. మరి ఇక్కడ నుంచి మాయ పోటీ చేస్తుందని అంటున్నారు. ఒకవేళ ఆమె బరిలోకి దిగితే.. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించవచ్చు. మరి అదే జరిగితే... మహా సంఘటనం పని మొదలైనట్టే. దేశం మొత్తాన్ని ఆకర్షిస్తుంది ఈ ఉప ఎన్నిక.. మరి మాయ బరిలోకి దిగుతారా?

Show comments