''ఇప్పటికీ తమిళనాడుకి నేనే చీఫ్ సెక్రెటరీ.. ఇన్‌ఛార్జ్ చీఫ్ సెక్రెటరీగా ఎవర్నయినా నియమించారేమో, అది నాకు సంబంధం లేని విషయం. 32 ఏళ్ళు దేశానికి సేవ చేసిన నాలాంటి అధికారికి దేశం ఇచ్చే గౌరవం ఇదేనా.? సిగ్గు సిగ్గు, అమ్మ జయలలిత బతికి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. తమిళ ప్రజలకు రక్షణ లేదు. నా కొడుకు పేరుతో సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి, నా ఇంట్లో సోదాలు నిర్వహిస్తారా.? కేంద్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. ఇది వేధింపు చర్యల్లో భాగం..''
- ఇదీ ఆసుపత్రిలో గుండె నొప్పితో నాలుగు రోజుల క్రితం చేరిన తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు, నేడు కోలుకుని, మీడియా ముందుకొచ్చి చెప్పిన మాటల సారాంశం.
కోట్లు, వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు రామ్మోహన్‌రావు కూడబెట్టారన్నది ఆయనపై అభియోగం. అయితే, తన ఇంట్లో జరిపిన సోదాల్లో ఐటీ శాఖ కేవలం ఒక లక్షా 12 వేల 320 రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని, ఇది రికార్డెడ్ అని రామ్మోహన్‌రావు వెల్లడించారు. ఇంట్లో దేవుడి ప్రతిమలు, తన భార్య, కుమార్తెకి సంబంధించిన నగలు మాత్రమే వున్నాయని, వాటిని లెక్కల్లో ఐటీ శాఖ స్పష్టంగా పేర్కొందని చెప్పారాయన.
తమిళనాడులో ప్రముఖ కాంట్రాక్టర్ అయిన శేఖర్‌రెడ్డి (టీటీడీ బోర్డ్ సభ్యుడిగా పనిచేసి, తొలగింపబడ్డాడు)పై జరిగిన ఐటీ దాడుల్లో లభించిన ఆధారాల నేపథ్యంలో రామ్మోహన్‌రావుపై ఐటీ దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఆ శేఖర్‌రెడ్డితో తనకెలాంటి సంబంధం లేదని రామ్మోహన్‌రావు స్పష్టం చేశారు.
'నా కొడుకు పేరుతో సెర్చ్ వారెంట్ తీసుకొచ్చారు.. అసలు తొమ్మిదేళ్ళుగా నా కొడుకు నాకు దూరంగా వేరే ఇంట్లో వుంటున్నాడు. ఇప్పుడో ఒక రోజో, రెండ్రోజులో వచ్చి వెళతాడంతే. నా కొడుకు ఏమీ సీఎస్ కాదు కదా.. నేరగాడు అసలే కాదు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి, తిరిగొచ్చాడు..' అంటూ రామ్మోహన్‌రావు వివరించారు. ఏడు నెలలుగా పురట్చితలైవి, అమ్మ జయలలిత చెప్పిందే తాను చేస్తున్నాననీ, ఆమె ఇప్పుడు లేకపోవడంతోనే ఇదంతా జరుగుతోందనీ, తనను టార్గెట్ చేశారనీ, తనకు ప్రాణహానీ వుందని ఆయన ఆరోపించడం గమనార్హం.
రామ్మోహన్‌రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను తొలగించి, కొత్త సీఎస్‌ని ఎంపిక చేసిన విషయం విదితమే. ఇప్పుడేమో, ఇంకా తాను సీఎస్‌నేనని చెబుతున్నారు రామ్మోహన్‌రావు. ఈ విషయమై న్యాయపోరాటం కూడా చేస్తానంటున్నారు. పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారానికి సంబంధించి జరిగిన, జరుగుతున్న ఐటీ సోదాల్లో ఇదో సూపర్ ట్విస్ట్‌గానే చెప్పుకోవాలి.