చంద్రబాబూ.. ఏంటీ కాంగ్రెస్ లొల్లి.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. అదీ తెలంగాణ టీడీపీ కారణంగా. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ని ఎదుర్కొనాలంటే, టీడీపీకి ఇంకో పార్టీ మద్దతు తప్పనిసరి. మిత్రపక్షం బీజేపీ మాత్రం, టీడీపీని వదిలించుకోవడంవైపే మొగ్గు చూపుతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీకి మరో ఆప్షన్‌ లేకుండా పోయింది. 'అవసరమైతే కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం..' అంటూ తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ప్రకటించేశారు. 

ఇంకేముంది, చంద్రబాబు కంగారుపడి, 'అబ్బే, పొత్తుల చర్చలు ఇప్పుడు కాదు, ఎన్నికల వేళ..' అంటూ కవరింగ్‌ ఇచ్చారనుకోండి.. అది వేరే విషయం. అయితే, తెలంగాణ టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సానుకూలంగా స్పందించారండోయ్‌. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, 'టీడీపీ మాకు అంటరాని పార్టీ కాదు..' అని ప్రకటించేశారాయన. తెలంగాణ టీడీపీ గనుక స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగితే ఆ పార్టీతో కలిసి పనిచేస్తామని జైపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి, తెలంగాణలో టీడీపీ - కాంగ్రెస్‌ కలిసిపోతున్నాయనడానికి. 

అరరె.. స్వర్గీయ ఎన్టీఆర్‌, తెలుగుదేశం పార్టీని పెట్టిన ఉద్దేశ్యమేంటి.? ఇప్పుడు జరుగుతున్నదేంటి.? అని నిఖార్సయిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారు ఆవేదన వ్యక్తం చేయొచ్చుగాక.. స్వర్గీయ ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఎప్పుడో మాయమైపోయింది. ఇప్పుడున్నది చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనే. ఆ చంద్రబాబు టీడీపీ కూడా తెలంగాణలో అంతర్ధానమైపోయి, రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త టీడీపీగా రూపాంతరం చెందే రోజు అతి త్వరలోనే చూడబోతున్నామేమో.! 

తెలంగాణలో సంగతి తర్వాత.. 2019 ఎన్నికలో ఒంటరిగానే పోటీ చేయదలచుకున్నాం.. అని ఏపీలోనూ టీడీపీకి తలాక్‌ చెప్పే ప్రయత్నాల్లో బీజేపీ వున్న దరిమిలా, అక్కడ టీడీపీ సంగతేంటట.? అక్కడా బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు, కాంగ్రెస్‌తో జతకడ్తారా.? ఏమో, గుర్రం ఎగరావచ్చు.!

Show comments