బాబు కాదంటే అవునని అర్థం అంట

చంద్రబాబు ఇవ్వను అంటే ఇస్తాను అని అర్థం అంట. ఈ కొత్త సీక్రెట్ ను చెప్పింది మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి. చిత్రంగా వుందీ వ్యవహారం. అసలు చంద్రబాబు మాట ఇస్తారు కానీ చేయరు అని ప్రతిపక్షం విమర్శిస్తూంటుంది. అందుకు సాక్ష్యంగా ఆయన ఇచ్చిన నెరవేరని, నెరవేర్చని హామీలు గుర్తుచేస్తుంటుంది.

కానీ ఇప్పుడు సోమిరెడ్డి చెప్పింది కూడా రివర్స్ లోనే వుంది. బాబు ఎవరికైతే పదవి ఇవ్వను అని చెబుతారో, వారికే ఇస్తారు అని. మంత్రి సోమిరెడ్డి ఓ ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు. తను చంద్రబాబును ఓసారి కలిసినపుడు, మంత్రి పదవికి ఒత్తిడి చేయద్దు, ఇవ్వను అని చెప్పారని, అయితే ఆయనకు ఓ అలవాటు వుందని, ఇవ్వను అన్నవారికే ఇస్తారని, అది తెలిసి తాను ఊరుకున్నానని వివరించారు. మంత్రివర్గ విస్తరణకు రెండు రోజుల ముందు కలిసినపుడు బాబుతో మాట్లాడినపుడు కూడా తనకు అర్థమైపోయిందని, వెంటనే తన భార్యకు ఫోన్ చేసి, మంత్రి పదవి గ్యారంటీ అని చెప్పేసానని అన్నారు. అంటే బాబు ఇస్తాను అంటే ఇవ్వనని, ఇవ్వను అంటే ఇస్తానని అర్థం చేసుకోవాలన్న మాట.

Show comments