ఇంత నిస్సిగ్గు రాజకీయమా.?

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.. అన్న చందాన వ్యవహరిస్తుంటారు రాజకీయ నాయకులు. ప్రజలు ఏమన్నా అనుకోనీయండి.. రాజకీయ నాయకులు అవసరం తీరాక 'నిబంధనల్ని' వల్లె వేస్తుంటారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ నిబంధనలేవీ వారికి గుర్తుకురావు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినప్పుడు ప్రధాని నరేంద్రమోడీకి ఏ ఆర్థిక సంఘమూ గుర్తుకురాలేదు. 'మేం బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా తీసుకొస్తాం' అని చెప్పినప్పుడు, 'ప్రత్యేక హోదా సంజీవని' కాదన్న విషయం చంద్రబాబుకి తెలియరాలేదు. 

మధ్యలో ప్రజలే అమాయకులు.. వెర్రి వెంగళప్పలు.. ఏమీ తెలియనివారన్నది బహుశా రాజకీయ నాయకుల ఉద్దేశ్యం కావొచ్చు. కానీ, ఆ ప్రజా సమూహంలో తామూ ఒకరం.. అన్న విషయాన్ని పాలకులైనా, రాజకీయ నాయకులైనా మర్చిపోతే ఎలా.? 

మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత పురంధరీశ్వరి ప్రత్యేక హోదా విషయమై మాట్లాడేందుకు తాజాగా మీడియా ముందుకొచ్చారు. ఈ మధ్యకాలంలో పురంధరీశ్వరి మీడియా ముందు చేస్తున్న 'అతి' అంతా ఇంతా కాదు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడానికి గల పరిస్థితుల్ని మీడియా, ప్రజలకు తెలియజేయాలట. ఇంతకన్నా నిస్సిగ్గు రాజకీయం ఇంకేముంటుంది.? ఆమె కేంద్ర మంత్రిగా వున్నప్పుడే, రాజ్యసభ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు. 

ఓ చట్ట సభలో, ఓ ప్రధాని ఇచ్చిన హామీకే విలువ లేకపోతే, అది రాజ్యాంగబద్ధమా.? కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరీశ్వరికి ఆ మాత్రం ఇంగితం లేకపోవడమేంటో. 'మా భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చుతారెందుకు.?' అని మీడియా ప్రశ్నిస్తే, కాస్తంత కంగారు పడ్డారు పురంధరీశ్వరి. ప్రత్యేక హోదా వస్తుందా.? రాదా.? అన్నది వేరే విషయం. ఆ తర్వాత ప్రజలు ఏం చేయాలన్నది వేరే అంశం. కానీ, ప్రజలు రాజకీయ నాయకుల నిస్సిగ్గు రాజకీయాల్ని గమనిస్తున్నారన్నది మర్చిపోకూడదు. 

'మాకు నచ్చినట్లు మేం చేస్తాం..' అని పాలకులు అనుకుంటే, ప్రజలకు ఏం చేయాలో బాగా తెలుసు. 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే, కాంగ్రెస్‌ ఇంట్లో కూర్చుంది. ప్రజలు తమ పార్టీతోపాటు తమనూ తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి, నిస్సిగ్గుగా పార్టీలు మారిపోయి పళ్ళికిలించడం.. సోకాల్డ్‌ 'మేధావులకే' తెలుసు. 14వ ఆర్థిక సంఘం కావొచ్చు.. నీతి అయోగ్‌ కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. ఇవన్నీ ప్రభుత్వంలో వున్నవారి కనుసన్నల్లో నడిచేవే. 

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారంతే.

Show comments