డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్‌కి అనూహ్యంగా తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు వ్యక్తుల నుంచి 'సపోర్ట్' లభిస్తోంది. పూరి దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాలో హీరోగా నటించిన మెగా హీరో వరుణ్ తేజ్, పూరిజగన్నాథ్‌కి డ్రగ్స్ కేసుతో లింక్ వుందంటే తాను నమ్మబోననీ, నటీనటుల ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకునే పూరిజగన్నాథ్, డ్రగ్స్ తీసుకునే అవకాశమే లేదని చెప్పాడు.
మరోపక్క, పూరిజగన్నాథ్‌కి అత్యంత సన్నిహితుడైన నటుడు ప్రకాష్‌రాజ్ సైతం, పూరికి బాసటగా నిలిచాడు. 'ఓ విషయంపై విచారణ జరుగుతున్న సమయంలో, ఎలాంటి ఆధారాలూ లేకుండా ఓ వ్యక్తిపై మీడియా దుష్ప్రచారం చేయడం తగదు..' అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు ప్రకాష్‌రాజ్.
ఇంకోపక్క, కోట్లాది రూపాయల రెమ్యునరేషన్‌ని తీసుకునే స్టార్ డైరెక్టర్ అయిన పూరిజగన్నాథ్, డ్రగ్స్ వ్యాపారంలోకి తొంగి చూడటం, లేదా డ్రగ్స్ తీసుకోవడం నమ్మశక్యంగా అన్పించడంలేదని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్తున్నారు. ఓ మాజీ పోలీస్ ఉన్నతాధికారి సైతం, ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ సినిమా తీస్తే ఐదారు కోట్లు రెమ్యునరేషన్ అందుకునే పూరి, డబ్బు కోసం కథలు అమ్ముకోవచ్చేమోగానీ, డ్రగ్స్ అమ్మే పరిస్థితి వుండకపోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
నిన్న పూరిజగన్నాథ్‌ని 11 గంటలపాటు ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 'సిట్' విచారించడం, ఆ తర్వాత ఆయన అర్థరాత్రి సమయంలో సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేయడం తెల్సిన విషయాలే. ఆ వీడియోలో, డ్రగ్స్‌తో తనకు సంబంధం లేదని పూరి చెప్పుకొచ్చాడు. నిన్న మొన్నటిదాకా 'సినీ పరిశ్రమలో కొందరికి డ్రగ్స్‌తో సంబంధం వుండి వుండొచ్చు..' అని కొందరు సినీ ప్రముఖులు వ్యాఖ్యానించినా, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
కొసమెరుపు: సోషల్ మీడియాలో పూరిజగన్నాథ్ అభిమానులు, ‘వి సపోర్ట్ పూరి జగన్నాథ్’ అంటూ ఆయనకు మద్దతుగా పోస్టింగ్స్ తో హోరెత్తిస్తున్నారు.