'బాహుబలి'ని టచ్‌ చేయడమెలా.?

ఇండియా అంతటా సినీ అభిమానుల్లో ఒకటే చర్చ.. అదే 'బాహుబలి' సినిమా గురించి. ఈ సినిమా వసూళ్ళే ఇప్పుడు టాప్‌ 'ట్రెండింగ్‌'లో వున్నాయి. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా ఏ సినీ పరిశ్రమలో అయినా, కేవలం 'బాహుబలి' గురించిన చర్చే జరుగుతోందంటే, దానిక్కారణం 'బాహుబలి' సినిమా సాధించిన విజయమే. ఏ సినీ పరిశ్రమకు చెందినవారైనాసరే, 'బాహుబలి'ని విమర్శించేందుకు సాహసించడంలేదు. ఆ స్థాయిలో 'బాహుబలి' అందర్నీ మెప్పించేసింది. 

ఇక, బాలీవుడ్‌లో రానున్న రోజుల్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలు చాలానే రానున్నాయి. వాటిల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'పద్మావతి' సినిమా కూడా వుంది. అదొక్కటే కాదు, సల్మాన్‌ఖాన్‌ 'ట్యూబ్‌లైట్‌' కూడా లిస్ట్‌లో వున్నదే. ఇండియన్‌ సినిమాకి సంబంధించి వసూళ్ళ రికార్డులు నిన్న మొన్నటిదాకా హిందీ సినిమా పేరుతోనే వుండేవి. ఇప్పుడు వాటిని 'బాహుబలి' తిరగరాసేసింది. ఎంతలా తిరగరాసేసిందంటే, ఇప్పట్లో మరే చిత్రమూ 'బాహుబలి'ని దాటడం కాదు కదా, దరిదాపుల్లోకి కూడా చేరే అవకాశం లేదని బాలీవుడ్‌ సినీ జనమే చెప్పేంతలా. 

బాలీవుడ్‌ పరిస్థితిలా వుంటే, టాలీవుడ్‌ నుంచీ రానున్న రోజుల్లో భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అన్నీ వంద కోట్ల పైచిలుకు వసూళ్ళ టార్గెట్‌తో తెరకెక్కుతున్నవే. 'స్పైడర్‌', 'డిజె' త్వరలో విడుదల కానుండగా, పవన్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమా, చరణ్‌ - సుకుమార్‌ కాంబో, వీటన్నిటితోపాటు సెట్స్‌ మీదకు వెళ్ళనున్న చిరంజీవి 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'.. ఇవన్నీ ప్రతిష్టాత్మక సినిమాలే అయినా, 'బాహుబలి'తో వీటిని పోల్చలేని పరిస్థితి. కోలీవుడ్‌ విషయానికొస్తే, 'రోబో 2.0' మీద భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేదనుకోండి.. అది వేరే విషయం. 

ఏమో, కొన్ని సినిమాలు సాధించే విజయాల్ని ముందే ఊహించలేం. కాబట్టి, 'బాహుబలి' రికార్డులు చెరిగిపోవు.. అని ఖచ్చితంగా చెప్పేయడానికి వీల్లేదు. ఒక్కటి మాత్రం నిజం. 'బాహుబలి' లాంటి సినిమాలు రావాలి.. 'బాహుబలి'ని మించిపోయే సినిమాలు రావాలి.. తెలుగు సినిమా ఖ్యాతి పెరగాలి.. ఇండియన్‌ సినిమా సత్తా చాటాలి. హాలీవుడ్‌కి మనమేం తక్కువ కాదని నిరూపించాలి. సగటు సినీ ప్రేక్షకుడు ఇదే కోరుకుంటున్నాడిప్పుడు. 

Show comments