ప్రతియేటా పతాక శీర్షికల్లో ఎక్కే అంశమే.. మరోసారి. రాయలసీమ నుంచి వలసలు. పంటల్లేవ్, తీవ్రమైన కరువు, పశువులకు మేత కూడా కష్టం అయిపోయింది. పంట మీద ఆశ వదిలేసి పాడి మీద బతుకుతున్న ప్రజానీకం కూడా ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వలస పోతోంది. రాయలసీమ జిల్లాల నుంచి ప్రతియేటా కొన్ని కుటుంబాలు ఇలాంటి వలసలు పొతూనే ఉన్నాయి. ఈ సారి కూడా అదే తంతు. కాడీకవ్వం మీద ఆధారపడిన ఆ కుటుంబాల వలస వ్యథలు మనసులను కలచివేస్తున్నాయి.
పదెకరాల భూమి కలిగిన రైతుల కుటుంబాలు కూడా ఏ బెంగళూరుకో, మరో మహారాష్ట్రాకో, హైదరాబాద్ కో వచ్చి ఫ్యాక్టరీల మీద, చిన్నాచితక పనుల మీద, సెక్యూరిటీ గార్డుల పనుల మీద ఆధారపడుతున్న పరిస్థితి. గత ఏడాది ఆగస్టుతోనే వరుణుడు ఎండగట్టడంతో ఇప్పుడు మరో దారి లేక వలస బాట పడుతున్నారు చితికిపోయిన రైతులు.
మరి మాటెత్తితే.. రెయిన్ గన్నులు.. పంటలు పండించేశా! ప్రపంచానికి పరిచయం చేశా.. అంటూ ఇటీవల దావోస్ లో కూడా ఇదే సుత్తి వేసిన చంద్రన్న ఇప్పుడేమంటారు? సీమకు నీళ్లను ఇచ్చేశాం.. రాయలసీమను కోనసీమను చేసేశాం.. అంటూ ఎత్తిపోతల పథకాల పేర్లు చెబుతున్న చంద్రబాబు కంటికి ఈ వలసలు కనిపిస్తున్నాయో లేదో అర్థం కావడం లేదు. ఆఖరికి తమ అనుకూల మీడియా కూడా ఇక్కడి వలసల గురించి ప్రత్యేక కథనాలు రాస్తోంది!
మరి నీళ్లు ఇచ్చేశాం.. సీమను సస్యశ్యామలం చేసేశాం.. అని డబ్బా కొట్టే మంత్రులు, ముఖ్యమంత్రి తమ పత్రికల్లో అచ్చయిన కథనాలను పరిగణనలోకి తీసుకుంటారా? నీళ్లు ఇచ్చింది అబద్ధం, అదంతా కేవలం ఆర్భాటం.. ప్రచారం కోసం చేసిందే తప్ప.. వాస్తవంలో జరిగింది శూన్యం.. అనే విషయాలు తటస్థులు అయినా అర్థం చేసుకోవాలి.
మరి రాయలసీమలకు నీళ్లు అందించి.. పులివెందుల్లో చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు అందించి.. జగన్ ను ఓడించడం తర్వాతి సంగతి. వలస పోతున్న జనాలను చూసి అయినా కాస్తంత కనికరం చూపించాలి ప్రభుత్వం. అయితే ఇలాంటి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కేవలం వృథా. ఇదంతా దున్నపోతు మీద వాన పడ్డ చందం. ప్రచారం వచ్చే పనులేమైనా ఉంటే వాటి ని వాడుకుంటారు కానీ.. వాస్తవాలతో వీళ్లకు పనేంటి?