ఏపీ అభివృద్ధి బాటలోనే పయనిస్తోందా?

'ఇంట్లో ఈగల మోత...బయట పల్లకి మోత'...అనే సామెత మనకు తెలుసు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌కు వర్తింపచేసుకుంటే 'ప్రభుత్వంలో పల్లకి మోత...ప్రతిపక్షాల్లో ఈగల మోత' అని చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని, డెవలప్‌మెంటులో దూసుకుపోతోందని ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే, రాష్ట్రం వెనకబడిపోయిందని, ప్రత్యేక హోదా ఇవ్వందే అభివృద్ధి సాధ్యం కాదని, యువతకు ఉద్యోగాలు దొరకవని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని, వందలాది పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని సర్కారు చెప్పుకుంటుంటే, రాష్ట్రానికి ఇప్పటివరకు చెప్పకోదగ్గ పరిశ్రమలు రాలేదని, ఉపాధి లేక యువత భవిష్యత్తు అయోమయంగా ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 

ఒక్క ఏపీ ప్రభుత్వమే కాదు అభివృద్ధికి సంబంధించి ఏ ప్రభుత్వమైనా కాకి లెక్కలు చెబుతుంటుంది. సర్కారు గణాంకాలు ఒక విధంగా ఉంటే వాస్తవ పరిస్థితి మరోవిధంగా ఉంటుంది. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి గురించి మీడియాలో మారుమోగింది. కాని కొన్ని సామాజిక సంస్థలు, మీడియా సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో గుజరాత్‌ అభివృద్ధి 'డొల్ల' అని తేలింది. గుజరాత్‌ అభివృద్ధిపై అసలు నిజం ఇదంటూ పుస్తకాలు కూడా ప్రచురించాయి.  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అభివృద్ధిపై పాజిటివ్‌గా ప్రచారం చేస్తోందనుకోవాలి. 

ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడిపోయారు. హోదా లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. దాన్ని ఎస్టాబ్లిష్‌ చేయడం కోసం అప్పుడప్పుడు రకరకాల గణాంకాలు చెబుతున్నారా? కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంతకాలం దానిపై బాబు రకరకాలుగా మాట్లాడారు. ఒక దశలో ఏం మూట్లాడుతున్నారో ఆయనకే తెలియని పరిస్థితి ఏర్పడింది. హోదా కోసం ప్రతిపక్షాలు ఉద్యమించేసరికి ప్రజావ్యతిరేకత వస్తుందనే భయంతో ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు. అంటే అది లేకుండా బతకలేమనే కదా అర్థం. రక్తం మరుగుతోందన్నారు. దీంతో హోదాపై తాడోపేడో తేల్చుకుంటారని జనం అనుకున్నారు.

 కాని చివరకు ప్రత్యేక సాయానికి అంగీకరించి మళ్లీ హోదాను ఎద్దేవా చేయడం ప్రారంభించారు. అభివృద్ధి మాత్రం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే ప్రచారం విదేశాలకు వెళ్లినప్పుడూ కొనసాగిస్తున్నారు. గతంలో చైనాకు వెళ్లినప్పుడు ఏపీ అభివృద్ధి గురించి చైనీయులకు ఊదరగొట్టేశారు. ఆయన చెప్పిందాంట్లో ఎంత వాస్తవముందో తెలియదు. ఇండియా సగటు వృద్ధి రేటు 7.6 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి రేటు 10.99 శాతం ఉందన్నారు. అంటే 11 శాతమని చెప్పుకోవచ్చు. ఇంత అభివృద్ధి రేటు ఉండటం వాస్తవమేనా? లేక చైనీయులను ఆకట్టుకునేందుకు ఇలా చెప్పారా?  వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం అభివృద్ధి సాధిస్తామని వారితో చెప్పారు.  

వ్యాపార రంగంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల్లో మూడో స్థానంలో ఉందని చెప్పారు. ఇండియాలో తమది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని చంద్రబాబు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకులకు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్రం 12.6 శాతం వృద్ధి రేటు సాధించిందని, జాతీయ వృద్ధి రేటు 7.1 శాతమేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో 22.7 శాతం వృద్ధి సాధించామన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఈ గణాంకాలన్నీ మరోసారి వల్లె వేశారు. 

2018 వరకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామంటున్నారు. కాని నిపుణులు అది అసాధ్యమని చెబుతున్నారు. రాష్ట్రం కొన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండొచ్చు. కాదనం. దాన్ని పట్టుకొని పాలకులు ఊదరగొట్టేస్తుంటారు. కొన్ని రంగాల అభివృద్ధిని మొత్తం రాష్ట్రాభివృద్ధిగా చెబుతుంటారు.  పాలకులు చెప్పేదాంట్లో నిజానిజాలు సామాన్య ప్రజలకు తెలియవు. ప్రభుత్వం మీడియాకు విడుదల చేసే గణాంకాలన్నీ నిజమని అనుకోకూడదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం ప్రకటించకముందు రాష్ట్రానికి తాను చేసిన సాయంపై లెక్కలు చెప్పాలని పట్టుబట్టింది. 

అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపిన లెక్కలను కేంద్రం ఒప్పుకోలేదు. తప్పుడు లెక్కలు చూపారని ఆరోపించింది. దీనిపై టీడీపీ, బీజేపీ నాయకులు మాటల తూటాలు విసురుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు చాలా గొప్పగా సాయం చేశామని కేంద్రం చెప్పుకుంది. ఆ వెంటనే తెలంగాణ సర్కారు దాన్ని తిప్పికొట్టి కేంద్రాన్ని నిలదీసింది. బడ్జెట్లు 'గణాంకాల మాయ' అని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటం మనకు తెలుసు. ఏపీ నిజంగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తే సంతోషమే. కాని మసిపూసి మారేడుకాయ చేస్తే ప్రజలు ఊరుకోరు.

Show comments